వేదమంత్రాభ్యాసం పురుషులకే విహితం
మన పూర్వశాస్త్రాల్లో
స్త్రీలకి వేదమంత్రోచ్చారణ గానీ, వేదమంత్రాల్లో శిక్షణ గానీ
ఎక్కడా నిర్దేశించినట్లు కనిపించడంలేదు. పైపెచ్చు దానిపై నిషేధాలు కూడా విఱివిగా
కనిపిస్తున్నాయి. బ్రాహ్మణ కుటుంబాల చరిత్రలో కూడా ఏ బ్రాహ్మణస్త్రీ గానీ
వేదాభ్యాసం చేసినట్లు దాఖలాలు లేవు. నా మటుకు నేనిది ఒక పెద్ద లోపమని భావించను.
ఎందుకంటే పూర్వులు ఏది చెప్పినా దానికేదో ఒక మంచి కారణం తప్పకుండా ఉంటుందని నా
దృఢవిశ్వాసం. స్త్రీలు వేదార్థాన్ని తెలుసుకోవడానికి మాత్రం అభ్యంతరం
కనిపించడంలేదు. కానీ మంత్రాలు వేఱు.
ఇందులోకి ఆధునిక రాజకీయ
సిద్ధాంతాలైన సమానత్వం, స్త్రీల హక్కులు, అణచివేత మొదలైన గాడిదగత్తర లాక్కురావడం మిక్కిలి అసమంజసమని
నా అభిప్రాయం. ఆ మాటకొస్తే మతంలోకి మతేతర కాన్సెప్టుల్ని లాక్కురావడం ఎప్పుడైనా
అభ్యంతరకరమే. మతానికి ఋషులే ప్రమాణం. ఇంకెవరూ ప్రమాణం కాదు. ఇంకెవరినీ మతావలంబులు
అనుసరించాల్సిన అవసరం లేదు. మతానికి రాజకీయాల కంటే, చట్టాల కంటే సైన్సుకంటే వేఱుగా తనదంటూ ఒక సొంత దృక్పథం
ఉంది. ఆ దృక్పథం నుంచే దాన్ని చూడాలి. మనక్కావాల్సింది ఈ కాలపు విదేశీ కాన్సెప్టుల
కనుగుణంగా మన సంప్రదాయాన్ని వ్యాఖ్యానించుకోవడం కాదు. మన సంప్రదాయాన్ని దాని
దృష్టితోనే చూడాలి. ఇతరదృష్టులు పనికి రావు. కష్టమైనా, నిష్ఠూరమైనా సత్యశోధనాదృష్టి కావాలి. మన పూర్వీకులు ఏం
చెప్పారు ? ఆచరణలో ఏం చేశారు ? ఇవే మనక్కావాల్సినవి.
వేదాలు కాకపోతే వాటికి
ప్రత్యామ్నాయభూతాలైన మతగ్రంథాలు చాలా ఉన్నాయి. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవనానికి గానీ
మతవిద్యకి గానీ వేదాలు తప్పనిసరి కాదు. అయితే ఈ రోజుల్లో స్త్రీలే కాక పురుషులు
కూడా వేదాభ్యాసం మానేశారు కనుక ఇప్పుడీ చర్చ పెద్దగా ఉపయుక్తం కాదు. చినజీయర్ గారు
దళితులకి వేదాలు బోధించడానికి సంసిద్ధత వ్యక్తం చేసి ఏడాదవుతున్నా ఇప్పటికీ ఒక్క
దళితుడు కూడా వారి ఆశ్రమాల్లో చేఱలేదు. ఉన్న వాస్తవ పరిస్థితి ఇది. స్త్రీలకి
వేదమంత్రాల శిక్షణని పూర్వులు వద్దన్నారా ? వద్దంటే ఎందుకు వద్దన్నారనేది ఈ వ్యాసంలో శోధిస్తున్నాము.
పాశ్చాత్యుల మాదిరి
జ్ఞానాన్ని మన పూర్వీకులు కనిపించిన ప్రతివారికి (Mass education drive) ఉద్దేశించలేదు. ఇక్కడ యోగ్యతకే అగ్రతాంబూలం. భారతీయ
విద్యావ్యవస్థలో గురువు శిష్యుల్ని పోగేసి డబ్బు సంపాదించుకోడు. శిష్యుడే
జ్ఞానదాహంతో గురువును వెతుక్కుంటూ వెళ్ళాలి. అతని అర్హత, యోగ్యత, గురుభక్తి, శ్రద్ధ, శక్తి మొదలైన వాటిని
సాకల్యంగా పరీక్షించి అతన్ని తన సేవలో నియోగించి చూచి, ఆ తరువాతనే అతనికి విద్యోపదేశం చెయ్యడం భారతీయ సంప్రదాయం. ఈ
సంప్రదాయంలో స్త్రీల జీవితం ఇమడదు. వారు మగవారి వలె గురువుని వెతుక్కుంటూ ఇల్లు
వదిలి వెళ్ళడం ఈ దేశంలో ఊహకందనిది. ఈ కాలపు పబ్లిక్ స్కూల్ తరహా బళ్ళు
ప్రాచీనకాలంలో ఎఱగరు. దగ్గఱలో తెలిసిన గురువుల వద్ద చేఱాలన్నా మగపిల్లల వలె వారిని
చిన్నవయసులోనే తల్లిదండ్రుల నుంచి వేఱుచేసి విద్య నిమిత్తం గురువుగారి ఆశ్రమంలోనే
ఉండే విధంగా చెయ్యడం ఎక్కడా వినపడలేదు, కనపడలేదు.
బ్రహ్మచారులు ముప్ఫయ్యో యేట విద్యాభ్యాసాన్ని ముగించి, బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకోవాలని
మనువు చెప్పాడు. అది ఆడపిల్లల విషయంలో సాధ్యం కాదనేది జగద్విదితమే. అదీ గాక
ఆశ్రమధర్మాల్లో స్త్రీలకి బ్రహ్మచర్యం విధించబడలేదు. స్త్రీధర్మ ప్రకరణంలో కూడా
వారికి బ్రహ్మచర్యాశ్రమం విధించబడలేదు. బ్రహ్మచర్య సంస్కారం లేకుండా వేదాధ్యయనం
సాధ్యం కాదు (అనుమతించబడలేదు). స్త్రీల శిష్యఱికం వివాహంతోనే మొదలవుతుంది. వారికి
భర్తే గురువు. ఆ గురువే ఆమెకి మంగళసూత్రధారణ చేస్తాడు. ఈ విషయమై మను మహారాజు తన
ధర్మశాస్త్రంలో చెప్పినది గమనించండి :
శ్లో|| అమంత్రకా తు కార్యేయం స్త్రీణామావృదశేషతః |
సంస్కారార్థం శరీరస్య
యథాకాలం యథాక్రమమ్ || (II-66)
తాత్పర్యము : శరీర
సంస్కారము కొఱకు స్త్రీలకు చేయు జాతకర్మలను అమంత్రకముగా (వేదమంత్రములను
ఉచ్చరించకుండ) సకాలమున శాస్త్రోక్తముగా చేయవలయును.
(స్త్రీలు వేదమంత్రాల్ని
ఉచ్చరించకూడదని/ వినకూడదని మనువు ఇక్కడ స్పష్టంగా సూచించి ఉండడాన్ని గమనించవచ్చు)
శ్లో|| వైవాహికో విధిః స్త్రీణాం సంస్కారో వైదికః స్మృతః |
పతిసేవా గురౌ వాసో
గృహార్థోఽగ్నిపరిక్రియా || (II-67)
తాత్పర్యము :-
"స్త్రీలకు వివాహ సంస్కారమే అన్నివిధములైన వైదిక సంస్కారములున్ను అగును"
అని పూర్వులచే చెప్పబడినది. పతిసేవయే వారికి గుర్వాశ్రమ వాసము. ఇంటి నిర్వహణ
నిమిత్తము నిప్పు రాజవేయుట (వంట) యే వారికి అగ్నిహోత్రకార్యము.
వేదమంత్రాల ప్రధాన ప్రయోజనం
హవ్యవాహనుడైన అగ్నిలో వ్రేల్చే హవిస్సుల ద్వారా ఇతరదేవతల్ని ప్రసన్నుల్ని
చేసుకోవడం. కానీ స్త్రీలకి ఆ విధమైనఅగ్నికార్యమే పైన చెప్పిన విధంగా
నిషేధించబడినప్పుడు వారికి వేదమంత్రాలతో ప్రయోజనం లేదనేది స్పష్టం. గృహంలో
అవిచ్ఛిన్నమైన అగ్నికార్యం నిమిత్తంపురుషులకు పునర్వివాహం అనుమతించబడింది.
(గృహస్థులే అగ్నికార్యం నిర్వర్తించాలి కనుక) కానీ స్త్రీలకి అనుమతించబడలేదు.
దాన్ని బట్టి వారికి వేదాధ్యయనం లేదని మనకి ప్రస్ఫుటంగా తెలుస్తున్నది.
మనుధర్మశాస్త్రం ఎప్పటిది ?
అంటే గ్రంథగత సాక్ష్యాల్ని బట్టి కనీసం అయిదువేల
సంవత్సరాల నాటిది. ఎందుకంటే అందులో ప్రవహిస్తున్న సరస్వతీనది ప్రస్తావన ఉంది. కానీ
సరస్వతీనది క్రీ.పూ.3000 నుంచి అప్పుడప్పుడు
ఎండిపోవడం మొదలుపెట్టి క్రీ.పూ. 2000 నాటికి సంపూర్ణంగా
అంతర్వాహిని అయిందని భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసింది. ఆ వివరాలు
ప్రస్తుతం నా దగ్గఱ లేవు. అంటే స్త్రీలకి వేదమంత్రాల నిషేధం ఈనాటిదీ కాదు. మధ్యలో
వచ్చిపడినది అంతకంటే కాదు.
ఇందుకు పూర్వపక్షంగా కొందఱు
ఉటంకించే వేదార్థాలు ఆ కాలంలో స్త్రీలు వేదాధ్యయనం చేసేవారనడానికి సాక్షీభూతంగా
కనిపించడంలేదు. వైదికమతంలో ఉన్నవారు వేదాధ్యయనం చేసినా, చెయ్యకపోయినా వేదోక్తముల ననుసరించి తమ జీవితాల్ని
గడుపుకోవలసిందే కదా. అందుకు స్త్రీలు మినహాయింపు కాదు కనుక అలా చెప్పబడింది. భర్త
ఇంట్లో లేనప్పుడు ఆమె భర్త బదులు (అతని ప్రతినిధిగా, అతని అనుమతితో, ఆజ్ఞతో)
నిత్యనైమిత్తికాలకి ప్రత్యవాయం లేకుండా సంధ్యోపాసననీ, అగ్నిహోత్రాన్ని నిలబెట్టాలని చెప్పబడింది. స్త్రీకి
వివాహమే ఉపనయనం కనుక గురువైన భర్త యొక్క ఆజ్ఞతో ఆమె ఈ పనులు చెయ్యడానికి
సాంకేతికంగా అభ్యంతరం లేదు. అయితే ఈ పనులు కూడా వేదమంత్రపూర్వకం కాదు. "భర్త
లేనప్పుడు" అని నిర్దేశించడానికి కారణమేంటో మనవి చేస్తాను. ఆహితాగ్నులనే
బ్రాహ్మణులున్నారు. వారు నిరతాగ్నిహోత్రులు. అంతే వారి యింట్లో హోమాగ్ని నిరంతరం
రాత్రీ పగలూ ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది, ఉండాలి కూడా.
ఆవిధంగా వారు దీక్ష తీసుకుంటారు. ఏ కారణం చేతనైనా ప్రజ్వరిల్లడం ఆగిపోతే మహాదోషం.
ఆ అగ్నులు అతని మాంసానికి ఆశిస్తాయని చెప్పబడింది. కనుక ఆ దోషనివారణ కోసం భర్త
గ్రామాంతరం ప్రవాసం వెళ్ళినప్పుడు ఆ అగ్నులు ఆరకుండా గృహిణి చూసుకోవాలని
నిర్దేశించారు.
శ్రీ మహాభాగవతం లో శ్రీ
వేదవ్యాస మహర్షులవారు వ్రాసిన మాట చూడండి :
స్త్రీశూద్రద్విజబంధూనాం
త్రయీ న శ్రుతిగోచరా |
కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ
ఏవం భవేదిహ |
ఇతి భారతఖ్యానం కృపయా
మునినా కృతమ్ ||
(శ్రీమన్మహాభాగవతమ్ -
ప్రథమస్కంధః - చతుర్థోఽధ్యాయః - శ్లో.25)
తాత్పర్యము :- స్త్రీలును,
శూద్రులును మఱియు ద్విజకులాల నుండి
భ్రష్టులైనవారును వేదములను వినకూడదు కనుక ధర్మకర్మముల మర్మమెఱుగనివారికి ఈ
మహాభారతము ద్వారా మేలు కలుగును గాక ! అని శ్రీ వేదవ్యాసమహర్షి కరుణతో యోచించి ఆ
యితిహాసమును నిర్మించెను.
దీన్ని బట్టి గత అయిదువేల
సంవత్సరాలకు పైబడిన చరిత్రలో స్త్రీలు వేదాలు చదవలేదని స్పష్టమవుతున్నది. మతేతర (secular)
ఆధారాలు లభిస్తున్న చరిత్రలోను, సాహిత్యంలోను సైతం ఏ ద్విజకుల స్త్రీలకిని వేదపరిజ్ఞానం
ఉన్నట్లుగా తెలియరావడంలేదు. దీనికి ఫెమినిస్టులూ, కమ్యూనిస్టులూ వక్రభాష్యం చెబుతున్నట్లు - స్త్రీలని
అణగదొక్కే ఉద్దేశం కారణం కాకపోవచ్చు. ఆ మాటకొస్తే వేదం రాని పురుషులు కూడా అన్ని
కాలాల్లోను విస్తారంగా ఉండేవారని మనకు పూర్వగ్రంథాల ద్వారా అవగతమవుతున్నది.
వేదాల్ని ఆదిఋషులు దర్శించేనాటికి భూమండలం మీద మానవ జనాభా కొన్నివేలకు
మించకపోవచ్చు. ఆ వాతావరణంలో ఎవరూ ఎవరినీ అణగదొక్కే ప్రస్తావన ఉండకపోవచ్చు.
"స్త్రీలు వేదమంత్రాలు
చదవకూడదని మన పూర్వులు ఎందుకంత గట్టిగా చెప్పారు ?" అని నేను ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచిస్తూండగా నాకు
శ్రీ షిర్డీ సాయిబాబావారు స్ఫురింపజేసినది ఇక్కడ వ్రాస్తున్నాను. ఈ మాట ఏ
శాస్త్రంలోను మీకు కనిపించదు. పురుషులు అగ్నితత్త్వ శరీరాలు కలిగినవారు. స్త్రీలు
జలతత్త్వశరీరాలు కలిగినవారు. మంత్రాలు కూడా అగ్నితత్త్వం కలిగినవి. అందుచేత ఏ
తత్త్వం గలవారు ఆ తత్త్వానికి సంబంధించిన అనుష్ఠానమే చెయ్యాలి. స్త్రీలు జపించిన
(వేద) మంత్రాలు నిర్వీర్యమవుతాయని శ్రీ గురుచరిత్రలో దత్తాత్రేయస్వాములవారు
స్వయంగా సెలవిచ్చారు. అందుక్కారణం - వారి భౌతిక ఉపాధి (శరీరం) జలతత్త్వం గలది
కావడమూ, అందులో అగ్నితత్త్వం గల
(వేద) మంత్రాలు ఇమడకపోవడమూ. అదీ గాక చాలామంది స్త్రీల ఆరోగ్యం బహు సున్నితమైనది
కనుక స్థిరమైనది కాదు. తమకు తరువాతి మాసధర్మం ఎప్పుడొస్తుందో ఖచ్చితంగా
చెప్పలేనివారి సంఖ్య చాలా ఎక్కువ. అందుచేత వారికి పవిత్రమైన వేదమంత్రాల్ని
నేర్పడమూ, ఇతర మత కార్యక్రమాల్ని అప్పగించడమూ
ఒక పెద్ద రిస్కుగా పూర్వీకులు భావించి ఉండవచ్చు. అందుకని వారికోసం కావ్యసంస్కృత
భాషలో వివిధ స్తోత్రాల్ని, వ్రతాల్ని నిర్దేశించారు.
పురుషులు భార్య లేకుండా
హిందూధార్మిక విధుల్ని నిర్వర్తించరాదనడాని క్కూడా వారి అగ్నితత్త్వ శరీరాలే
కారణం. పురుషుడు అగ్ని. మంత్రం అగ్ని. హోమం అగ్ని. అనుష్ఠానం ద్వారా ఇన్ని అగ్నులు
ఒకేసారి ప్రజ్వరిల్లితే అది ఇతరులకు ఉపద్రవంగా మారుతుంది. కనుక ఆ అగ్నుల్ని సమతూకం
(balance) చెయ్యడం కోసం భార్య
ఉండాలన్నారు.
రామాయణం సుందరకాండలో శ్రీ
హనుమంతులవారు శ్రీ సీతా మహాదేవి కోసం వెతుకుతున్న సందర్భంలో లంకలో ఒక నదిని చూసి
"సీతాదేవి ఈ లంకలో ఉన్న పక్షంలో సంధ్యోపాసన నిమిత్తం ఇక్కడికి తప్పకుండా
రావచ్చు. అప్పుడామెని నేను గుర్తుపడతాను" అనుకుంటారు.
శ్లో|| సంధ్యాకాలమనాః శ్యామా ధ్రువమేష్యతి జానకీ |
నదీం చేమాం శివజలాం
సంధ్యార్థే వరవర్ణినీ ||