వాలి రావణులు స్నేహం

నిన్న స్నేహంగురించిన ముందుమాటతో మొదలైనది, నేడు వాలి రావణ స్నేహం గురించిన విషయాలను పరిశీలించే ప్రయత్నం.

నాయక-ప్రతినాయకులైన రామ రావణులిద్దరూ, అగ్ని సాక్షిగా చేసిన స్నేహాలను పరిశీలించాలి. అందరికీ తెలిసిన స్నేహం శ్రీరాముడూ-సుగ్రీవుల స్నేహం. కానీ అంతగా తెలియనిది వాలీరావణులది. వాలి-రావణులు పరస్పరం అగ్నిసాక్షిగా చేసుకున్న స్నేహంయొక్క వృత్తాంతాన్ని తెలుసుకోవాలంటే, ఉత్తర కాండ 34వ సర్గను చదవాలి. వరగర్వంతో ఒళ్ళుకొవ్వెక్కున్న రావణుడు, తెలిసిన వీరులందరినీ కవ్వించి యుద్దం చేస్తుండేవాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో పరాభవం రుచి చూసినా బుద్ధి రాక, కిష్కిందకు చేరి, వాలితో యుద్ధం చేయాలని తలపోస్తాడు. అసలు యుద్ధం చేయకుండానే వాలి శక్తి ఏంతటిదో తెలుసుకొని, వేనోళ్ళ కొనియాడుతాడు. రాజీకి దిగి, బ్రతిమిలాడి అగ్ని సాక్షిగా స్నేహం చేసి, తన భార్యాపుత్రులతో సహా తన సర్వస్వానికి వాలికి కూడా తనతో సమానమైన అధికారం ప్రకటిస్తాడు. వాలి అలాంటి లేకి ప్రకటనలేవీ చేయలేదనుకోండి! ఒక నెలపాటు కిష్కిందలో గడిపిన తరువాత లంకకు తిరిగి చేరుకుంటాడు.

తప్పుడు స్నేహం
యుద్ధం కాదు కదా, కనీసం వాలి పట్టునుండికూడా తప్పించుకోలేక జడిసిన రావణుడికి రెండే దారులు. మొండిగా యుద్ధం చేసి, వాలి చేతిలో మరణించడం లేదా చిత్తకార్తిలో బలమున్న కుక్కను చూసి భయపడే బలహీన కుక్కకుమల్లే తోకా-చెవులు వంచుకొని ఆధిక్యతను ఒప్పుకోవడం. వాలి తనంతట తాను రావణుడితో యుద్ధానికెళ్ళలేదు. వాలికి రావణుడి రాజ్యంతో కానీ, సంపదతో కానీ ఎటువంటి పనీ లేదు. అసలు ఆసక్తే లేదు. దురదకొద్దీ వరబలగర్వంతో అవసరంలేని యుద్ధానికి వచ్చిన ఓ ఆబోతువంటివాడు మాత్రమే వాలి దృష్టిలో రావణుడు. యుద్ధం చేయకనే నావన్నీ నీవిఅని శరణుజొచ్చినవాడితో స్నేహం చేయటంలో పెద్ద నష్టమేమీ కనిపించి ఉండదు. వైరం పెట్టుకున్నా, స్నేహం చేసినా వాలికి పెద్దగా లాభము లేదు. కానీ నష్టమూ లేదని తప్పు అంచనా వేశాడు. మరి రావణుడో? తన పరువు నిలబెట్టుకోడానికి మాత్రమే అగ్నిసాక్షిగా చేసిన స్నేహం అది. అగ్ని సాక్షి వల్ల, ఇంకెప్పుడూ వాలితో యుద్ధం రాకుండా ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ ఎప్పుడన్నా వాలికి అవసరం పడుంటే, రావణుడు వాలికి సహాయం చేసి ఉండే వాడా? ఖచ్చితంగా లేదు. ఇది నా అంచనా కాదు నిరూపణ ఉన్నది.

ఇక యుద్ధం మొదలవబోతోందనగా, చివరి యత్నంగా శ్రీరాముడు వాలి పుత్రుడైన అంగదుడిని దూతగా రాయబారం పంపుతాడు. అంగదుడు శ్రీరాముని రాయబారాన్ని తెలిపిన తరువాత, మరే సంభాషణ ఉండదు. వెంటనే రావణుడు కనులెర్రజేసి వెంటనే ఈ దురాత్ముని బంధించి వధించి వేయుడుఅని మంత్రులను పదేపదే శాసిస్తాడు. (యుద్ధకాండ 41వ సర్గ / 82వ శ్లోకం)

వాలి మరణించిన తరువాత, రావణుడు పట్టించుకున్నట్టు, ఎక్కడా లేదు. పోనీ, వాలి వధ గురించి తెలియదనుకుందాము.

అగ్నిసాక్షిగా స్నేహం చేసిన వాలి తమ్ముడైన సుగ్రీవుడిమీద ఎటువంటి ఆదరాభిమానములు చూపించలేదు. తన సోదరుడైన విభీషణుడినే కాదన్నవాడు, వాలి సోదరుడినేం ఆదరిస్తాడులే అని దాన్నీ విడిచిపెడదాం.

కానీ కేవలం దూతగా వచ్చిన, తన మిత్రుడి కొడుకైన అంగదుడిని నిష్కారణంగా చంపమనడమేంటి? దీన్ని బట్టి, రావణుడికి స్నేహం పట్ల ఉన్న విలువ తెలిసిపోతుంది. తన స్నేహితుడి కొడుకును చంపటానికి సిద్ధపడినవాడు, అవసరం పడుంటే, వాలికి ఏ సాయం చేసుండేవాడు?

వాలి-కార్తవీర్యార్జునులవంటి వారి చేతిలో ఓడి, అగ్ని సాక్షిగా రావణుడు ఏర్పరుచుకున్న స్నేహాలన్నీ, తనకు మున్ముందు వారితో యుద్ధం జరగకుండా చేసుకున్న ఏర్పాట్లే తప్ప, స్నేహం విలువ తెలిసి కాదు.

శ్రీరాముడు తేలికగా సీతమ్మను తిరిగి దక్కించుకునే ఉపాయం వాలితో స్నేహం. ఉత్తమ క్షత్రియ వంశజుడైన శ్రీరామునితో స్నేహం చేయడానికి, వాలి ఇట్టే ఒప్పుకొనుండే వాడు. కన్ను మూసే ముందు, ఈ మాట వాలి తనే అంటాడు. యుద్ధంతో పనిలేదు. కేవలం సీతమ్మను తిరిగి అప్పజెప్పమని వాలి ఒక కబురు పంపి ఉంటే సరిపోయేది. వెంటనే రావణుడు మర్యాద పూర్వకంగా సీతమ్మను తోడ్కొని వాలి ముందు వాలిపోయేవాడు. కానీ శ్రీరాముడు వాలితో పోలిస్తే తక్కువ బలమున్న సుగ్రీవుడితోనే ఎందుకు స్నేహం చేశాడు?

రావణుడివంటి దుష్టులతో తేలికగా స్నేహం చేశాడంటే, వాలికి స్నేహంపట్ల ఉన్న గౌరవాన్ని మనమే అంచనా వేయగలిగితే, శ్రీరామునికో లెక్కా? ఏనాడైతే వాలి, రావణాసురుడి వంటి వారితో స్నేహం చేశాడో, అప్పుడే, అతని పతనం మొదలైపోయింది. కాకపోతే, తెలియదంతే. తప్పుడు స్నేహంవల్ల ఇంద్రాంశతో జన్మించినా, వాలి శ్రీరాముడి స్నేహాన్ని పొందలేకపోయాడు.

 వాలి-రావణుల వ్యక్తిత్వాలకి, సారూప్యాలు కూడా ఉన్నాయి. వారి శారీరిక బలం బుద్ధి బలాం కన్నా ఎక్కువ. వారు అనుకున్నదే నిజం. ఇద్దరూ ఎకోదరులను వెళ్ళగొట్టినవారే! విభీషణుడు తనకు నచ్చని నిజం చెప్పాడని, కించ పరిచి తరిమేస్తాడు రావణుడు. తనకు హాని చేశాడని అపార్థం చేసుకొని, సుగ్రీవుడి ప్రాణాలనే తీయాలని, వాలి ప్రయత్నిస్తాడు. తనకు సంబంధం లేని శ్రీరాముడి భార్య ఐన సీతమ్మను భర్తనుంచి రావణుడు వేరుచేస్తే, తన సోదరుడి భార్య ఐన రుమనే, ధర్మ విరుద్ధంగా, భర్తనుండి వేరు చేస్తాడు వాలి. ఇన్ని పోలికలున్నాయి కాబట్టే, వాలికి రావణుడితో అవసరంలేని స్నేహం చేయాలన్న ప్రచోదనమైంది. 

శ్రీరాముడు రావణుడిని ఎలా చూస్తాడో, వాలినీ అలానే చూస్తాడు. తన భార్య ఐన సీతను అపహరించి రావణుడు ఎంతటి అపరాధం చేశాడో, తన తమ్ముడి భార్యను బలవంతంగా తన వద్దనే ఉంచుకొని, వాలి అంతకన్నా పెద్ద తప్పు చేశాడు. అలాంటి వాలి కోరి వచ్చి సహాయం చేస్తానన్నా, అతని చరిత్ర తెలిసి శ్రీరాముడు ఒక్కనాటికి ఒప్పుకోడు.

ఎంతమంది వాలి వంటి శక్తిమంతులు స్నేహం కలుపుకోడానికి మనను ఆకర్షించరు? ఎంతమంది రావణాసురుడివంటి వారు స్నేహానికై చేయి చాపరు? వాలివంటి వారిని మనము ఆశ్రయించాలి; రావణుడి వంటి వారు వారంతట వారే మనను ఆశ్రయిస్తారు.


వాలివంటివారిని కాస్తంత తేలికగా గుర్తు పట్ట గలిగినా , పది తలలతో నేను రావణాసురుడినిఅని ఎవరి ముఖానా కనిపించదు. కానీ తక్కువ సమయంలోనే వారి రావణ ప్రవృత్తి తెలిసిపోతుంటుంది. అలా తెలిసినప్పుడు, నిర్మొహమాటంగా అటువంటి వారితో స్నేహం వెంటనే వదిలించుకోవడం శ్రేయస్కరం. అలా జాగ్రత్తపడకపోతే, నిజమైన స్నేహితులు ఇక దొరకరు. మంచి స్నేహం అనేది గొప్ప వరం. తప్పుడు స్నేహాలు చేసి, చేజేతులా మంచి స్నేహితులు లభించే అవకాశాలను పాడు చేసుకోకూడదు.