రాముడి ఆవులింత

రాముడు సీతాలక్ష్మణులు ఇద్దరితో కలిసి అడవికి వెళ్ళాడు. కాని పధ్నాలుగేళ్ళు వనవాసం ముగించుకుని ముగ్గురుని తీసుకుని అయోధ్యకు మరలిచ్చాడు. ఆమూడో వ్యక్తి ఆంజనేయస్వామి!

ఆంజనేయస్వామి పవనపుత్రుడు. పవన మంటే గాలి. అదే ప్రాణం కూడా. రామునికి ప్రాణం ఆంజనేయుడు. జీవినుంచి ప్రాణాన్ని విడదీస్తే ఏమవుతుంది? జీవే ఉండదు. అలాగే ఆంజనేయుడు లేకుండా రాముడు ఉండడు.

రామునికి హౄదయం ఆంజనేయుడు. ఆంజనేయునికి హౄదయం రాముడు. మనిషి నుంచి హౄదయాన్ని ఎలా వేరుచేయలేమో, రాముణ్ణే ఆంజనేయుని అలాగే వేరుచేయలేం.

రాముడు అయోధ్యకు వచ్చి, పట్టాభిషేకం కూడా జరిగి చాల రోజులైంది. ఓసారి ఏమయిందంటే….

సీతాదేవికి ఆంజనేయుడంటే ప్రాణమే. అతని మీద ఆమెకు పుత్రవాత్సల్యం. ఎందుకంటే, ఏడాదిపాటు లంకలో ఉండి, రామవియోగంతో కన్నీరు మున్నీరుగా గడిపిన తర్వాత, మండు వేసవిలో మలయమారుతం వీచినట్లుగా మొదటిసారి రాముని కబురు మోసుకొచ్చిన అప్తబంధువు ఆంజనేయుడే. ఆనంద భాష్పాలతో, మసకబారిన అరచేతిలో ఉంచుకుని దర్శించిన ఆ క్షణాలు ఇప్పటికీ తీయని గుర్తులే. ఆ అంగుళీయకంలో ఆనాడు తను తన ప్రియరాముని ఆకౄతినే దర్శించింది. దానికి ప్రతిగా తన చూడామణిని రామునికిమ్మని ఆంజనేయుని చేతికిచ్చింది. ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ లేఖలు మొసినవారిమీద ఎవరికైనా ఒకవిధమైన ప్రత్యేక ప్రేమాదరాలు సహజంగానే ఉంటాయి.

కాని, తనిప్పుడున్నది అయోధ్యలో! అంత:పురంలో! ఆర్యపుత్రుల అనురాగభరిత సన్నిధిలో!

ఈ ఆంజనేయుడేమిటి!! పగలనక, రాత్రనక ఎప్పుడూ ఆర్యపుత్రుని వెన్నంటే ఉంటాడు? ఆయనా అంతేవారించరు సరికదా, క్షణకాలం ఆంజనేయుడు కనిపించకపోతే విలవిల లాడిపోతారు. ఏడాదిపాటు తన వియోగంలో కూడా అంతగా వేగిపోయి ఉండరేమో!

 సీతాదేవి ముఖంలొ అప్రన్నత చోటు చేసుకుంది. ఆమె దిర్ఘాలోచనలో పడి పోయింది. మా చెడ్డ చిక్కొచ్చి పడిందే! ఈ ఆంజనేయుడి వల్ల ఆర్య పుత్రునితో ఏకాంతమే దుర్లభమై పోయిందే! దీర్ఘంగా నిట్టుర్చింది సీతమ్మ. అంతలో ఆడుగుల చప్పుడు! అందులో కూడా మౄదుత్వమో! అది ఆర్యపుత్రుల అడుగుల సవ్వడే. ఆ వెనుకే ఆంజనేయుడా!

పెళ్ళయి ఇంత కాలమైనా రాముడి సాంగత్యం తనకెప్పుడూ నిత్యనూతనంగానే ఉంటుంది. హౄదయానికి రెక్కలొచ్చి రివూన ఎగురుతుంది. ముఖంలో కోటికాంతులు విచ్చుకుంటాయి. అడుగులు తడబడతాయి. పెదవులు వణుకుతాయి.

కానీ ఈరోజు భిన్నమైన అనుభవం. ముఖం మరింత వాడి పొయింది. నీళ్ళు తిరిగిన కనుకొనల్లోంచి ఓసారి రామునివైపు చూసి అంతలోనే ముఖం తిప్పేసుకుంది. రాముడు గమనించాడు.

అంతవరకు ఆయన అధరాలపై మెరిసిపోయిన మందహాసం మాయమై ముఖంలో ఒకింత అందోళన చోటు చేసుకుంది.

దేవి! శరీరం స్వస్ధంగా లేదా?” ఆ గొంతులో కలవరపాటు , అనునయం.

పవనాల తాకిడికి జలజల కురిసే మేఘంలా ఆమె కళ్ల నుంచి ఆశ్రుబిందువులు తపతప రాలాయి. ఇటు రామునిలో, అటు ఆంజనేయునిలో ఇనుమడిపించిన ఆందోళన. 

దేవి! ఏం జరిగింది?’ రాముడు ఆమెకు దగ్గరగా జరిగి ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు. సీత చివాలున ముఖం పక్కకు తిప్పుకుంది. కాసేపు నిశ్శబ్దం.

ఆర్యపుత్రులతో కాస్త ఏకాంతం కోరుతున్నానూ దు:ఖంతో సీతమ్మ గొంతు వణికింది.

రాముడు క్షణం నివ్వెరపోయాడు. ఆంజనేయుడివైపు చూశాడు. ఆంజనేయుడు నొచ్చుకుంటూ బయటికి నడిచాడు.

మీరు నాతోపాటు ఆ కోతిని కూడా కట్టుకున్నారా?’ సీతమ్మ నిష్ఠూరంగ్గ అడిగింది.

రాముడు విస్తుపోయాడు. సీత ఎప్పుడూ ఇంత నిష్ఠూరంగ్గ మాట్లాడదే! పైగా తమిద్దరికీ ఎంతో ప్రేమాస్పదుడైన ఆంజనేయుని కోతి అనడమా! వింతగా ఉందే.

 ’మీతో ఏకాంతమే దుర్లాభంగా ఉంది. ఇంత కన్న లంకలో ఉన్నప్పుడే బాగుందనిపిస్తోంది. అప్పుడు మీరు ఎదురుగా లేకపోయినా, మధురమైన మీ ఊహలతోనైనా బతికాను. ఇప్పుడు మీరు ఎదురుగా ఉండీ లేనట్లే ఉంటున్నారు. నాకు ఊహల తోనెనా ఆరాధించే అవకాశమే లేకుండా పోయింది అంది సీతమ్మ. ఉబికివచ్చే కన్నీటిని ఆపుకోడానికి సతమతమవుతూ.

ఆంజనేయుడికి కూడా తెలియకూడాని రహస్యాలు మనమధ్య ఏముంటాయి దేవి?’ రాముడు అడిగాడు.

ఆ ప్రశ్నకు రామునివైపు చివాలున చూసింది సీత. దు:ఖం మరింత ముంచుకొచ్చి మట్లాడ లేకపోయింది. మూడో మనిషికి తెలియకూడని రహస్యాలు భార్యాభర్తల మధ్య ఉంటాయని కూడా ఈయనకు తెలియదా! భార్యను కూడా విస్మరించి పూర్తిగా భక్తులతోడిదే లోకమా! ఎంత అవతార పురుషులైతే మాత్రం భార్యతో మాత్రమే ఉంచుకోవలసిన ఏకాంత క్షణాలుండవా?

ఆంజనేయుడు బ్రహ్మచారి కనుక భర్తకు మాత్రమే చెప్పవలసిన రహస్యాలు భార్యకుంటాయని తెలియదు. కానీ మీరు బ్రహ్మచారి కాదు గదా! నన్నొదాన్ని కట్టుకున్నారు గదా!దు:ఖంతో సీతమ్మ గొంతు తిరిగాయి.

రాముడు చలించిపోయాడు. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. సీతకు దగ్గరకు తీసుకుని దేవి! చెప్పు. నువ్వు ఏం చేయమంటే అదే చేస్తానూ అన్నాడు.

మీరు నిత్యము కొంతసేపు కేవలం నాతోనే గడపాలి. మనిద్దరం తప్ప మూడో మనిషి ఉండకూడదు;’ అంది సీతమ్మ కొంత తెప్పరిల్లి.

రాముడి మదిలో క్షణకాలం పాటు ఏవేవో ఆలోచనలు మెదిలాయి. తన ప్రాణమూ, తన హౄదయమూ అయిన ఆంజనేయుని విడిచి తను ఉండగలడా? ఆంజనేయుడు మాత్రం ఉండగలడా?

అయినా అర్థాంగి మాటను శిరసా వహించడం తన కర్తవ్యం అనుకున్నడు. సరే, అలాగేఅన్నాడు.

ఆ మాటతో సీత ముఖంలో వేయిదీపాలకాంటి వరబూసింది. వర్షం మధ్యలో మబ్బుచాటునిండి చటుక్కున బయటపడే సూర్యకాంతిలా భర్త ముఖంలోకి తౄప్తిగా, ఆనందంగా చూసింది.

మందిరం అవతల అంతసేపూ కాలుగాలిన పిల్లిలా తిరిగిన ఆంజనేయుడు ఓసారి లోపలికి తొంగిచూసాడు. రాముడు అతణ్ణి లోపలికి పిలిచి, నాయనా! కాసేపు మన ఉద్యానవనంలో వహరించు. తోటనిండా పళ్ళు విరకాసి ఉన్నాయి. తౄప్తిగా ఆరగించు. మళ్ళీ కబురుచేసినప్పుడు వద్దువుగానీ అన్నాడు. ఆ గొంతులో ఎంత దాచుకున్న బాధ ధ్వనించనే ధ్వనించింది.

ఆంజనేయుడి ముఖం వాడిపోయింది. అయినా తన స్వామి అజ్ణ్జ! మారుమాట్లాడకుండా అమ్మకూ, అయ్యకూ మొక్కి, భారంగా అడుగులు వేస్తూ అక్కడినుంచి నిష్ర్కమించాడు.

నేరుగా ఉద్యానవనానికి దారితీశాడు. ఫలపుష్పాలతో కళకళ లాడుతున్న ఆ ఉద్యానవనం అతనికి వల్లకాడునే తలపింపచేసింది. సర్వం కోల్పోయినవాడిలా అక్కడ శిలావేదికమీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ల ముందు రాముడు, ఆ పెదవులపై రామనామం. క్రమంగా ఆ వనమంతా రామనామంతో నిండిపోయింది. అక్కడి ప్రతిచెట్టూ, పుట్టా, పిట్టా రామనామ స్వరూపంగా మారిపోయాయి. జగమంతా రామమయం అయిపోయింది.

ఆంజనేయుడు ఈ లోకంలో లేడు.

అక్కడ అంత:పురంలో తన అభ్యంతర మందిరంలో రాముడు ఆన హంసతూలికా తల్పంమీద కూర్చుని ఉన్నాడు. సీత ఏవేవో ముచ్చట్లు చెబుతోంది. కాని తనలో ఏదో వెలితి. అంతలో ఆయనకు ఆవులింత వచ్చింది. ఆ వెంటనే మరోసారిమరోసారిమరోసారి..ఆవులింతలు వస్తూనే ఉన్నాయి.

సీత మొదట్లో మామూలు ఆవులింతలే అనుకుంది. కానీ ఒకదానివెంట ఒకటిగా అవి వస్తూనే ఉన్నాయి. ముచ్చట్లు అపి ఆర్యపుత్రుల ముఖంలోకి ఆందోళనగా చూసింది.

రాముడు ఆసౌకర్యంగా శయ్యమీద ఒకపక్కకు ఒరిగాడు. ఆవులింతలు ఆగలేదు.

సీత ఒక్క ఉదుటున లేచి పరిచారికను పిలిచింది.

ఆర్యపుత్రులకు స్వస్థంగా లేదు. వెంటనే రాజవైద్యుని పిలిపించూ. అని ఆదేశించింది.

 కాసేపటికి రాజవైద్యుడు వచ్చి, రాముని పరిక్షించాడు. ఎటువంటి లోపమూ కనిపించలేదు. తల్లీ! ఏలినవారి ఆరోగ్యంలో ఎటువంటి తేడాలేదు. ఆవులింతలకు కారణం బోధపడడం లేదూ అన్నాడు.

మరేమిటి మార్గం?’ సీత నేత్రాలు శ్రావణమేఘాలయ్యాయి.

జోతిష్కులకు కబురు చేయించడమ్మా, వారేమైనా కారణం కనిపెట్టగలరేమో చూద్దాంఅన్నాడు రాజవైద్యుడు.

జోతిష్కుడు వచ్చి శ్రీరామచంద్రులవారి జాతకచక్రం పరిశీలించి ఏవో లెక్కలు వేసి ప్రభువు గ్రహస్థితిలో ఎటువంటి వైపరీత్యమూ లేదు. వారి ఈ ఆవులింతలు ఎందుకు వస్తున్నాయో? ‘అన్నాడు.

 సీతమ్మ ఆందోళనతో ఇంకెవరికెవరికో కబురు పంపిచి రప్పిస్తూనే ఉంది. ఎవరికీ ఏమి అంతుబట్టలేదు. అర్థరాత్రి సమీపించింది. సీతమ్మకు ఏమి చేయాలో పాలుపోలేదు, చివరిగా లక్ష్మణ స్వామికి కబురు చేసింది.

లక్ష్మణస్వామి వచ్చాడు. చూశాడు. ఆయనకీ కారణం బోధపడలేదు. ఏం చేస్తే రాముని ఆవులింతలు తగ్గుతాయో ఉపాయం తోచలేదు. అలోచిస్తూ అంతలోనే ఏదొ గుర్తొచ్చినట్లు నలువైపులా పరికించి ఆంజనేయుడేడి?’ అని అడిగాడు.

సీత ముఖం చిన్నబోయింది.

కానీ, ఆ ప్రశ్నతో అక్కడున్నవారందరూ తెప్పరిల్లారు. ఆవునవును మనం మరచిపోయాం. ఆంజనేయుడున్నాడుగా! అతడు మంచి బుద్దిశాలి. తప్పకుండా ఏదో చిట్కా చెబుతాడూ అన్నాడు.

ఆంజనేయుడు ఉద్యానవనానికి వెళ్ళాడూ అంది సీతమ్మ. ఆ గొంతులో ఏదో తప్పు చేశానన్న ధ్వని ఆంజనేయుణ్ణి తీసుకు రండీ ఆదేశించాడు లక్ష్మణుడు.

పరుగు పరుగున సేవకులు ఉద్యానవనానికి వెళ్ళారు. ఓ మూల నుంచి రామభజన వారికి వినిపించింది. ఆ ధ్వని వచ్చినవైపు వెళ్ళారు. ఆంజనేయస్వామి పద్మాసనంలో నిమీలిత నేత్రాలతో కూర్చుని ఉన్నాడు.

ఆంజనేయా! ఆంజనేయా!పిలిచారు. పిలిచి పిలిచి అలసిపోయారు.

ఆంజనేయడు కళ్ళు విప్పలేదు. భూమి కంపించినా సరే ఆంజనేయుడు ఆ సమాధ్యావస్థ నుంచి బయటకు రాడని వారికి అర్థమైంది. తిరిగివెళ్ళి లక్ష్మణస్వామికి వన్నవించుకున్నారు.

ఈసారి లక్ష్మణస్వామి స్వయంగా బయలుదేరాడు. వెళ్ళి ఆంజనేయుని ఎదుట నిలబడ్డాడు. సేవకులు చెప్పింది నిజమే. ఈ స్థితిలో ఆంజనేయుని ధ్యానానికి ఎవరు భంగం కలిగించ లేరు. కానీ ఆంజనేయుడు రామకార్యదురంధరుడు! కనుక రామునికి ఆపద సంభవించిందంటే చటుక్కున కళ్ళు విప్పుతాడు!అనుకున్నాడు లక్ష్మణుడు.

ఆంజనేయా! రామునికి ఆపద వాటిల్లిందయ్యా!అన్నాడు.

పిడుగు పడ్డట్టుగా ఆంజనేయుడు చటుక్కున కళ్ళు విప్పాడు. నా రామయ్యకు ఆపదా? నా రమాయ్యకు ఆపదా?’ అంటూ ఒక్క ఉదుటున లేచి రాముని అభ్యంతర మందిరం వైపు పరుగు తీశాడు. ఒక్క అంగలో వెళ్ళి రాముని పాదాలమీద వాలాడు.

స్వామీ! మీకేమైంది?’ రాముని పాదాలను ఆంజనేయుని ఆశ్రువులు అభిషేకించాయి.

రాముడు రెండు చేతులతో ఆంజనేయుణ్ణి పైకి లేవదీసి, ‘నాకేమి కాలేదయ్యా హనుమా! నేను బాగానే ఉన్నానూ అన్నాడు నవ్వుతూ.

ఆశ్చర్యం! రాముని ఆవులింతలు ఆగిపోయాయి. రాజవైద్యుడితో సహా అక్కడున్న వారందరూ ఆశ్చర్య పోయారు. ఆశ్చర్యపోనివారు ఇద్దరేలక్ష్మణస్వామి, సీతమ్మ!


కాని సీతమ్మలో అపరాధ భావన. ఆంజనేయుడు మరి ఆర్యపుత్రుల వారి ప్రాణం కదా! ఆ ప్రాణాన్ని దూరం చేసి నేను నా రాముణ్ణి కష్టపెట్టానూ అనుకుంటూ పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది.