శ్రీరామ గుహులు స్నేహం

నిషాదరాజైన గుహుని పరిచయం, అయోధ్యకాండలోని 50వ సర్గతో మొదలవుతుంది. అయోధ్యనుండి బయలుదేరిన సీతాసహిత శ్రీరామలక్ష్మణులు, గంగానది ఒడ్డుకు చేరుకున్నపుడు, శ్రీరాముని ఆదేశంమేర, సుమంత్రుడు రథాన్ని నిలుపుతాడు. 32వ శ్లోకంలో వాల్మీకి మహర్షి, ఇతడిగురించి మొదటిసారి ప్రస్తావిస్తారు. గుహుడుఅనునతడు ఆ ప్రదేశమునకు అధిపతి. అతడు శ్రీరామునకు భక్తుడు, ఆత్మీయుడు, మిత్రుడు, నిషాదజాతివాడు, చతురంగబలములు గలవాడు, ఉత్తమపరిపాలకుడుగా పరమభక్తుడుగా వాసిగాంచిన వాడు – 32.

శ్రీరామ గుహులు
దీన్ని బట్టి గుహుని గురించి ఒక అంచనాకు రావచ్చు. శ్రీరాముడు-గుహులు ముందే ఒకరినొకరు కలిసి ఉండాలి. 50వ సర్గ మొదటిశ్లోకం బట్టి, ఈ నిషాదుడు పరిపాలిస్తున్న ప్రదేశం, కోసలదేశాని అవతల ఉంది. కాకపోతే, దశరథ మహారాజు పుత్రప్రాప్తికోసం అశ్వమేధ యాగం చేశారు - కాబట్టి కోసలరాజ్యానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు, ప్రదేశాలు అన్నీ ఇక్ష్వాకు వంశస్థుల పాలనలోని సామంత రాజ్యాలే అయి ఉండాలి. అటవీ ప్రదేశానికి ప్రభువైన గుహుడు, ముందే శ్రీరాముని కలిసి, ఆయన వ్యక్తిత్వానికి ఆకర్షితుడై ఉండి ఉండాలి. 


ఈ సంధర్భంలో శ్రీరాముని భక్తుడుఅంటే ఆయనని ఎంతగానో మెచ్చే నమ్మిన బంటు అని అనుకోవడం సబబేమో! ఇక శ్రీరాముడు అలాంటి వారిమీద ఆధిపత్యం చూపించే రకం కాదు. అతని ప్రభుభక్తికి ప్రసన్నుడై, గుహుడిని ఒక సామంతుడిగా కాక, ఒక స్నేహితుడిగా పరిగణించేవాడేమో. శ్రీరాముడు తనకడకు వచ్చుచున్న నిషాదరాజైన గుహుని దూరమునుండి చూచి, లక్ష్మణునితోగూడి ఎదురేగి, అతనిని కలిసికొనెను – 34. అంతట గుహుడు నారచీరలను ధరించియున్న శ్రీరాముని జూచి సంతప్తుడై, ఆయనను కౌగిలించుకొని, ఇట్లనెను. ప్రభూ! ఈ రాజ్యము మీకు అయోధ్యవంటిది. నేను మీ సేవకుడను. ఏమిచేయవలెనో తెలుపుడు. ఓ మహాబాహూ! మీవంటి ప్రియమైన అతిథి ఎవరికి లభించును?” – 35, 36. “ఓ మహాబాహూ! మీకు స్వాగతము. ఈ రాజ్యమంతయును మీదే. మీరు మాకు ప్రభువులు, మేము పరిచారకులము. కావున సాదరముగా ఈ రాజ్యమును పరిపాలింపుడు” – 38. ఇలా 34 నుండి 38 వరకున్న శ్లోకాలు, వీరిద్దరూ తటస్థపడిన సంఘటనను వర్ణిస్తాయి. ఒకరిమీద ఒకరికి గల స్నేహం, ఆప్యాయతలు చక్కగా కనిపిస్తున్నాయి.

శ్రీరామ గుహులు
శ్రీరామ గుహులు
తర్వాత గుహుడు, ఎన్నోరకాలైన అన్నపానీయాలు సిద్ధ పరుస్తాడు. కానీ శ్రీరాముడు మర్యాదపూర్వకంగా తాను చేస్తున్న వనవాసవ్రతంకారణంగా, ఇటువంటివి భుజించకూడదని చెప్పి, సుమంత్రుడు తమను సాగనంపడానికి తెచ్చిన రథం గుఱ్ఱాలకు మాత్రం తగిన మేత వేయమని చెబుతాడు. ఆ రాత్రి పడుకోడానికి గుహుడు ఆరుబయట అరటిదొప్పలతో కూర్చిన పాన్పుపై, శ్రీరాముడు సీతమ్మతో శయనిస్తాడు. లక్ష్మణ గుహులు మాత్రం శ్రీరాముడి పరిస్థితి చూసి బాధ పడుతూ, ఇద్దరు భక్తులు దైవస్మరణతో మేల్కొనిఉన్నట్టు, రాత్రంతా ఆయన గురించి మాట్లాడుకుంటూ - కాపలా కాస్తు మెళకువగానే ఉంటారు.

మరునాడు సుమంత్రుడిని అయోధ్యకు తిరుగుప్రయాణం కమ్మని చెప్పి, గుహుడివద్దనుండి గునపము - గంప మొదలైనవి తీసుకొని, గుహుడి నావనెక్కి గంగ దాటుతారు.

ఇక్కడ చెప్పుకోవలసిన విషయం మరొకటి ఉంది. మహాప్రభో! తమరి కాలు తాకి ఱాయి ఆడదయిందట; ఇప్పుడు మీ పాదాలు తాకితే, నా నావ ఎమవుతుందో? అంచేత తమరి పాదాలు కడిగిన తరువాతనే, నా నావనెక్కండిఅన్నట్టు చాలామందికి తెలుసు. కానీ, ఈ విషయం వాల్మీకంలో లేదు. ఇది వాల్మీకి విరచిత రామాయణాంతర్గతం కాదు. మరెక్కడుంది? నాకు తెలిసినంతమటుకు దీని ప్రస్తావన తులసీదాసు విరచిత రామచరితమానస్‌లో ఉంది. లీలగా గుర్తు! బహుశః నా ఎనిమిదవ తరగతి హిందీ పాఠ్యపుస్తకంలో మొదటిసారి గుహుడిగురించి విన్నది. హిందీ చదవగలవారికోసం పొందుపరుస్తున్నాను.

माँगी नाव न केवटु आना । कहइ तुम्हारा मरमु मैं जाना ॥
चरन कमल रज कहुँ सबु कहई । मानुष करनि मूरि कछु अहई ॥
छुअत सिला भइ नारि सुहाइ । पाहन तें न काठ कठिनाई ॥
तनरिउ मुनि धरिनी होइ जाई । बाट परइ मोरि नाव उड़ाई ॥
एहिं प्रतिपालउँ सबु परिवारू । नहिं जानउँ कछु अउर कबारु ॥
जौं प्रभु पार अवसि गा चहहू । मोहि पद पदुम पखारन कहऊ ॥

నిజంగా గుహుడు ఆ మాట అన్నాడా లేదా అన్న ప్రశ్న పక్కనుంచితే, దీనిలో ఉన్న గడుసుతనంతో కూడుకున్న భక్తి ఆకట్టుకుంటుంది.

కొంతకాలం తరువాత రామయ్యను వెతుక్కుంటూ, సైన్య సపరివార సమేతంగా వచ్చిన భరతుడితో సంభాషించినప్పుడు గుహుడి ఆప్యాయత, స్వామిభక్తి, స్నేహం గురించి పూర్తిగా తెలుస్తుంది. ఆటవికుడు కాబట్టి, స్వహతాగా గుహుడు అమాయకుడు. వీళ్ళకు పట్టణవాసుల్లా మెలగడం రాదు.  అంతటి సైన్యంతో వచ్చాడుగనక, గుహుడికి అందరిలాగే భరతుడి మీద అనుమానం కలుగుతుంది. శ్రీరాముడికి ఏ హాని తలపెట్టి వచ్చాడో అని, అప్రమత్తుడై తనవారికో వింత ఆదేశం ఇస్తాడు. ఇదంతా, 84వ సర్గలో తెలుస్తుంది. ఈ కైకేయీసుతుడు (భరతుడు) శాశ్వతముగా దశరథమహారాజుయొక్క సుసంపన్నమైన రాజ్యలక్ష్మిని తన హస్తగతముచేసికొనదలచినట్లున్నాడు. అందులకై, ఆ భరతుడు శ్రీరాముని దాసులమైన మనలను తన సేనాబలముతో బంధించుటగాని, చంపుటగాని చేయును. పిమ్మట ఆ శ్రీరాముని అడ్డునుగూడ తొలగించుకొని, తన కోర్కెను దీర్చుకొనదలచినట్లున్నాడు. అందులకే అతడు ఇట్లు వచ్చినట్లున్నాడు” – 4, 5.

తన యోధులందరినీ అస్త్రశస్త్రాలతో గంగాతీరాన సన్నద్ధులై ఉండమని ఆదేశిస్తాడు. భరతుడి సైన్యాన్ని ఎలాగూ తమ నావల్లోనే గంగ దాటించాలి కాబట్టి, తమ వద్దనున్న ఐదువందల నావలను సిద్ధపరిచి, ఒక్కోనావపై వందేసి జాలరులైన యువయోధులు సిద్ధంగా ఉండాలని ఆదేశించి, తను భరతుడి మనోగతం తెలుసుకోడానికి వెళతాడు. అనుమానం వస్తే, భరతసేనతో యుద్ధంచేయడానికి.

అంతకుముందు భరతుడి వెంట వచ్చిన సేనావాహిని చూసి, తనే అంటాడు. ‘…భరతునిసేననుగాంచి, తొట్రుపడుచు తన సహచరులతో ఇట్లు పలికెను ఓ సోదరులారా! ఇదిగో ఈ శృంగిబేరపురసమీపమున విడిసియున్న ఈ మహాసేనను చూడుడు. ఇది అపారమైన ఒక మహాసముద్రము వలె కన్పట్టుచున్నది. ఇంతటి విశాలమైన సేనను నేను మనస్సున సైతము ఊహించి ఎరుగను!’ – 2. అంతటి సేన ఎక్కడ? తనవద్దనున్న యోద్ధులెక్కడ? ఏనుగు కాలికింద చీమలతో సమానం. అయినా, శ్రీరాముడిపై ఉన్న ప్రేమ, స్నేహాలు అతణ్ణి ఆ సేనతో యుద్ధం చేయటానికి సన్నద్ధం చేశాయి. భరతుణ్ణి అనుమానిస్తూ విషయం తెలుసుకోడానికి తగిన సంబారాలతో వెళతాడు.

అమాయకత్వం! ఎలా మాట్లాడాలో తెలియదు. శ్రీరాముడిని అంతమొందిచడానికి వచ్చాడా అని భరతుణ్ణి మొహంమీదే అడిగేస్తాడు! పాపం అప్పటికే అలాంటి ఎన్నో అపవాదులు భరించిన భరతుడు, ఎంతో ఓపికగా మళ్ళీ తన పరిస్తితి వివరించుకుంటాడు. ఒకరిని మించిన వారు ఒకరు ఒకరిని మించిన శ్రీరామ భక్తి మరొకరిది. ఒక్క శ్రీరాముడు తప్ప, లక్ష్మణుడితో సహా అందరూ భరతుణ్ణి అనుమానించినవారే.

భరతుడి మనోగతాన్ని తెలుసుకొని ఎంతో సంతోషిస్తాడు. తనకూ శ్రీరాముడి మధ్య జరిగినదంతా చెబుతాడు. రామయ్య పడుకున్న చోటు చూబిస్తాడు. భరతుణ్ణి గంగ దాటిస్తాడు.

రావణ వధానంతరం గుహుడి ప్రస్తావన మళ్ళీ యుద్ధకాండ చివరిలో 128వ సర్గలో ఎదురవుతుంది. భరద్వాజాశ్రమం చేరుకున్నాక, తన రాక భరతుడికి తెలియజేయమని శ్రీరాముడు హనుమంతుడికి చెబుతాడు. మొట్టమొదట నీవు శృంగబేరపురమునకు వెళ్ళుము వనసంచారి, నిషాదరాజు ఐన గుహుని అచట కలిసికొని, నేను అతని యోగక్షేమములను అడిగినట్లు తెలుపుము. అతడు నాకు గాఢమిత్రుడు, అంతేకాదు ప్రాణతుల్యుడు. అతడు నిశ్చింతగానున్న నా క్షేమసమాచారములను, ఆరోగ్య భాగ్యములను విన్నంతనే ఎంతయు సంతోషపడును.” – 3, 4. “నాకు ఇతడితో ఏం పని?” అని అలోచించి చేసిన స్నేహం కాదు. నిజమైన నిరాపేక్షగల స్నేహం.


శ్రీరాముడా ఉత్కృష్టమైన ఇక్ష్వాకు వంశస్తుడు. గుహుడేమో, ఈ కాలపు పరిబాషలో, దళితుడు. మనం రాముణ్ణి ఆరాధించే వారిమైతే, ఆయనకు లేని కులబేధాలు మనకెందుకు? అగ్రకులాలవారిని దుమ్మెత్తిపోసే so called దళితులు - క్రింది వారిని చిన్న చూపు చూసే అగ్రవర్ణాలవాళ్ళు వీరి స్నేహం చూసి నేర్చుకోవలసినది ఎంతో ఉంది.