శివ రాత్రి బ్రహ్మోత్సవం
బోళాశంకరుడైన సర్వేశ్వరుడు భక్తితో శివ...అనితలిచిన వారందరికి వరాలు ఇచ్చిన వరప్రదాత. అల్పమైన సాలీడు నుంచి అత్యంత పెద్దజీవి ఏనుగు వరకు, ఇలా సమస్త ప్రాణికోటి జీవనానికి ఆరాధ్యదైవం శివుడే, అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమనై కుట్టదంటారు. ఆ రీతిన బ్రహ్మ నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఒక్కోరోజున ఒక్కో రాత్రిగా ముక్కంటీశుని బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
దేవరాత్రి: మహాశివరాత్రి వార్షిక
బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజున దేవరాత్రిగా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో
భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం
చేసేందుకు బ్రహ్మ, విష్ణువులు, అష్టదిక్పాలకులు, సప్తరుషులు,
యక్ష, కిన్నెర, కింపురుషాది మహానీయులను ఈ విశేషోత్సవాలకు ఆహ్వానిస్తారు.
భూతరాత్రి : సమస్త భూతగణాలు
సర్వేశ్వరుని అధీనం. అందుకే బ్రహ్మోత్సవాల్లో రెండో రోజును భూతరాత్రిగా
పిలుస్తారు. ఈ విశేషోత్సవం రోజున ఉదయం సూర్యఫ్రభ పైన దర్శనమిచ్చే సోమస్కంధమూర్తి.
రాత్రి భూత వాహనంపై భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు.
గాంధర్వ రాత్రి : గాంధర్వ,
యక్ష, కిన్నెర, కింపురుషాది మహానీయులు శివభక్తితో ముక్తి మార్గాన నడిచి
కైవల్యప్రదాత ఆశీస్సులను పొందారు ఆకారణంగా, మూడో రోజున గాంధర్వ రాత్రిగా పిలుస్తారు. ఈ సందర్భంగా
సర్వేశ్వరుడు బ్రహ్మోత్తముడైన రావణబ్రహ్మను అధిరోహించి భక్తులకు దర్శనమీయనున్నారు.
నాగరాత్రి : నాగజాతుల్లో
శివారాధన ఎక్కువ. ఆ జాతి ఉద్ధరణకు శివయ్య మెడలోనూ, గణపతి నడుముకు, కుమారస్వామి వద్ద
సర్పరాజాలకు ఆశ్రయమిచ్చారు. సృష్టిలో ఏ ప్రాణిలోను శివతత్వం ఉందనేందుకు
నిదర్శనంగా...నాల్గవరోజు శేషవాహనాన్ని అధిరోహిస్తాడు. అందుకే ఈ రాత్రిని
నాగరాత్రిగా పిలుస్తారు.
మహాశివరాత్రి : నెలకో పర్యాయం వచ్చే
మాసశివరాత్రుల్లో మాహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యముంది. అందుకే బ్రహ్మోత్సవాల్లో
ఐదో రోజున సోమస్కంధమూర్తి అయిన సర్వేశ్వరుడు తనకెంతో ప్రీతిపథమైన వృషభుడిపై
విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పించనున్నాడు.
బ్రహ్మరాత్రి : సృష్టికర్త అయిన
చుతుర్ముఖుడు దేవదేవుడు ఊరిగే దివ్యరథానికి సారధి అవుతాడు. ఈయన సమక్షంలో జరగడం
వల్లే దీన్ని బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. ఈ ఉత్సవాల్లో రథోత్సవాన్ని
బ్రహ్మరాత్రిగా పిలుస్తారు.
స్కంధరాత్రి : తారకాసుర
సంహారం జరగాలంటే కుమారస్వామి జన్మించాలి. అందుకోసమని పర్వతరాజ పుత్రిక అయిన
పార్వతికి సర్వేశ్వరునికి జరిపించే కల్యాణమిది. ఈ దివ్యమైన రాత్రిని స్కంధరాత్రిగా
పిలుస్తారు.
ఆనందరాత్రి : పార్వతి దూరం
కాడంతో తపస్సులో తలమునకలవుతున్నసర్వేశ్వరునికి వివాహం జరగడంతో యావత్తు జగత్తుకు కొత్తశోభ
సంతరించుకుంది. సమస్త ప్రాణికోటి ఆనంద సాగరంలో తలమునకలైంది. అదే సమయంలో
సర్వేశ్వరుడు నటరాజ మూర్తి శివతాండవంలో మునిగిపోతారు. ఈ విశిష్టత కల్గిన రోజున
ఆనందరాత్రిగా పిలుస్తారు.
ఋషిరాత్రి :
కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు కనుమపండుగ రోజున కైలాసగిరి ప్రదక్షిణానికి
వెళ్ళిన సర్వేశ్వరుడు వివాహ మహోత్సవం పూర్తయ్యాక వీరందరికీ వీడ్కోలు పలికేందుకు
మళ్ళీ గిరి ప్రదక్షణకు బయలుదేరుతాడు. వివాహానికి రుషులు, మునిపుంగవులను సాగనంపే ఉత్సవం కావటంతో దీన్ని రుషిరాత్రిగా
పిలిస్తారు.
దేవరాత్రి : ఉత్సవాలు
పూర్తి కావటంతో ఎలాగైతే సమస్త దేవగుణాలను పిలిచారో.. అదే ద్వజారోహణం సందర్భంగా
మీరందకి వీడ్కోలు పలుకుతారు. తిరిగి దీన్ని దేవరాత్రిగా పిలుస్తారు. ఇలా
దివ్యరాత్రులతో శోభితంతో సర్వేశ్వరునికి ఈ విశేషోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా
వస్తోంది.