శ్వేతాశ్వ శిరస్సుతో విష్ణువు హయాగ్రీవుడుగా
తెల్లని అశ్వశిరస్సుతో
మానవాకారం కలిగి ఉన్న శ్రీ మహావిష్ణువు దివ్యస్వరూపమే హయగ్రీవ భగవానుడు. ఈ దేవుడు
జ్ఞానామృతాన్ని ప్రబోధిస్తూ భక్తులను అనుగ్రహించేందుకు తెల్లని పద్మంలో ఆసీనుడై
ఉండి ధవళ వస్త్రాలు ధరించి జ్ఞాన సముపార్జన చేయనెంచిన సాధకులకు వైష్ణవ సంప్రదాయంలో
ప్రధాన దైవంగా భాసిల్లుతున్నాడు. శ్రావణ పూర్ణిమనాడు శరన్నవరాత్రి ఉత్సవాల్లో
తొమ్మిదవ దినమైన మహార్నవమి పర్వదినంనాడు ఈ దేవునికి భక్తులు విశేష పూజలర్పిస్తారు.
హయగ్రీవ భగవానుడు పద్మదళముల
వంటి నాలుగు సున్నితమైన హస్తాలు కలిగి ఉండి ఒక చేతిని జ్ఞాన ప్రబోధాత్మకంగాను,
రెండవ హస్తంలో జ్ఞానాంతర్గతమైన గ్రంథాలను ధరించి
వుండి, మూడు, నాలుగు చేతులలో శంఖ, చక్రాలు ధారణ చేస్తూ అనుగ్రహ ముద్రలో ఉంటాడు. హయగ్రీవుడు
సూర్యభగవానుణ్ణి అంతరిక్షంవైపు ప్రబోధన చేస్తూ లోకాలను తమస్సు నుండి రక్షించేందుకు
తోడ్పడతాడని తెలుస్తోంది.
శ్రీ మహావిష్ణువు రాక్షస
సంహారం చేసి యుద్ధ్భూమి నుంచి వైకుంఠానికి తిరిగి వచ్చినప్పటి బృహత్ స్వరూపంగా
మహాభారతం హయగ్రీవుని స్తుతిస్తుంది. జ్ఞానముద్రలోని రూపాన్ని యోగ హయగ్రీవుడుగా
విజ్ఞులు సంభావిస్తారు. లక్ష్మీఅమ్మవారితో కూడి ఉన్నప్పుడు లక్ష్మీహయగ్రీవుడుగా
స్వామి పిలువబడుతున్నాడు. శాక్తేయ సంప్రదాయంలో హయగ్రీవుని గురించిన ఓ విశేష కథ
వ్యాప్తిలో ఉంది.
గుర్రపుతల కలిగి ఉన్న హయగ్రీవుడును రాక్షసుడు కశ్యప ప్రజాపతి
కుమారుడు. తనకు చావులేకుండా, ఒకవేళ చావంటూ వస్తే మరో
హయగ్రీవుని చేతిలోనే అది జరగాలని దుర్గామాత నుంచి వరం పొందుతాడు. దివ్యవర
గర్వితులయిన అందరు రాక్షసుల వలెనే హయగ్రీవ రాక్షసుడు కూడా దేవతలను బాధింప
జొచ్చాడు. విసిగి వేసారిన దేవతలు వైకుంఠానికేగి తమను రక్షింపవలసిందిగా
విష్ణుదేవునితో మొర పెట్టుకుంటారు. దుర్గామాత వరప్రసాది అయిన ఆ రాక్షసుని శ్రీ
మహావిష్ణువు కూడా నిర్జించలేని పరిస్థితి. ఆయన తన ఓజస్సును పెంపొందించుకొనే
ప్రయత్నంలో ధ్యానమగ్నుడవుతాడు. అల్లెత్రాడు దృఢంగా బిగించి ఉన్న ఒక వింటిని ఆసరా
చేసుకుని ధ్యానముద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు తమగోడు వినిపించే ప్రయత్నంలో
భాగంగా ఆయన్ను మేల్కొలిపేందుకు ఒక కీటకాల గుంపును దేవతలు ప్రేరేపించగా వాటి
ప్రమేయంతో చుటుక్కున తెగిన వింటిత్రాటి శక్తికి విష్ణుదేవుని తల త్రెగి పడిందట! ఈ
హఠాత్పరిణామానికి ఖంగుతిన్న దేవతలు దుర్గామాతను ఆశ్రయించగా ఆమె భయంలేదనే, ఒకానొక శ్వేత అశ్వపు శిరస్సును తెచ్చి స్వామి కంఠానికి
అతికించమనీ, హయాననుడుకు విష్ణుమూర్తి
చేతిలో హయగ్రీవ రాక్షసుడు నిర్జించ బడతాడనీ చెప్పగా బ్రహ్మ, శ్రీమహావిష్ణువు కంఠానికి అశ్వశిరస్సును అతికిస్తాడు.
హయాననుడుగా మారిన మహావిష్ణువు చేతిలో హయగ్రీవ రాక్షసుడు నిర్జింపబడిన గాధ ఇది.
గాయత్రి మహామంత్రంలోని 24 అక్షరాలు ఇరవై నలుగురు దేవతల బీజాక్షరాలు కాగా, ‘ద’ అక్షరం హయగ్రీవస్వామి
బీజాక్షరం! ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు, శత్రువులపై అంతిమ విజయానికి హయగ్రీవ భగవానుడు అనుగ్రహ
ప్రేరణ యిస్తాడు. బాహ్యా శత్రువులతోపాటు అంతఃశత్రువులయిన అరిషడ్వర్గాలను శమింపజేసే
దివ్యానుగ్రహశక్తి హయగ్రీవ భగవానుని నుండి భక్తులకు లభిస్తుంది. హయగ్రీవుని
ధవళకాంతుల శిరస్సు, సూర్యభగవానుని ఏకచక్ర
రథాన్ని లాగేప్పుడు దవళాశ్వాలకు శక్తి ప్రదానం చేస్తుందట! అశ్వజాతిలో ధవళాశ్వాలు
అరుదుగా ఉంటాయి.
అరుదైన శే్వతాశ్వ శిరస్సుతో
విష్ణువు హయాగ్రీవుడుగా భక్తులకు నూతన శక్తి అనుగ్రహించి, కార్యోన్ముఖులను చేసి కర్మసాఫల్యానికి తోడ్పడుతాడని
ప్రతీతి.