దీపావళి రోజున మహాలక్ష్మీ పూజ ఎందుకు చేయాలో తెలుసా?



దీపావళి రోజున మహాలక్ష్మీ పూజ చేయాలంటారు. అప్పుడు సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు అంటారు. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

పూర్వం దూర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి అతనికి ఓ మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తనవద్ద నున్న ఐరావతము అనే ఏనుగు మెడలోవేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది.

దీన్ని చూసిన దూర్వాసుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా రాజ్యాధిపత్యం కోల్పోయి సర్వసంపదలు పోగోట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఓ జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా భావించి పూజించమని సూచిస్తాడు.

దానికి తృప్తి చెందిన లక్ష్మీ అనుగ్రహంతో తిరిగి త్రిలోకా ధిపత్యాన్ని సర్వసంపదలను పొంది దూర్వాసుని పాదాలపై పడతాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి రాజ్యము, సంపదలను పొందిన దేవేంద్రుడు శ్రీమహాలక్ష్మి దేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నిస్తాడు. తల్లీ నీవు శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అని ప్రశ్నిస్తాడు.

అందుకు ఆ మహాలక్ష్మీ సమాధానమిస్తూ.. త్రిలోకాధిపతీ... నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారివారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మిగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా వారి వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా ప్రసన్నురాలనౌవుతానని చెప్పింది.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం వలన సర్వశుభాలు ప్రసాదిస్తుంది.


అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సమస్త సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.