సాధనకు త్యాగరాజు సూత్రము - మనసా ఎటులోర్తునే
మున్నుడి:
సాధనా మార్గములో మనసు పరి
పరి విధాల అనేక దిక్కుల పరిగెడుతుంది. అట్టి పరిస్థితిలో, తాత్కాలిక మనో స్థితిపై నియంత్రణ లేక, గొప్ప గొప్ప వారే మార్గం
తప్పి భ్రష్టులైనారు. త్యాగయ్య ఆ కోతి మనసును ఉద్దేశించి స్వానుగతము ఈ కీర్తన
ద్వారా భావ గర్భితంగా చెప్పారు. ఎంతటి వారినైన త్వరగా తనవైపు ఆకట్టుకునేవి చెడు, విషయ వాంఛ, వ్యసనములు. అందుకే వాటిని ప్రలోభములు అని అన్నారు.
సామాన్యునికి వస్తువు, విషయము - మంచా, చెడా అన్న జ్ఞానము ఆ సమయములో పని చేయదు. ఆ విచక్షణ, వివేచన సరిగ్గా పనిచేయాలంటే ఇంద్రియ నిగ్రహము, స్థితప్రజ్ఞత, జ్ఞానము, విద్య, దైవ బలము ఎంతో అవసరం.
వీటిని సాధించటానికి భక్తి అనేది చాలా సులభమైన మార్గము. ఈ మార్గములో శరణాగతి అనేది
ఆవశ్యకము. ఈ కీర్తన ద్వారా త్యాగరాజు ఈ
సందేశాన్ని ఎంతో ఆర్తితో చెప్పారు త్యాగయ్య. మనసా ఎటులోర్తునే సాహిత్యము, అర్థము.
సాహిత్యము:
మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే
దినకర కుల భూషణుని దీనుడవై
భజన చేసి
దినము గడుపు మనిన నీవు
వినవదేల గుణవిహీన |మనసా|
కలిలో రాజ తామస గుణముల
కలవారి చెలిమి
కలసి మెలసి తిరుగుచు మరి
కాలము గడపకనే
సులభముగా కడతేరను సూచనలను
తెలియజేయు
ఇలను త్యాగరాజు మాట వినవదేల
గుణవిహీన |మనసా|
భావము:
ఓ మనసా! నిన్ను ఎట్లా
ఓర్చుకొనేది? నా మనవిని విను.
గుణవిహీనవైన ఓ మనసా!
సూర్యవంశమునకు భూషణుడు అయిన శ్రీరాముని దీనత్వముతో భజన చేస్తూ దినము గడుపుము అంటే
మాట వినకున్నావు ఎందులకు?
గుణవిహీనయైన ఓ మనసా! ఈ
కలియుగములో రాజస తామస గుణములు కలవారితో స్నేహితము చేసి, వారితో కలిసి మెలిసి తిరుగుచు కాల వ్యర్థా చేయక, సంసారమనే సాగరమును సులభముగా దాటే సూచనలు తెలియచేసే
త్యాగరాజు మాట వినవెందులకు? (వినుము అని అర్థం).
పరిశీలన:
సాధనలో విశ్వాసము, ఏకాగ్రత నెమ్మదిగా అలవడుతాయి. అంతవరకూ మనసు ఎన్నో దిక్కుల
పరుగెడుతూనే ఉంటుంది. కొన్నాళ్ళు యాంత్రికంగా అయినా, మనసుకు కళ్ళెం వేసి సాధనలో కూర్చో బెడితే, అటు తరువాత అది స్వయంగా సహకరిస్తుంది. పరిగెత్తేటప్పుడు
కళ్ళెం వేయటానికే మనకు మంత్ర జపము, పూజ విధానము, స్తోత్రములు, ఉపచారములు
(అత్యుత్తమైనది, అతి కష్టమైనది
ధ్యానము) ఆగమాలు నిర్వచించాయి. అటువంటి
పదహారు ఉపచారములలో ఒకటి కీర్తన చేయటం. అలాగే నవ విధ భక్తులలో కూడా కీర్తన ఒకటి.
అటువంటి కీర్తన ద్వారా త్యాగయ్య మనసును స్వాధీనములో ఉండమని, సరియైన మార్గములో నడువుమని ఉద్దేశించి ఈ కృతి చేశారు.
కలియుగ లక్షణము మూడు పాళ్ళు
అధర్మము, ఒక పాలు ధర్మము. అంటే
నలుగురిలో ముగ్గురు అధర్మ పరాయణులే. కాబట్టే, త్రిగుణములైన సాత్త్వికము, రాజసము, తామసములలో ఈ యుగములో రాజస
తామస గుణములు కలవారే ఎక్కువ. కానీ, భవత్ప్రాప్తికి కావలసినది
సత్సాంగత్యము. అంటే సాత్త్విక గుణములు కలవారి చెలిమి. పరమ భాగవతుని ముఖ్య గుణము
సత్త్వము. అంటే సత్యమును అన్వేషించుట, అనుభూతి పొందుట,
ఆచరణలో పెట్టుట, ఇతరుల పట్ల హింసను విడనాడుట, కరుణ దయ కలిగి యుండుట. ఈ సత్త్వమును జీవితములోని ప్రతి
క్రియలో అమలు పరుస్తాడు సాత్త్వికుడు, నిజ భక్తుడు.
అన్నిటికన్నా ఉన్నతమైనది భగవంతుడని నమ్మి కర్మలను చేస్తూ, ఫలితం ఆశించక, వచ్చిన దానితో
తృప్తి చెంది ధర్మమును నిర్వర్తిస్తాడు భాగవతుడు. ఇతరులను నొప్పించడు, తాను నొచ్చుకోడు సత్త్వికుడు. ఈ లక్షణాలు కలవారిని వెదికి
వారితో సాంగత్యము చేయుమని మనకు శృతి, శాస్త్ర
పురాణేతిహాసములు ఘోషిస్తున్నాయి. అదే సందేశాన్ని త్యాగరాజు ఈ కీర్తనలో చెడు
గుణములు కలవారి స్నేహితములో కాలము వృథా చేయకుండా భక్తి, జ్ఞాన వైరాగ్యములు కలిగిన సత్త్వసంపన్నుల సంగతి కలిగి
పరమాత్మను కనుటలో కాలం గడుపుము, నా మాట వినుము అని
నివేదిస్తాడు.
ఇంత కన్నా గొప్ప ఆధ్యాత్మిక
సందేశము ఏముంటుంది?. అందుకే ఆయన స్వామి, మహానుభావుడు, ఋషి, పరమ భక్తుడు అయ్యాడు. మనసా ఎటులోర్తునే మల్లాది సోదరుల
గళంలో వినండి, చూడండి.