హింసా? సమానత్వంమా ?

ఒకరోజు నేపాల్ మహారాజు తన సైన్యంతో అరణ్యానికి వేటకు వెళ్ళాడు. కొంతసేపయిన తరువాత రాజుగారి సైన్యాధిపతి ఒక పెద్దపులిపైకి తుపాకిని పేల్చాడు. తుపాకీ గుండు ఆ పులికి తగలకపోవటంతో అది తప్పించుకొని, పెద్దగా గాండ్రిస్తూ పరుగెత్తసాగింది. అదిచూసి రాజభటులు గుర్రాలమీద ఆ పులిని వెంబడించారు. ఆ పెద్దపులి పరుగెత్తి పరుగెత్తి ధ్యానమగ్నుడైన గణపతిస్వామి ఉన్నచోటికి చేరుకొని, ఆర్తనాదం చేస్తూ స్వామివారి పాదములవద్ద పిల్లిలాగా పడుకొన్నది. ఆ పులిచేసిన ఆర్తనాదాలు స్వామివారి ధ్యానస్థితి సడలిపోయింది. కన్నులు తెరవాఅనే వారి దృష్టి పులిమీద పడింది. ఆ పులి పరిస్థితిని అర్థం చేసుకున్న స్వామిఆ పులిశరీరాన్ని ఆప్యాయంగా నిమిరారు. ఇంతలో పులిని వెంటాడుతూ వచ్చిన రాజభటులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి వారు నిశ్చేష్టులై నిలిచిపోయారు. స్వామివారు కరుణామయములైన చూపులతో ఆ భటులను తనవద్దకు జ్రమ్మని సంజ్ఞ చేశారు. వారు ఎంతో భక్తి ప్రపత్తులతోను, భయభ్రాంతులతోను స్వామివారి చెంతకు చేరి నమస్కరించారు. స్వామివారు చిరునవ్వుతో ఇలా అన్నారు. "మీరంతా ఇంత ఆశ్చర్యాన్ని పొందటానికి భయభ్రాంతులు కావటానికి కారణమేమిటి? మీరు మీ హింసా ప్రవృత్తిని విడిచిపెడితే క్రూరజంతువులు కూడా మిమ్మల్ని హింసించవు. అవి కూడా తమ హింసా ప్రవృత్తిని విడిచిపెడతాయి. ఈ పెద్దపులి ఇంత ప్రశాంతంగా పడి ఉండడమే అందుకు ప్రత్యక్షప్రమానము. ఇంతవరకూ మీరు దాని ప్రాణములు తియ్యాలనుకొన్నారు. కాని ఇప్పుడు ఈ పులి సునాయాసంగా మీ ప్రాణాలను తియ్యగలదు. అందువల్లనే దీనిని చూసి మీరు భయపడుతున్నారు. ఎవరికీ ఇంకొకరి ప్రాణాలు తీయటానికి అధికారం లేదు. ఒకవేళ అలాంటి అధికారం కనుక మీకు ఉంటే, దాని ప్రాణం మీరు ఎప్పుడో తీసి ఉండేవారు. ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులు సమానులే. కనుక ఒకరిని మరొకరు హింసించటం మంచిదికారు. ఇక మీకు భయం లేదు. మీరు నిర్భయంగా, నిశ్చింతగా వెళ్ళి మీ అనుచర వర్గాన్ని చేరవచ్చు. నేటినుంచీ హింసాప్రవృత్తిని మానటానికి ప్రయత్నించండి." అని ప్రబోధించారు. స్వామివారి మాటలు విన్న ఆ రాజభటులు స్వాస్థ్యచిత్తులయ్యారు. ఎన్నడూ కనీ వినీ ఎరుగని దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసినవారు అవాక్కయ్యారు. స్వామివారి పాదధూళిని కన్నులకు అద్దుకొని, వారి అనుమతితో అక్కడినుంచి వెళ్ళిపోయారు. కొంతసేపటికి ఆ పెద్దపులి కూడా వెళ్ళిపోయింది.