ఏకాదశి


ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.శుక్ల పక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమావాసి కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి .

ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. 
ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .

దేవదానవులు ఈ ఏకాదశిరోజు ఉపవాసంతో రాత్రింబవళ్లూ శ్రమించి, క్షీరసాగరాన్ని మథించగా, ద్వాదశినాడు మహాలక్ష్మి సముద్రంనుండి వెలువడి వచ్చి, దేవతలకు ప్రత్యక్షమై, వారిని అనుగ్రహించింది. నాటినుండి ఏకాదశి నాడు పగలూ, రాత్రి ఉపవాసంతో ఉండి. జాగరణ చేసి, శ్రీహరిని స్తుతించిన వారికి స్వామి క్రుపవల్ల ముక్తి కరతలామలకమవుతుందనే నమ్మకం ఏర్పడింది.

శుక్ల ఏకాదశినాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవ కళ చంద్రుణ్ణి ప్రవేశిస్తుంది. బహుళ ఏకాదశినాడు చంద్ర మండలం నుండి పదకొండవ కళ సూర్యమండలాన్ని చేరుతుంది. ఇలా రాకపోకలవల్లనే "ఏకదశి" అనే పేరు సార్థకమవుతుంది.

"ఏకాదశ్యాముపవసేన్న కదాచి దతిక్రమేత్" - ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి. ఉపవాసంనాడు - ఉపవాసః స విఙ్ఞేయః సర్వభోగ వివర్జితః" - పాపక్రుత్యాలకు దూరంగా ఉండి (చేయక), సకల భోగాలను వదలి, పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం అని పెద్దలమాట! ఇంద్రియ ప్రకోపాన్ని అణచి, 11 ఇంద్రియాలను (పంచ కర్మేంద్రియ, పంచ ఙ్ఞానేంద్రియ మనస్సులు 11 ఇంద్రియాలు) భగవంతుని సన్నిధిలో వసింపజేసేదే నిజమైన ఉపవాసం. ఏకాదశీవ్రతం దశమి రాత్రితో ప్రారంభమై, ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు!

24 ఏకాదశుల పేర్లూ, ఫలాలు, సంగ్రహంగా:

(01) చైత్ర శుక్ల ఏకాదశి - 'కామదా' - కోర్కెలు తీరుస్తుంది.
(02) చైత్ర బహుళ ఏకాదశి - 'వరూధిని' - సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.
(03) వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడగును.
(04) వైశాఖ బహుళ ఏకాదశి - 'అపరా' - రాజ్య ప్రాప్తి.
(05) జ్యేష్ఠ శుక్ల ఏకాదశి - 'నిర్జల' - ఆహార సమ్రుద్ధి.
(06) జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగినీ' - పాపాలను హరిస్తుంది.
(07) ఆషాఢ శుద్ధ ఏకాదశి - 'దేవశయనీ' - సంపత్ ప్రాప్తి (విష్ణువు యోగ నిద్రకు శయనించు రోజు).
(08) ఆషాఢ బహుళ ఏకాదశి - 'కామికా' - కోరిన కోర్కెలు ఫలిస్తాయి.
(09) శ్రావణ శుక్ల ఏకాదశి - 'పుత్రదా' - సత్ సంతాన ప్రాప్తి.
(10) శ్రావణ బహుళ ఏకాదశి - 'అజా' - రాజ్యపత్నీ-పుత్ర ప్రాప్తి. ఆపన్నివారణం.
(11) భాద్రపద శుద్ధ ఏకాదశి - 'పరివర్తన' - (యోగనిద్రలో విష్ణువు ప్రక్కకు పొర్లును కనుక పరివర్తన) యోగసిద్ధి.
(12) భాద్రపద బహుళ ఏకాదశి - 'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును.
(13) ఆశ్వయుజ శుక్ల ఏకాదశి - 'పాపాంకుశ' - పుణ్యప్రదం.
(14) ఆశ్వయుజ బహుళ ఏకాదశి - 'రమా' - స్వర్గప్రాప్తి.
(15) కార్తిక శుక్ల ఏకాదశి - 'ప్రబోధిని' - (యోగనిద్ర నొందిన మహా విష్ణువు మేల్కొనే రోజు) ఙ్ఞానసిద్ధి.
(16) కార్తిక క్రుష్ణ ఏకాదశి - 'ఉత్పత్తి' - దుష్ట సంహారం. (మురాసురుణ్ణి సంహరించిన కన్య విష్ణు శరీరం నుండి జనించిన రోజు).
(17) మార్గశిర శుక్ల ఏకాదశి - 'మోక్షదా' - మోక్ష ప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).
(18) మార్గశిర క్రుష్ణ ఏకాదశి - విమలా' (సఫలా) - అఙ్ఞాన నివ్రుత్తి.
(19) పుష్య శుక్ల ఏకాదశి - 'పుత్రదా' - పుత్ర ప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).
(20) పుష్య క్రుష్ణ ఏకాదశి - 'కల్యాణీ' (షట్ తిలా) - ఈతి బాధా నివారణం.
(21) మాఘ శుక్ల ఏకాదశి - 'కామదా' (జయా) - శాప విముక్తి.
(22) మాఘ క్రుష్ణ ఏకాదశి - 'విజయా' - సకల కార్య విజయం (ఇది భీష్మైకాదశి అని ప్రసిద్ధి).
(23) ఫాల్గున శుక్ల ఏకాదశి - 'అమలకీ' - ఆరోగ్యప్రదం.
(24) ఫాల్గున క్రుష్ణ ఏకాదశి - 'సౌమ్యా' - పాప విముక్తి.

పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని భేదాలు కన్పిస్తున్నాయి.

ఏకాదశీదేవి జననం: పూర్వం క్రుతయుగంలో చంద్రావతీ నగరాన్ని పాలించే 'మురు' అనే రాక్షసడు ఉండేవాడు. దేవతల్ని జయించి, వేధించేవాడు. విష్ణువు వానితో వెయ్యేండ్లు యుద్ధంచేసి, అలసి, విశ్రాంతికై ఒక గుహలో చేరి, నిద్రించినాడు. అట్టి శ్రీహరిని సంహరించడానికి మురుడు సిద్ధపడగా, స్వామి శరీరంనుండి దివ్య తేజస్సులతో ఒక కన్య ఉద్భవించి, దివ్యాస్త్రాలతో యుద్ధంచేసి మురుణ్ణి సంహరించింది. విష్ణువు మేల్కొని, కన్యనూ, మరణించియున్న మురుణ్ణీ చూచి, ఆశ్చర్యపడినాడు. కన్య నమస్కరించి, జరిగినదంతా విన్నవించింది. సంతోషించిన విష్ణువు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఆమే ఆనందంతో "దేవా! నేను ఏకాదశినాడు నీ దేహం నుండి ఉద్భవించాను కనుక నా పేరు ఏకదశి. నా వ్రతం చేస్తూ, ఈనాడు ఉపవాసం ఉండేవారు సంసార బంధాలనుంచీ తరించేటట్లుగా వరమిచ్చి అనుగ్రహించండి" అని ప్రార్థించింది. స్వామి "అట్లే అగుగాక" అని వరమిచ్చి అద్రుశ్యుడైనాడు. నాటినుండి ఏకాదశీవ్రతం భక్తితో ఆచరించేవారు సకలపాపాలనుండి విముక్తులై, విష్ణు లోకాన్ని పొందుతారనే ప్రశస్తి ఏర్పడింది.

ఏకాదశీ తిథికి అధిదేవత ఏకాదశీదేవి. ఈమె విష్ణు దేహసముత్పన్న కనుక శ్త్రీమూర్తియైన మహావిష్ణువే!

సర్వోత్తమ తిథి ఏకాదశి: కుచేలుడు ఏకాదశీవ్రతాన్ని ఆచరించి మహైస్వర్యవంతుడైనాడని, ధర్మరాజు ఆచరించి కష్టాలనుండి గట్టెక్కినాడని, రుక్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తి నొంది, దేవతాక్రుపకు పాత్రుడై, మోక్షగామి అయినాడని, క్షీరసాగర మథనం, లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశినాడే జరిగాయని, వైఖానస రాజు ఆచరించి పితరులకు ఉత్తమ లోక ప్రాప్తి చేకూర్చాడని పురాణ ఉవాచ. అంబరీషు వ్రత ప్రభావం జగద్విదితం!

'వైకుంఠ ఏకాదశి' లో, వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. 'వైకుంఠ' శబ్దం అకారాంతపులింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్నీ కూడా సూచిస్తుంది. 'విష్ణువు' అనే పదానికి జీవులకు నియంత మరియు జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచే వాడు అని అర్థాలున్నాయి. 'వైకుంఠము' అంటే పునరావ్రుత్తి లేనిదీ, శాశ్వతమైనదీ అగు విష్ణుదేవుని పరమ ధామం. జీవులు వైకుంఠుణ్ణి అర్చించి, ఉపాసించి, వైకుంఠాన్ని చేరుటే ముక్తి.

వైకుంఠమంటే పరంధామం. ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాల సమూహం (5 కర్మేంద్రియాలు, 5 ఙ్ఞానేంద్రియాలు, 1 మనస్సు). ఈ 11 ఇంద్రియాలు వైకుంఠునికి అర్పింపబడి, వైకుంఠుణ్ణి అర్చించి, సేవించి, ఉపాసించినప్పుడే అవి పవిత్రవంతాలై, వాటిద్వారా సుఖానుభూతి పోదే జీవున్ని వైకుంఠంలో చేరుస్తాయి.

"ఏకాదశేంద్రియాలను వైకుంఠార్పణం చేసి, వైకుంఠాన్ని చేరి, శాశ్వతముక్తి నొంది, ధన్యులు కాండి" అని బోధిస్తుంది "వైకుంఠ ఏకాదశి". వికుంఠ అంటే దెబ్బ తిననిది అని అర్థం. ఇంద్రియాలు "వికుంఠాలు" అయినప్పుడే వైకుంఠసమర్చన ప్రశాంతంగా జరుగుతుంది. ద్వాదశి 12వ స్థితి. ఇదే ఇంద్రియాతీత దివ్యానంద స్థితి! ఏకాదశినాటి ఉపవాసం సత్వగుణానికి సంకేతం!

ఏకాదశేంద్రియాలతో కూడిన జీవాత్మ, వైకుంఠానికి ఉప = సమీపంలో, వాసః = నివసించడం వల్ల, అత్యంత సామీప్య, సాన్నిధ్య ప్రభావం కారణంగా జీవాత్మపై పరమాత్మ ప్రభావం ప్రసరిస్తుంది. జీవుడు శుద్ధుడవుతాడు. ద్వాదశినాడు చక్రస్నానం గావించి, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడంతో ద్వాదశాక్షరీ మంత్ర మయమైన వాసుదేవ తత్వాన్ని అనుభవిస్తాడు జీవాత్మ. ఈ అనుభవమే కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీపుష్కరిణి ముక్కోటి ఏకాదశీ చక్ర స్నాన ఫలం.


                                                                       సప్తగిరి, జనవరి 2014