శ్రవణమ్ - కీర్తనమ్ - మననం

మననం కీదృశం బ్రహ్మన్ శ్రవణం చాపి కీ దృశమ్!
కీర్తనం వా కథం తస్య కీర్తయైతద్యథా యథమ్!!
శివపూజ, మంత్ర జపం, శివ గుణాలు, శివ రూపములు, శివ లీలలు, శివ నామములు, శివ యుక్తి, యందు అభిరుచి కలిగి కీర్తించి మననం చేయాలి. వీటన్నింటి గురించి చింతన చేయడమే మననం. మననం అనగా నిరంతర చింతన. శివుని యొక్క మంత్రం మననం. "మననాత్ త్రాయతే ఇతి మంత్రః" ఎవరు మననం చేస్తారో వారు రక్షింపబడతారు. సంత్రాణ కర్తయైన పరమేశ్వరుడు మననం చేసేవాళ్ళని రక్షిస్తున్నాడు.

ఉత్తమ సాధన మననం, మధ్యమ సాధన కీర్తనం. శివ ప్రతాపం, గుణాలను గాన రూపంగా కానీ, శాస్త్ర పదములతో అనగా వేదములలో చెప్పబడ్డ శివ వాక్యములు - 
"నమః శంభవేచ మయోభవే చ నమః శంకరాయ చ ౹ మయస్కరాయ చ నమః శివాయ చ శివటరాయ చ" -వేదములలో చేసిన స్తుతులు, పురాణములలో చెప్పబడిన స్తుతులు, శివానందలహరి, పుష్పదంతుని శివమహిమ్న స్తుతి, వంటి వాటిని స్పష్టమైన వాక్కుతో , రసత్తరంగా (ఆర్ద్రత పలికేటప్పుడు కనపడాలి) పలకాలి. 

రసవత్తరం అంటే రసమయమైన అలంకారాలతో చేసినవి అని చెప్పుకోవచ్చు. శివానందలహరిలో అడుగడుగునా రసం చిప్పిల్లుతూ ఉంటుంది. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు దానితో ఉత్పన్నమైన అన్ని రసాలు అందులో ఉన్నాయి. అలాగే పుష్పదంతుని మహిమ్న స్తోత్రం కానీ, అప్పయ్య దీక్షితుల వారి శివకర్ణామృతమ్ కానీ రసామృతం చిప్పిల్లుతూ ఉంటాయి. "శివేన వచసా త్వా గిరిశాచ్చావదామసి. యథా నస్సర్వమిజ్జగద యక్ష్మగం సుమనా అసత్" - వాక్కు ద్వారా నిర్మలమైన ఆ పరమాత్ముని కీర్తించినప్పుడు మనలోనూ, చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ ఉన్న జబ్బులన్నీ పోతాయి. మంచి మనస్సు వస్తుంది. ఇది శివ వచస్సుకున్న ఫలితం. అందుకు వాక్కుతో స్ఫుటంగా ఆయన గురించి అనడమే కీర్తన.

శ్రవణం:
యేనాపి కేన కరణేన శబ్దపుంజం యత్ర క్వవిచ్ఛివపరం శ్రవణేంద్రియేణ!
స్త్రీకేలివత్ దృఢతరం ప్రణిదీయతే యత్ తద్వైబుధాః శ్రవణమత్ర జగత్ప్రసిద్ధమ్!!
శ్రవణం వల్ల పరీక్షిన్మహారాజు తరించిపోయాడు. యే కారణంతోనైనా, ఎక్కడైనా, శివుని గురించి కీర్తించే శబ్దం తనకు ప్రియమైన ప్రియురాలి గురించి వార్తలను ఎలా వింటాడో అలా వినాలి. నాపై ప్రీతి కలిగి నాగురించి వచ్చే యేమాటనైనా పరమ ప్రీతితో వింటే అది గొప్ప సాధన అని శివుడు పార్వతికి చెప్పినట్లు మరొక ఘట్టంలో వస్తుంది.

వ్యాసుల వారికి సనత్కుమారుల వారు చెప్పారు. ఒకానొకప్పుడు వ్యాసుడు సరస్వతీ నదీ తీరమునందు సాధన చేస్తూ కూర్చున్నారు. అప్పుడు సనత్కుమారుడు గగనమార్గంలో వెళ్తూ వ్యాసుని చూచి తపస్సుకు కారణం అడుగగా వ్యాసులు సత్యవస్తువు కోసం చింతన చేస్తూ ఉన్నాను. ఆ సత్యవస్తువైనటువంటి ఆ పరమాత్మను యేవిధంగా పొందవచ్చు? అనేదాని గురించి ఆలోచిస్తున్నాను అన్నారుట. అప్పుడు సనత్కుమారుడు ఇలా చెప్పారు.

శ్రవణం కీర్తనం శంభోర్మననం చ మహత్తరమ్!
త్రయం సాధన ముక్తం చవిద్యతే వేద సమ్మతమ్!!
దానికి శ్రవణమ్, కీర్తనమ్, మననం అనునవి వేదసమ్మతమైన సాధనములు అని చెప్పెను. ఒకప్పుడు సనత్కుమారులు మందర పర్వతమునందు తపస్సాధనకు కూర్చొని ఉండగా నందికేశ్వరుడు వచ్చాడు.
సాధన కోసం మనంతట మనం కూర్చుంటే యేమి సాధన చేయాలో భగవంతుడే చెప్తాడు. తనకోసం రావాలని తపన పడే వారిని ఆయన దగ్గరికి ఎలా రప్పించుకోవాలో భగవంతునికి తెలుసు. అందుకు తగిన వారిని ప్రేరణ చేసి ఆయనే పంపిస్తాడు. ఆయన దయాళువైనటువంటి గణేశ్వరుడు. నంది శివగణానికి పతి. లోకంలో గురువులు, మహాత్ములు మనమిచ్చే దక్షిణలకు బోధిస్తారని అనుకుంటాం మనం. కానీ మనం తరించాలనే దయతో వారు చెప్తారు. ఆయన సర్వజ్ఞుడు, భగవాన్ - జ్ఞానసంపూర్ణుడు, సద్గుణేశ్వర సంపన్నుడు. పైగా సర్వ సాక్షి - సర్వమూ తెలిసిన సర్వజ్ఞుడు.

ఉవాచ మహ్యం స స్నేహం ముక్తిసాధన ముత్తమమ్!
సనత్కుమారుని చూడగానే కలిగిన దయతో చెప్పాడు. ఈ మూడూ గొప్ప సాధనములు. ఈ మూడూ బలపడడానికి సాధనం శివ పూజ. త్రికరణాలూ శివమయం కావడం కోసమే శివపూజ. 

ఈ మూడూ సాధ్యం కాని వారు శివలింగాన్ని పూజించాలి. శివ పూజకంటే గొప్పవి శ్రవణ, కీర్తన, మననములు. సాధకులు పూజ మానరు. మహా సాధనతో పూజ చేస్తారు. మహా సాధన రాని వారు పూజే చేసుకోవాలి. మహా సాధన కావాలంటే లౌకిక విషయాలపై మనస్సు ఉండకూడదు. మాట, చింతన, వినడం శివుని గురించే. ఆ స్థితి జీవన్ముక్త సఖులు.