రుద్రపశుపతి నాయనారు-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు

కావేరీ నదీ (పొన్నయ్‌) జలముచే సారవంతమైన భూములచే ప్రసిద్ధమైన దేశమున 'తిరుమలయా' రను ఒక నగరము గలదు. ప్రాచీన ఉత్తమ కుటుంబముల వారందరు ఎట్టి కొరత లేక యుండుట, ఆ ఊరి ఘనత. ఆ ఊరు దయకు, ధర్మప్రవర్తనకు, సంస్కృతికి పుట్టినిల్లు!

ఆ ఊరి యందు వేదాధ్యయనమున కంకితమైన ఓ బ్రాహ్మణ కుటుంబములో 'పశుపతియార'ను ఉత్తముడు జన్మించెను. అతడు ఉమాపతిని నిత్యము సేవించువాడు. భక్తితో హృదయ ముప్పొంగ నిర్వికామముగ, ఉత్సాహముతో శివుని కీర్తించు 'రుద్రమును' పఠించు చుండెను.

ప్రతిదినము తెల్లవారక మునుపే, పక్షుల కిలకిల రావములు పూదోటల లోని తుమ్మెదల ఘంకారుల ధ్వనులతో వినవచ్చునపుడే పశుపతియారు సమీపమున నీరు పొర్లుచున్న సరోవరమునకు వెళ్లెను. ఆ సమయమున అందలి ఎర్ర తామరలు, నీటి మట్టమున చేపల గంతులకు తల లెత్తెను.

అప్పుడతడు చల్లని నీటిలో గొంతు వరకు నిలిచి, చేతులను శిరస్సుపై చేర్చి, తెల్లని గంగను ధరించిన జటాజూటధారియైన శివుని యందున్న భక్త్యతిశయముతో స్వరముగా రుద్రసూక్త పారాయణ మొనర్చును. వేదసారమగు నీ పారాయణమును, పశుపతి నాయనారు ప్రతి మధ్యాహ్నమున, రాత్రి యందు విధిగా జేయుచుండెను. ఆ విధముగ నతడు కమలాసనుడగు చతుర్ముఖ బ్రహ్మయో యన విలసిల్లెను. తన శరీరములో వామభాగము భార్యయగు ఉమకు ఆనందమున నొసంగిన అర్థనారీశ్వరుడు ఆ భక్తుని కొంతకాలమునకు ఉద్ధరింప దలచెను. రుద్రసూక్తమును నిత్యము నిష్ఠతో జపించు పశుపతి నాయనారుని తపస్సునకు సర్వేశ్వరుడు సంతసించి కైలాసప్రాప్తిని అనుగ్రహించెను. హృదయముగ, స్వరశుద్ధముగ రుద్రపఠన మొనర్చుట వలన పశుపతి నాయనారు, ఆనందతాండవేశుడగు నటరాజ దివ్యపాదముల సాయుజ్యము నొందెను. అందువలన అతడు 'రుద్ర పశుపతి నాయనారు' అని లోకమున సుప్రసిద్ధుడయ్యెను.
ఆహా! రుద్రసూక్త గాన తత్పరులను త్రిశూలధారి అనుగ్రహించును. పరమేశ్వరుని జేరుట కిది ఒక మార్గము.