జంతూనాం నరజన్మ దుర్లభం
జంతూనాం నరజన్మ దుర్లభం అంటే ప్రాణ కోటిలో మనుష్య జన్మ
లభించటం గొప్ప అదృష్టం అని మహనీయులు చెప్తుండగా లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో,
ఎందుకు బ్రతకాలో తెలియని వారే అనేకులు
కనబడుతున్నారు. విజ్ఞుడైన మనుష్యుడు ఇహమున ధర్మ, భోగాలని; పరంలో ముక్తిని సాధించటం
కోసం బ్రతుకుతాడు. జన్మ సార్థకం అవడానికి ఏది సాధించాలన్నా ఉత్తమ మార్గం ధర్మాచరణ.
అట్టి ధర్మాన్ని ఆచరించటానికి ప్రధాన సాధనం ఈ శరీరమే. అందుకే "శరీర మాద్యం
ఖలు ధర్మసాధనం" అని ఋషులచే పేర్కొనబడింది. కాబట్టి ధార్మికుని ప్రథమ కర్తవ్యం
అటువంటి ధర్మ సాధనమైన శరీరాన్ని రక్షించుకొనటమే. ఏదైనా సాధించాలంటే సాధనం
బాగుండాలి. తుప్పు కట్టిన కత్తితో యుద్ధం చేయలేడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేవాడు
సాధనమైన కత్తికి పదును పెట్టుకోవాలి. ప్రయాణానికి సాధనం వాహనం. ప్రయాణం
చేయదల్చుకొన్నవాడు వాహనాన్ని బాగుచేసుకొనాలి. అలాగే ధర్మకార్యం చేయాలన్నా ముక్తిని
పొందాలన్నా సాధనమైన శరీరాన్ని అనుకూలంగా సిద్ధం చేసికొనాలి. ఆ లక్ష్యంతో మనకు
మహర్షులు అందించిన మార్గమే సదాచారం. సదాచారం వలననే మంచి బుద్ధిని, బుద్ధిననుసరించి నడువగల్గినట్లు శరీరాన్ని దిద్ది
తీర్చుకోగల్గుతాము.
ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు తమ అంతిమ దశలో
భగవంతుని ప్రార్థిస్తూ తాను మరల పుడితే భారతదేశంలో పుట్టాలని కోరుకున్నాడట. ఇక్కడ
పుట్టిన వారికా విలువ తెలియక ఈ పుణ్యభూమిని నిందిస్తున్నారు. ఆ పండితుడు అలా
అనుకోవడానికి ప్రధానకారణం ఇక్కడి ఉత్తమ జీవన విధానం. సదాచార పూర్ణమైన జీవన విధానం.
ఈ భారతీయుల జీవితంలోని ప్రధాన జీవం సదాచారమే అనే సత్యాన్ని గ్రహించిన నాడు
వ్యక్తికి గాని, ఈ సమాజానికి గాని ధన్యత
చేకూరి తీరుతుంది.
నిండా నూరేళ్ళు బ్రతికి సర్వవిధాల ఉన్నతిని సాధింపదగిన
మనుష్యుడు అల్పాయుష్కుడై అకాల మరణం వాత పడుతున్నాడు. మరణమైనా కొంతమేలేగాని కొందరు
జీవించినంత కాలం రోగ పీడితులై తమకు, తోటి వారికి కూడా
భరింపరాని రీతిలో జీవింపగల్గుతున్నారు. "ఎప్పుడు ప్రాణం పోతుందా" అని
ఎదురు చూచే స్థితికి కూడా వస్తున్నాడు. ఇహమునకు, పరమునకు కొరగాని పాడుజన్మను నిందించుకొనుట తప్ప అట్టి వారు
చేయగలదిలేదు. సదాచార సంపద సాధిస్తే వారికీదురవస్థ ఏపడదు. చతుర్విధ పురుషర్థ సాధనే
జీవిత లక్ష్యం. "ధర్మార్థ కామ మోక్షాణాం మూలముక్తం కళేబరం" అని అన్నిటికీ
ఈ దేహమే మూలం కాబట్టి దీని రక్షణను సత్త్వ మార్గంలో జ్ఞాన మోక్షములకు అర్హమగునట్లు
చూచుకొనాలి. ఇది ఐహిక భోగాన్నికోరుకొనేవారికే కాదు శరీరాన్ని అశాశ్వతంగా తలచే
వేదాంతులకైనా తప్పదు. అందుకే "సర్వ మన్యత్ పరిత్యజ్య శరీర మనుపాలయేత్"
అని అగ్నివేశముని అన్నిటినీ వదలి ముందు శరీరాన్ని రక్షించుకోమన్నాడు.
"బలవర్ధకాహారాలు, కావలసినన్ని మందులతో
శరీరాన్ని కాపాడుకోవచ్చుకదా!" అని ప్రశ్నింపవచ్చు. అలా కాపాడుకొనే దేహం
ఇహానికే తప్ప పరానికి పనికి రాదు. సార్థక జన్మ కాదు.
అలా జన్మ సార్థకత
సాధించుకొనటానికి ఏకైక మార్గం సదాచారం. ఆ మార్గంలో నడచిన శరీరం మాత్రమే పురుషార్థ
సాధకమైన హైందవ పవిత్ర శరీరం కాగలదు. సదాచారం వలన సమస్తము చేకూరుతాయి. మను ధర్మ
శాస్త్రం "ఆచారా ల్లభతే హ్యాయు: - ఆచారా దీప్సితా: ప్రజా:| ఆచారా ద్ధన మక్షయ్యం - ఆచారో హం త్యలక్షణం|| అని సదాచారం వలన ఆయుర్ధాయం పెరుగుతుందని, సత్సంతానం లభిస్తుందని, తరగని సంపద చేకూరుతుందని, దుర్లక్షణాలన్నీ తొలగిపోతాయని చెప్తోంది. అది నిజం. సదాచార
పరుడు అకాల మృత్యువు వాత పడడు. "అకాల రతి క్రియల వల్ల దుర్జనులు
పుడతా"రని శాస్త్రం చెప్పింది. ఆ విషయం "సంధ్యా సమయంలో సంభోగం
చేసినందువల్ల విశ్వవో బ్రహ్మ సంతానం రావణ కుంభకర్ణాదులు రాక్షసులయ్యా" రని
పురాణం నిరూపిస్తోంది. అలా కాక సదాచార పరులైతే వారికి తప్పక సత్సంతానమే
కలుగుతుంది. లోకంలో పుట్టే దుర్మార్గుల జన్మలకి ఇలాటి సదాచార లోపమే మూలం.
"ఆరోగ్యమే మహాభాగ్య"మన్నట్లు సదాచారం చే దుర్వ్యయాలు లేక సంపద నిలచి
ఉంటుంది. ఇక్కడ ఆచారమంటే అనర్థదాయకమైన మూడాచారం కాదు. ఆ మూడాచారం దు:ఖ హేతువు.
సదాచార ధర్మాలు ఎప్పుడూ మానవులకు సుఖశాంతులనే ప్రసాదిస్తాయి. అందుకే
"సుఖార్థా: సర్వభూతానాం - మతాః సర్వాః ప్రవృత్తయః | సుఖం చ న వినా ధర్మః - తస్మాత్ ధర్మ పరో భవ |" అని ప్రాణులకు సుఖ సంపాదకములుగానే మన మత ధర్మాలు
ఏర్పడ్డాయి. మూఢాచారంతో స్నాన, అన్న, పానములు అక్రమంగా చేసి ధర్మాన్ని నిందించడం తగదు. ఒక
డాక్టరు గారు స్వయంగా చెప్పిన సంఘటన ఇది. ఒకామె వ్యాధి గ్రస్తురాలైంది. శిరస్నానం
తగదని చెప్పినా వినక అలాగే చేస్తూ దేవుళ్ళకు మ్రొక్కేది. వ్యాధి నయం కాలా. కొన్నాళ్ళకు
బొట్టు లేకుండా కనబడి "క్రైస్తవమతం తీసుకున్నాక జబ్బు తగ్గిందండి" అంది.
డాక్టరుగారు "ఇప్పుడు శిరఃస్నానం చేస్తున్నావా? అనడిగితే లేదంది. నేను చెప్పినట్లుగా చేసి ఉంటే మతం
మారకపోయినా జబ్బు తగ్గి ఉండేది. నీ రోగం తగ్గడానికి కారణం మతం మార్పు కాదు. ఆచరణలో
మార్పు అన్నారట ఆ డాక్టరు గారు. అలా మూఢాచారాలు కూడా మన ధర్మానికెంతో అపకారం
చేస్తున్నాయి. హేతుబద్ధంగా సుఖశాంతులను కలిగించేదే మన సదాచారం అంతా. అలాకాని దశలో
అన్నీ మూఢాచారాలుగానే పరిగణింపబడతాయి. కాబట్టి యోగ్యమగు ఆచారమే నిల్పి ధర్మాన్ని
రక్షించాలి, శ్రౌత, స్మార్త కర్మలు చేయలేని వారికి సదాచారమే ఆ లోటు తీర్చగలది.