త్యాగరాజ రామ భక్తి - తెలియలేరు రామ భక్తి మార్గమును

సద్గురు త్యాగరాజ స్వామి  భక్తితో వేదాంతాన్ని బోధిస్తూ, సంఘంలో నెలకొని యున్న కొన్ని చేష్టలు, కుసంస్కారాలను తన కీర్తనల ద్వారా ఖండించే ప్రయత్నం చేశారు. అటువంటి ఒక కృతి తెలియలేరు రామ భక్తి మార్గమును. రామ నామమును ఉచ్చరిస్తూనే, నిజమైన రామభక్తిని తెలియని వారిని ఉద్దేశించి రచించినది ఈ కీర్తన. ధేనుక రాగం ఆది తాళంలో ఈ కీర్తన కూర్చబడినది. త్యాగయ్య ఈ రాగాన్ని మొట్ట మొదట ఉపయోగించారు.

సాహిత్యము:

తెలియలేరు రామ భక్తి మార్గమును

ఇలనంతట తిరుగుచును కలువరించేరే గాని |తెలియలేరు|

వేగలేచి నీట మునిగి భూతి బూసి వేళ్లనెంచి వెలికి శ్లాఘనీయులై
బాగ పైక మార్జన లోలులైరే గాని త్యాగరాజ వినుత |తెలియలేరు|

అర్థము: 
ఓ రామా! ఈ కుసంస్కారులు, దొంగ భక్తులు ప్రపంచమంతా తిరుగుతూ నిన్ను కలువరిస్తూ ఉంటారు. కానీ, నిజమైన శ్రీ రామ భక్తిని తెలియలేకున్నారు.

ఈ దొంగ భక్తులు, తాము మహా భక్తులమని లోకానికి తెలియటానికి - పొద్దునే లేచి, స్నానము చేసి, విభూతిని శరీరానికి పూసుకొని, చేతి వ్రేళ్ళను లెక్కించుకొనుచు (జపము చేస్తున్నట్టుగా నటన), అన్ని ప్రదేశాలు తిరుగుతూ, సామాన్య ప్రజలచే పొగడబడుతూ, బాగా డబ్బు సంపాయించటంలో మునిగి తేలుతూ ఉన్నారే కానీ రామ భక్తి మార్గమును తెలియలేకున్నారు.

పరిశీలన: 
ఈనాటి దొంగ స్వాములు, ఊరూరా వెలసిన పీఠాలు, మఠాలు వాటిలో జరుగుతున్న అత్యాచారాలు, దురాచారాలు, దుశ్చర్యలు - వీటన్నిటినీ త్యాగయ్య రెండువందల ఏళ్ల నాడే గమనించి, ఊహించి తన కీర్తనలో మనకు కళ్ళకు కనిపించేలా రచించారు.

సన్యాసులై రాసలీలలు, డబ్బుకోసం సన్యాసి వేషం వేసి రాయలేని, చెప్పలేని చెడు కార్యాలు చేసే ఎంతో మంది దొంగ స్వాములు, బయటికి కాషాయ వస్త్రాలు ధరించి, కొంగ జపంలా దొంగ భక్తి ప్రకటిస్తూ, నాలుగు గోడల మధ్య అత్యంత విలాసవంతమైన, భోగవంతమైన,   నీచ నికృష్ట కార్యాలు చేస్తున్న ఎంతో మంది స్వాములను మనము ప్రతి రోజు వార్తా మాధ్యమాల ద్వారా చూస్తూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము. ధర్మ పరి రక్షణ కోసం, ధర్మ ప్రచారం కోసం ఉపయోగించుకోవలసిన సన్యాసాశ్రమాన్ని భ్రష్టు పట్టించి, విద్య, విద్వత్తు, మంత్ర శక్తి, మహత్తు గల నిజమైన స్వాములకు, గురువులకు  కూడా హేతువాదులు, నాస్తికులు, అన్యమతస్థుల నోట చెడు పేరు ఆపాదిస్తున్న దొంగ భక్తులు, స్వాములు మన సమాజంలో ఉన్న అతి ప్రమాదకరమైన చీడ పురుగులు. ఎందుకంటే, ఇది విశ్వాసాన్ని పూర్తిగా వమ్ము చేసే వ్యవస్థ. భగవంతుని కనుగొనే మార్గంలో సహాయకునిగా ఉండవలసిన స్వాములు ప్రజల బలహీనతలను అవకాశంగా తీసుకుని వారిని మానసిక దౌర్బల్యానికి గురిచేసి మోసగించే ఒక భయంకరమైన వ్యవస్థ పుట్టగొడుగుల్ల మన దేశంలో వ్యాపిస్తోంది. దాన్ని ఖండించి, త్రుంచివేసి, అర్హత, నిరాడంబరత, సద్భక్తి కలిగిన గురువులను అనుకరించ వలసిన సమయం ఇది. ఈ కీర్తన ద్వారా దొంగ భక్తిని అద్భుతంగా వివరించారు త్యాగరాజు వారు.

కాబట్టి మనిషి యొక్క బాహ్య అలంకారములైన కట్టు, బొట్టు, రుద్రాక్షలు, విభూతి, నామములు, మాయ మాటలు, వారు చూపించే మాయలు, లోభాలకు మోస పోకుండా, వారికి తమ వ్యక్తిత్వాన్ని, శరీరాలను, ఆస్తులను తాకట్టు పెట్టకుండా, మనకు వారసత్వంగా వచ్చిన ఆధ్యాత్మిక సంపదను కాపాడే సద్గురువులను ఆశ్రయిద్దాము. మూఢ భక్తిని కాకుండా సద్భక్తిని, సత్సాంగత్యమును పెంపొందిన్చుకుందాం. రాముడు ఎటువంటి జీవనం గడిపాడు? దీని సమాధానంలో మనకు ఎటువంటి వారైతే సరైన గురువో అర్థం అవుతుంది. ఎక్కడైతే మన మనసుకు ప్రశాంతత కలుగుతుందో, ఎక్కడైతే మనలను ప్రలోభ పెట్టని వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే వ్యక్తిత్వ వికాస ప్రాధాన్యత ఉంటుందో, ఎక్కడైతే మన వ్యక్తిగత పరిధిలోకి శక్తులు ప్రవేశించే ప్రయత్నం జరగదో అక్కడ సద్గురువు ఉన్నట్లు. సద్గురు పాదుకాభ్యాం నమామి.

ఈ కీర్తనను రంజని, గాయత్రి యుగళ స్వరంలో చూడండి.గాయనీమణులు తమిళురు కావటం వలన  ఈ గాత్రంలో  కొన్ని ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. వాటిని వారి గురువులకు, తెలుగు పరిజ్ఞానానికి వదిలేద్దాము. నేను యూట్యూబ్లో ఈ దోషాలను ప్రచురించాను.