హనుమంతుడు సీతకు రాముని అంగుళీయకం యివ్వుట -శ్రీ రామాయణం

హనుమంతుడు సీత కింకా గట్టిగా నమ్మకం కలగడానికి "దేవీ! నేను వానరుణ్ణి. రాముని దూతను. ఇదిగో, రామనామాంకిత మైన రాముని ఉంగరం చుసుకో. నన్ను నువ్వు నమ్మడం కోసమూ, రాముడు నీకోసం ఆశపెట్టుకునివున్నాడని నీకు తెలియడానికి రాము డివ్వగా నేనిది తీసుకువచ్చాను" అని చెబుతూ యిచ్చాడు.

అది పుచ్చుకుని సీత, రాముడే తన చేతికి దొరికినంతగా ఆనందించింది. తరువాత "వానరోత్తమా! నువ్వు మహాపరాక్రమశాలివి. కార్య సమర్థుడవు. నువ్వొక్కడివే ఈ రాక్షసపట్నానికి రాగలినవాడవు. ఈ సముద్రం నూరామడల వెడల్పుంది. భీకర జంతువులతోనూ నిండివుంది. నువ్వు కపిసామాన్యుడవు కావని నాకు తోస్తోంది. కనుకనే నీకు లేశమూ సంభ్రమం లేదు. రావణుడంటే భయం కూడా లేదు. రాముడు పంపగా నువ్వు వచ్చావు. కనుక, నాతో మాట్టాడతగుదువు. బలపరాక్రమాలు తెలుసుకోకుండానూ, గుణగతులు పరిశీలించకుండానూ రాముడెవరినీ పంపడు. నా అదృష్టం వల్ల సత్యసంగరుడైన రాముడు, లక్ష్మణుడూ కుశలంగా వున్నారు. వారు దేవతలను కూడా నిగ్రహించగలరు. కాని నా దుఃఖాని కంతులేనట్టు కనబడుతోంది. రాముడు నాకోసం దుఃఖించి క్షీణించిపోవడం లేదు కదా? అతను చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు గదా? నా రాముడు మిత్రులయెడల సామదానోపాయాలూ, శత్రువులయెడల దానభేదదండోపాయాలూ ప్రయోగిస్తూ కుశలి అయివున్నాడు కదా? రాముడు కొత్తవారితో స్నేహం చేసుకుంటున్నాడా? వారున్నూ అతని స్నేహం కోరుతున్నారా? రాముడు దేవతానుగ్రహం సంపాదించుకుంటున్నాడు గదా? అతను కష్టాలకు తగడు. సుఖాలకే తగినవాడు. ఈ కష్టం వల్ల అతను కుంగిపోకుండా వున్నాడు కదా? కౌసల్య - సుమిత్ర - భరతుడు - వీరి క్షేమవార్తలు తెలుస్తున్నాయా? ఈ శోకం వల్ల రాముడు తక్కిన పనులు మానుకోకుండా వున్నాడా? నన్ను రక్షించాలని చూస్తున్నాడా? భ్రాతృవత్సలుడైన భరతుడు అన్నకు సాయంగా ఒక అక్షౌహిణి సేన అయినా పంపుతాడా? వానరాధిపుడైన సుగ్రీవుడు నాకోసం తన వానరసేనతో స్వయంగా వస్తాడా? శూరుడు, శస్త్రాస్త్రవేది అయిన లక్ష్మణుడు రాక్షసులను సంహరించే వుద్దేశంతోనే వున్నాడుగదా? రౌద్రమైన అస్త్రంతో త్వరలోనే రావణుడు కూలి బుగ్గి అయిపోవడం నేను చూస్తానుగదా? రామునిమీద నా కున్నంత స్నేహం తల్లికీ తండ్రికీ తక్కినవారికీ కూడా తేదు. కనుకనే, రాముని సంగతి తెలుసుకునేదాకా నేను జీవించివున్నాను" ఇలా చెప్పి సీత వూరుకుంది.

అప్పుడు హనుమంతుడు చేతులు శిరస్సున దోయిలించుకుని, "దేవీ! రాముడు నువ్విక్కడ వుండిన ట్టేరగడు. అంచేతనే అతను నీకోసం రాలేదు. నేను వెళ్ళి చెప్పగానే నీ రాముడిక్కడికి గొప్పసేనతో కదలివస్తాడు. రాముడు తన బాణాలతో సముద్రం స్తంభింపజేసి, లంకలో వొక్క రాక్షసపురుగైనా లేకుండా నాశనం చేస్తాడు. రాముడు దేవదానవు లడ్డువచ్చినా మృత్యువడ్డు వచ్చినా వారిని కూడా వధించేసి నీకోసం వస్తాడు. దేవీ! నేను వొట్టుపెట్టి చెబుతున్నాను. నువ్వు తప్పకుండా రాముణ్ణి కలుసుకుంటావు. నువ్వు త్వరలోనే ప్రస్రవణగిరిమీద వున్న రాముణ్ణి చూస్తావు. రాముడెప్పుడూ నిన్నే తలుచుకుంటున్నాడు. నీకోసమే పరితపిస్తున్నాడు. దృడదీక్షతో మళ్ళీ నిన్ను కలుసుకోడానికే ప్రయత్నాలు సాగిస్తున్నాడు" అని చెప్పాడు.

రాముని సంగతి తెలియడం వల్ల సంతోషమూ, రాముడు తనకోసం చిక్కిశాల్యం అయిపోతున్నాడని వినడం వల్ల దుఃఖమూ ఏక కాలంలో కలగడం వల్ల సీత శరన్మేఘశకలం కప్పిన చంద్రబింబంలాగా వుంది.

సీతను భుజాలమీద ఎక్కించుకుని తీసుకువెడతా ననుట


ఇది విని సీత "నేనూ, రాముడూ, లక్ష్మణుడూ యిలాగ దుఃఖార్తులమయివున్నాము చూడు. రాముడు ఈ దుఃఖసాగరం యెప్పుడు దాటుతాడు? రాక్షసులనందరినీ నాశనం చేసీ, రావణుణ్ణీ సంహరించి, లంక నాశనం చేసీ, రాముడు నన్నెప్పుడు చూస్తాడు? రావణుడు నాకు గడువుపెట్టిన సంవత్సరమూ గడచిపోకముందే తొందరపెట్టి రాముణ్ణి యిక్కడికి తీసుకురా. అంతవరకే నేను బతకడం. ఇక రెండుమాసాల గడువే మిగిలివుంది. రావణునికి మరణం ఆశన్నం అయింది. నా భర్త నన్ను తప్పకుండా కలుసుకుంటాడు. సందేహం లేదు. ఏమంటే? నా మనస్సు నిర్మలంగా వుంది. జనస్థాణంలో తమ్ముని సాయం లేకుండా తానొక్కడే పధ్నాలుగువేల రాక్షసయోధులను సంహరించిన రామునితో శత్రుత్వం వహించి యెవడు బతకగలడూ? రామునిశక్తి నాకే తెలుసు. రాముడనే సూర్యుడు శరజాలం అనే కిరణాలతో శత్రురాక్షసులనే జలాన్ని అతి సులభంగా యింకించేస్తాడు" అని చెప్పింది.


ఈ మాట లన్నప్పుడు సీతకళ్ళు చెమ్మగిల్లివున్నాయి. అది చూసి హనుమంతుడు "దేవీ! నేను వెళ్ళి మీ సంగతి చెప్పగానే రాముడు వానరయోధులనూ, భల్లూక యోధులనూ వెంటబెట్టుకుని త్వరలోనే యిక్కడికి వస్తారు. అలా కాదంటావా? మిమ్ముప్పుడే విడిపించగలను, నా భుజాలెక్కికూచో తల్లీ,, నిమిషంలో మిమ్మల్ని తీసుకుని సముద్రం దాటేస్తాను. మిమ్మే కాదు, లంక అంతా నేను పట్టుకుపోగలను. నేను మిమ్మల్ని ప్రస్రవణగిరి మీదవున్న రామునకు సమర్పించగలను. నా భుజాలెక్కి కూచో. ఉపేక్ష చెయ్యకు. ఆకాశమార్గాన నేను సముద్రం దాటేస్తాను. అని చెప్పాడు.


ఇది విని సీత చాలా ఆనందించింది. దాంతో ఆమె " హనుమా! అంత దూరం నన్నెలా మోస్తావూ! ఇదే నీ వానరత్వం నిరూపిస్తోంది. నువ్వు కాస్తంత వున్నావు. నన్నెలా తీసుకువెడతావూ?" అనడిగింది.