దశభుజ, ముక్కంటి హనుమంతుడు


భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామి కీర్తికెక్కాడు. అలాగే సాధారణంగా మనం హనుమంతుని రాముని పాదాల వద్దో, సంజీవిని పర్వతాన్ని ఎత్తుకునో, రామలక్ష్మణులను తన భుజాలమీద ఎత్తుకుని ఆకాశంలో ఎగురుతున్నట్టుగానో దర్శనమిస్తారు. కానీ మూడు కళ్ళు, పది భుజాలు కలిగిన ఆంజనేయస్వామిని ఎప్పుడైనా చూసారా?
ఆంజనేయస్వామి నుదురుపైన మూడో కన్నుతో, పది భుజాలతో మనకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళం పట్టణంలో ఉన్న ఆలయంలో భక్తుల పూజలందుకుంటూ దర్శనమిస్తారు.
త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన తరువాత నారదుడు రాముణ్ణి దర్శించుకుని "రామా ... లంక నాశనముతో మీ యుద్ధము ముగియలేదు. రావణుని వారసులు ఇంకా ఉన్నారు, వారు మీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాచుకుని వున్నారు. వారు ఇప్పుడు సముద్రం అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. మీరు వారి తపస్సు పూర్తీ కాకమునుపే వారిని సంహరించాలి'' అని వేడుకున్నాడు.

దానికి రాముడు "నారదా ... రామావతారంలో నా కర్తవ్యమ్ పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలిస్తున్నాను కాబట్టి ఇంకెవరినైనా ఎంపికచేయండి'' అని బదులిచ్చాడు. రాక్షస సంహారానికి ఆంజనేయస్వామే తగినవాడని అందరూ నిర్ణయించడంతో విష్ణుమూర్తి తన శంఖుచక్రాలను, పరమశివుడు తన మూడో కంటిని, బ్రహ్మదేవుడు తన కమండలాన్ని ఇతర దేవతలనుంచి పది ఆయుధాలు పొంది హనుమంతుడు దశభుజుడయ్యాడు. పరమశివుని మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. హనుమంతుడు రాక్షస సంహారణానంతరం విజయంతో తిరిగి వచ్చి ఆనందమంగళం ప్రాంతంలో వెలిశాడు. భక్తులు ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి పూజిస్తున్నారు. రాక్షస సంహారంతో ఆంజనేయుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.