సీత హనుమంతునకు శిరోరత్నం యిచ్చుట-శ్రీ రామాయణం



సీత యిలా దుఃఖించగా హనుమంతుడు " దేవీ! రాముడు నీకోసమే దుఃఖిస్తున్నాడు. ఆ దుఃఖము వలనే సమస్తమూ మరచి వున్నాడు. ఏమయితే యేం? ఎలాగో వొకలాగ మీరు కనబడ్డారు. మీరిక శోకించవలసిన అవసరం లేదు. ఈ క్షణంలో మీరు మీ దుఃఖా లంతరించడం చూస్తారు. రామలక్ష్మణులు నిన్ను చూడ్డానికి కదలి వచ్చి లంకను బుగ్గిచేసేస్తారు. తప్పదు. రాముడు క్రూరుడైన రావణాసురుణ్ణి సబంధపరివారంగా కూల్చేసి నిన్ను అయోధ్యకు తీసుకువెళతాడు. సందేహం లేదు. కనుక, రామున కేమి చెప్పమంటావో చెప్పు. లక్ష్మణుడకున్నూ యేమి చెబుతావో చెప్పు. వానర ప్రభువు సుగ్రివునకుకూడా యేమిచెబుతావో చెప్పు" అని అడిగాడు.

దానిమీద దేవకన్యవంటి సీత దుఃఖిస్తూనే "లోక కల్యాణం కోసం కౌసల్య కన్న రాముణ్ణి నామారుగా నువ్వే క్షేమం అడుగు. శిరసా నమస్కరించు. లక్ష్మణుడు సకదధనాలూ, సకలవైభవాలూ, సకల భోగాలూ, యిష్టురాలయిన సుందరాంగననూ విడిచి నారామునితో కూడా అడవులకు వచ్చాడు. అడవులలో నా రామున కతనే రక్షకుడు. అతను సామాణ్యుడా? సింహస్కంధుడు. మహాబాహుడు. రాముణ్ణి తండ్రిని చూసినట్టూ, నన్ను తల్లిని చూసినట్టూ చూస్తున్నాడు. రావణుడు నన్నెత్తుకురావడం లక్ష్మణుడు కూడా యెరగడు. అతను మహాశక్తిశాలి. మితబాషి. సర్వలక్షణసంపన్నుడైన రాజపుత్రుడు. చాలా ఉత్తముడు. నాకు నా మామగారితో సమానుడు నాకు చాలా యిష్టుడు. అతణ్ణి చూసుకుని నా రాముడు తండ్రిని కూడా మరచిచిపోయాడు. నాకు మారుగా నువ్వే అతన్ని కుశలం అడుగు. హనుమా! వానరవీరా! రాముడు నా దుఃఖం పోగొట్టేటట్టు చెయ్యడం నీ వంతు. నా రామునితో యీ సంగతి కూడా చెప్పు. అదే మిటంటే? నే నిక వొక్క నెలమాత్రమే బతికివుంటాను. వెనుక, వృత్తిణ్ణి వధించడం వల్ల దేవేంద్రునకు బ్రహ్మహత్య చుట్టుకుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు వైష్ణవాశ్వమేదం చేయించి ఇంద్రుణ్ణి నిష్కలుషుణ్ణి చేసి మళ్ళీ త్రైలోక్యరాజ్యం యిచ్చాడు. కాని ఇంద్రలక్ష్మి పాతాళానికి వెల్ళిపోయింది. ఆకాశవాణి వల్ల యీ సంగతి తెలిసి అందరూ బయలుదేరారు. 'మీలో సర్వలక్షణ సంపన్నుడెవడో వాడే అక్కడికి వెళ్ళి ఆ ఇంద్రలక్ష్మిని తేగలడని మళ్ళి అశరీరవాణి చెప్పింది. దేవతలందరూ ప్రార్థించగా విష్ణువు పాతాళానికి వెళ్ళి లక్ష్మని తెచ్చి మళ్ళీ ఇంద్రున కిచ్చాడు. అలాగే నా రాముడు ఈ రావణాసురుణ్ణి చంపి నన్ను తీసుకువెల్ళడం ధర్మం" అని చెప్పి, ఆమె తన కొంగున వున్న చూడామణి తీసి, "యిది రామున కియ్యి" అని చెబుతూ హనుమంతున కిచ్చింది. హనుమంతుడది తన వ్రేలికి పెట్టుకోవాలని చూశాడు; కాని వీలు కాలేదు. అప్పుడామణి పుచ్చుకుని హనుమంతుడు సీతకు ప్రదక్షిణనమస్కారా లాచరించి, శరీరకంగా అక్కడే వుండినా మానసికంగా రాముని సన్నిధిలో వున్నట్టు అనుకున్నాడు.

హనుమంతుడు సీతకు వానరుల శక్తిసామర్థ్యాలు చెప్పుట

ఇలాగ, సీత తన శిరోమణియిచ్చి, "ఇది చూస్తే రాముడు బాగా గుర్తుపట్టగలడు. ఈ మణిని చూసినప్పుడు నా రాముడు నన్నూ, నా తల్లినీ, దశరథమహారాజునూ తప్పకుండా స్మరిస్తాడు. ఏమంటే? నా వివాహకాలాన, నా తల్లి యిది నా తండ్రి నడిగిపుచ్చుకొని దశరథ మహారాజు చూస్తూండగా నాకు శిరోమణిగా యిచ్చింది. కనుక, యీ కార్యం విషయమై నువ్వు బాగా శ్రద్ధచెయ్యాలి. రాముణ్ణి బాగా ప్రోత్సహించాలి. నీ శాయశక్తులా పనిచేసి యెలగయినా నువ్వు నా దుఃఖం పోగొట్టాలి" అని చెప్పింది. ఇది విని సరే అని చెప్పి, హనుమ సీతకు శిరస్సాష్టాంగనమస్కారాలు సమర్పించి బయలుదేరదామనుకున్నాడు. అది గ్రహించి సీత గద్గదకంఠంతో "రామలక్ష్మణుల కుశలం అడిగా నని చెప్పు. మంత్రులతో కూడా సుగ్రీవుణ్ణీ, వానర వృద్ధులనూ కూడా అడిగా నని చెప్పు. ఏం చేస్తే రాముడు నన్ను ఈ దుఃఖసముద్రం నుంచి లేవనెత్తుతాడో నువ్వలా చెయ్యాలి. రాముడు నేను బతికి వుండగానే వచ్చి నన్ను గౌరవించేటట్టున్నూ నువ్వు చెప్పాలి. నువ్వు ప్రోత్సాహపరిస్తే రామలక్ష్మణులు పౌరుషం దీపించగా నా కోసం వస్తారు. నా సందేశం నువ్వెరిగించా వంటే రాముడు వీరోచితంగా ప్రవర్తిస్తాడు" అని మళ్ళీ చెప్పింది.

దానిమీద హనుమంతుడు "దేవీ! నీకు సందేహం వద్దు. రాముడు వానరులందరితోనూ, భల్లూకవీరులతోనూ వచ్చి శత్రువులను సంహరించి నీ శోకం పోగొడతాడు. రాముడు ప్రయోగించిన బాణాలు తట్టూకోగలవాడు మనుష్యులలోనే కాదు, దేవతలలోనూ, రాక్షసలలోనూ లేరు. నీకోసం రాముడు సూర్యుణ్ణయినా సరే, ఇంద్రుణ్ణయినా సరే, యముణ్ణయినా సరే యెదిరించి జయించగలడు. నీ కోసమే రాముడు రాక్షసులతో యుద్ధం చేసి జయలక్ష్మిని చేపడతాడు" అని చెప్పాడు. అది విని సీత బాగా చెప్పాడు అనుకుని హనుమంతుని యెడల చాలా గౌరవభావం కనపరిచింది. దాంతో ఆమె "వానరవీరా! నీకిష్టమయితే ఇక్కడ వొక దినం వుండు. రహస్యంగా వుండేచోట నక్కివుండు. అలసట తీర్చుకుని నువ్వు రేపు వెళ్ళవచ్చు. నువ్విక్కడ ఎంతసేపుంటే అంతసేపూ నాకు శోకం కనబడకుండా వుంటుంది. నువ్వు మల్ళీవచ్చేలోపున నా ప్రాణాలు పోతే పోవచ్చు. వెనకటి దుఃఖానికి తోడు నువ్వు కనబడని దుఃఖం నన్ను కొత్తగా పీడిస్తుంది. అయితే, వీరాధివీరా! నీకు సాయంచేసే వానర భల్లూకవీరుల విషయమై నాకొక సందేహం వుంది. ఆ వానరభల్లూక వీరులూ రామలక్ష్మణులూ అపారమైన యీ మహా సముద్రం యెలాదాటతారూ? నీకూ, గరుత్మంతునకూ, నీ తండ్రి అయిన వాయుదేవునకూ మాత్రమే సముద్రాలు దాటే శక్తివుంది. ఈ స్థితిలో అతికష్టసాధ్యమ్మైన యీ పని చెయ్యడాని కుపాయం యేమిటీ? రావణుణ్ణి చంపి నన్ను రామునితో కలపడానికి నువ్వొక్కడవే చాలుతావు గనక, అది నీకు కీర్తికరమే గాని రాముడు వచ్చి సమిత్రబాంధవంగా రావణుణ్ణి చంపి నన్ను తీసుకువెడితే - అదీ రామునకు తగ్గపని. లంకాపట్నం అంతా తన నిశితశరాలతో ధ్వంసం చేసి నన్ను తీసుకువెడితే - అదీ రామునకు తగ్గపని. కనుక, ఎలా చేస్తే రామునకు కీర్తికరమో అలా నడిపించు" అని మల్ళీ చెప్పింది.


హనుమంతున కిది సకారణంగానే కనిపించింది. దానిమీద అతను "దేవీ! వానరభల్లూకసైన్యాల కధీశుడైన సుగ్రీవుడు చాలా గొప్పవీరుడు. అతను నీ విషయమై స్థితనిశ్చయం చేసుకునివున్నాడు. అతను అనేక వేలకోట్ల వానరసైన్యం వెంటబెట్టుకు వచ్చి రాక్షసులను నాశనం చేసేస్తాడు. సుగ్రీవుని అనుచరులకు భూమిమీదా, ఆకాశానా, పాతాళానా కూడా అడ్డులేదు. వారందరూ అతను చెప్పినట్టు చెయ్యడానికి సిద్ధపడివున్నారు. వారందరూ అమిత తేజశ్శాలులు కనుక, ఎలాంటిపని చేసినా శ్రమపడ్డం అంటూ వుండదు. వారు భూమండలం అంతా, సముద్రాలతో కూడా అనేక మాట్లు, ఆకాశమార్గాన ప్రదక్షిణం చేసి వున్నారు. ఆ వానరవీరులు అందరూ నాతో సమానులూ నాకంటే సమర్థులూను. వారిలో నాకు తీసిపోయేవా డొక్కడూ లేడు. నేనే యిక్కడికి తేలికగా వచ్చానుగదా, యిక వారి సంగతి చెప్పడానికేముందీ? ఇంతేకాక, ఎవరూ కూడా గొప్పవాళ్ళ నెక్కడికీ పంపరు. వారందరికంటే నేను తక్కువ వాణ్ణి కనుకనే సుగ్రీవుడు నన్ను పంపాడు. కనుక అమ్మా! ఇక శోకించకు. వానరులు ఒక్క అంగలో లంకకి వచ్చేస్తారు. నరసింహులైన రామలక్ష్మణులు కూడా నా భుజాలమీద కూచుని వచ్చేస్తారు. వచ్చి లంకాపట్నం అంతా నాశనం చేసేస్తారు. రావణుణ్ణి సమూలంగా సంహరించి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకువెళతాడు. కనుక, ఇక విచారించకు. రావణుడు చనిపోయినవెంటనే నువ్వు రాముణ్ణి పొందుతావు" అని నచ్చజెప్పాడు. చెప్పి, మళ్ళీ అందుకుని అతను "అమ్మా! ధనుష్పాణులైన రామలక్ష్మణులను త్వరలోనే నువ్వు లంకాపట్టనద్వారంలో చూస్తావు. గోళ్ళూ కోరలూ ఆయుధాలుగా సింహాలనూ పెద్దపులులనూ మించిన వానరవీరులను కూడా నువ్వు త్వరలోనే చూడగలవు. బొంగపెట్టుకోకు. నువ్వు రామునితో కలిసి సుఖపడతావు. రామునికంటే గొప్పవా డెవడున్నాడూ? లక్ష్మణుణ్ణి పోలినవాడున్నూ యెవడున్నాడూ? వారిద్దరూ అగ్నితోనూ వాయువుతోనూ సాటిఅయినవారు. నేను నీతో మాట్టాడడం ప్రారంభించి యెంతసేపయిందో అంతసేపటిలోనే నీ భర్త యిక్కడికి వచ్చేస్తాడు చూస్తూవుండు" అని ధైర్యం చెప్పాడు.