సాధన - సాధ్యము

సాధ్యము, సాధన ఇక్కడ వస్తున్నది. పరాభక్తికి మాత్రమే శివతత్త్వం దొరుకుతుంది. పరాభక్తి అనగా సర్వోత్కృష్టమైన భక్తి. అది తప్ప అనన్య భక్తి. అప్పుడు దానిపేరే అనన్య భక్తి అయింది. అనన్యమైన పరాభక్తికి అది దొరుకుతుంది. మరొక మార్గం ద్వారా దొరకదు. అందుకు దేవతలు, యోగులు ఆ పరతత్త్వాన్ని చూడాలనుకుంటారు. చూడాలనుకోవడం అంటే పొందాలనుకోవడం, అనుభవించాలనుకోవడం, లీనమవ్వాలనుకోవడం. అందుకు ఒక్కటే మార్గం. ఆ శివునియందు భక్తి ఉన్నచో అజ్ఞానబంధనములనుంచి, కర్మ బంధనములుంచి విడివడతాడు. పరాభక్తి అంత తేలికగా లభించదు. నారదులు "ప్రకాశతే క్వాపి పాత్రే" అన్నారు. కొందరియందే అది ప్రకాశిస్తుంది. అందరియందు దొరకదు. శాస్త్రములు దొరకవచ్చు, నియమాలు చెప్పవచ్చు. కానీ భక్తి మాత్రం అంత తేలికగా దొరకదు. పరాభక్తి వీటన్నింటికీ అతీతమైనది. 

సాధ్యం - సాధించవలసినది, సాధకుడు - సాధించు వాడు, సాధన _ దేనిద్వారా సాధిస్తాడో అది. సాధకుడు అనిత్యముల పట్ల నిస్పృహుడై ఉంటాడు. నిస్పృహ అంటే పట్టకపోవడం. పరపదములు తప్ప లోకములో అన్నీ అనిత్యములే. గడ్డిపోచ నుంచి బ్రహ్మలోకం వరకు అనీ అనిత్యములే. పరమేశ పదార్పణంతో కర్మ చేస్తాడు. అనిత్యమైన ఫలాకాంక్షతో చేయడు. ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. అలా చేసినప్పుడు సాధనా స్థాయినిబట్టి క్రమక్రమంగా శివునిలోకి వెళ్తాడు. అనగా సాలోక్యాది క్రమము. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య - ఇది పూర్తి లీనావస్థ. అందుకని ప్రతివాడు వారి మనఃస్థితిని అనుసరించి శివపదాన్ని పొందడానికి క్షణం వృథా చేయకుండా సాధన ప్రారంభించాలి. సాధనలు చాలా ఉన్నాయి. వాటి సారం చెప్తున్నాను వినండి అన్నాడు బ్రహ్మదేవుడు.

సారం తీస్తే సాధనలు మూడు. ౧. శ్రోత్రములతో వినడం, ౨. విన్నదానిని కీర్తించడం. అది నామం కావచ్చు, గుణం కావచ్చు, ఆ శివుడు మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, పశుపతి అన్నారనుకోండి అది కీర్తనే. ఆయన దివ్యత్వాన్ని గానం చేయడం. ౩. మనస్సుతో మననం చేయడం. ఈ మూడూ జీవితాంతం చేయమన్నాడు. ఈమూడూ నిరంతరం చేస్తే మహాసాధన. శివపురాణం చెప్పిన వేదవ్యాసుడు కదిలిస్తే వేదం, వేదాంతం. ప్రతిశ్లోకంలోనూ వేదాంత వాక్యం, వేదవాక్యం ఉన్నది. 

శివపురాణం వేదసమ్మితం అనడంలో ఇంత విశేషం ఉన్నది. “ఆత్మావా అరే ద్రష్టవ్యో, శ్రోతవ్యో, మంతవ్యః" - అనే మంత్రం మనకి ఉపనిషత్తులో ఉన్నది. శ్రోతవ్యః, మంతవ్యః, నిధి ధ్యాసితవ్యః - ఆత్మతత్త్వం మాత్రమే వినవలసినది(శ్రవణం), మననం చేయవలసినది(మననం), కీర్తించవలసినది(కీర్తనం). అందుకే శ్రీనాథ మహాకవి కాశీఖండంలో ఇలా అన్నారు -
"మరియాతడు సదానిది ధ్యాసితవ్యుండు, మంతవ్యుడాతండు, శ్రోతవ్యుడాతండు, ద్రష్టవ్యుడాతండు, జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులున్ కృత్యముల్గాగనాతండు, లోకంబులంబట్టి పాలార్చు, రుద్రుండు"

ఆయనయే చూడవలసిన వాడు, వినవలసిన వాడు. ఆయనది తప్ప ఇంకొకటి విన్నావు అంటే వినకూడనిది విన్నావు అని అర్థం. అనవలసింది అన్నప్పుడు వాక్కు సార్థక్యం. ఈ మూడూ ఎల్లవేళలా చేస్తే మనల్ని పరమాత్మ వైపు తిప్పుతాయి. లోకంతో కానీ, భగవంతునితో కానీ Attachment పెట్టుకోవాలంటే మన దగ్గరున్న మూడే - త్రికరణములు. మూడు కరణములలో ప్రసరించే నువ్వు ఈశ్వరునితో అనుసంధానం అయితే నువ్వూ శివోహం అవుతావు. అందుకు శ్రవణ, మనన, కీర్తనములకు వ్యాసదేవుడు పెట్టిన పేరు మహాసాధనం.

సృష్టిలో ప్రత్యక్షమైన వస్తువుయందు (ఇంద్రియానికి అనుభవానికి వచ్చేది) ప్రవర్తించడానికి కంటితో చూసి యేమి చేయాలో ప్రయత్నిస్తాం. అప్రత్యక్ష విషయానికి ప్రమాణం శాస్త్రమే. వినడం చేతనే శాస్త్రం తెలుస్తుంది. అందువల్లనే మొట్టమొదటి సాధనం శ్రవణం ఎందుకు చెప్పారంటే ముందుగా శివుడు శాస్త్రముల ద్వారానే పరిచయం అవుతాడు. ఆ తరువాత దానియందు నువ్వు ప్రవర్తిస్తావు. శ్రవణం నుంచి కీర్తనలోకి, మననం లోనికి వెళ్తున్నావు. 

ఈ మూడూ సాధించే వాడే శివయోగి అనబడతాడు. ఈ సాధన చేయగా చేయగా అవయవాలలో రోగాలు పోతాయి క్రమంగా. నిరంతర శివసాధన చేసే వారికి శరీరంలో రుగ్మతలు పోతాయి. వారి అణువణువులో శివుడు చేరతాడు. వారి అంతః కరణంలో, శరీరం శివునిలో లీనమౌతుంది. ఆ తరువాత లౌకికానందాలు పోతాయి. అనగా లౌకిక విషయములలో ఆనందించడం అనే దౌర్భాగ్యం పోతుంది. జీవితంలో జరిగే సుఖదుఃఖములకు కదలని స్థితి వస్తుంది. క్రమంగా శివసాయుజం పొందుతావు. సాధన బలవత్తరమైతే ఇహంలో ఒక ఫలం కనిపిస్తోంది. తరువాత అది శివులోనికి తీసుకు వెళ్తుంది.