సంక్రాంతి - ఉత్తరాయణ పుణ్యకాలం

సంక్రాంతి పర్వదినాన సూర్యుడు మకర రాశి అధిపతి, తన కుమారుడు అయిన శనీస్చరుని ఇంట ప్రవేశిస్తాడు. పురాణ కథనానుసారం, ఇరువురూ బద్ధ విరోధులే అయినా మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు విధిగా తన కుమారుడు శనితో సమావేశమవుతాడు. ఒక నెల రోజులు కొడుకు ఇంటనే గడుపుతాడు. ఈ విధంగా ఈ పర్వదినం తండ్రీ కొడుకుల అనుబంధానికి కూడా ఒక సంకేతం అని చెప్పవచ్చు.

ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగా - దక్షిణాయనం రాత్రిగా భావించడంతో దేవతలు పగలులో సంక్రమించే మకర సంక్రాంతిని ఒక మహాపర్వదినంగా భావస్తారు. ఉత్తరాఁణ పుణ్యకాలాన్ని దేవమానంగా, దక్షిణాయనాన్ని పితృయానంగా భావించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

ఇక సంక్రాంతి పర్వదినంలోనే శ్రీహరి రాక్షసుల్ని సంహ రించి వారి తలలు నరికి మందర పర్వతం కింద పాతిపెట్టి, దేవతలకు సుఖశాంతు లు ప్రసాదించాడనీ అందుకే ఈ పండుగని అశుభాల్లోంచి శుభాల్లోకి ప్రవేశించే సింహద్వా రంగా భావించి పవిత్రంగా ఈ పండుగని జరుపుకుంటారు.

కపిల మహాముని ఆశ్రమ ప్రాంగణంలో భస్మమైన 60000 మంది సాగర మహారాజు కుమారులకు సద్గతులు కల్పించడానికి భగరధ మహారాజు కఠోర తపస్సు చేసి గంగానదిని భూమికి అవతరింపచేసాడు. కపిల ముని ఆశ్రమమే నేటి గంగాసాగర్‌ అని భక్తుల విశ్వాసం. సంక్రాంతి పర్వదినం నాడే భగీరధుడు ఆ 60 వేల మందికీ పరమ పవిత్ర గంగాజలంతో తర్పణలు అర్పించి వాళ్ళని శాపవిముక్తుల్ని చేసాడని ప్రతీతి. భగీరథుని కోరిక ప్రకారం పూర్వజుల శాప విముక్తికి గంగా భవాని పాలాళ లోకంలో ప్రవేశించి చివరికి సముద్రంలో కలుస్తుంది. ఏటా మకర సంక్రాంతి పర్వరినాన గంగానది పాతాళలోకంలో ప్రవేశించి చివరికి బంగాళా ఖాతంలో కలుస్తుంది. ఏటా మకర సంక్రాంతి పర్వదినాన గంగానది బంగాళా ఖాతంలో కలసిన పవిత్ర సమయంలో లక్షలాది భక్తులు గంగా నదిలో తమ పితృదేవతలకి తర్పణలిస్తారు.

మహాభారత యుద్ధంలో స్వచ్ఛంద మరణ శక్తిని కలిగిన భీష్మాచార్యుడు యుద్ధరంగంలో నేలకొరిగి తన భౌతిక శరీరం త్యజించడానికి సంకల్పించి అంపశయ్య మీద పవళిచి, చివరికి మకర సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేహత్యాగం చేసాడు. అందుచే మకర సంక్రాంతి మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి పునర్జన్మ ఉండదని ప్రగాఢ విశ్వాసం.

సిక్కులు మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. మకర సంక్రాంతినాడే వారిగురు పరంపరలో 10వ గురువైన గురుగోవింద్‌ సింగ్‌ 40మంది సిక్కులు రాసిన బేదాయలను చింపివేసి వారికి ముక్తిని కలిగించాడు. ఆ తరువాత 40 మంది సిక్కులూ 40 ముక్తులుగా సుప్రసిద్ధులయ్యారు. అందువలన ఈ పర్వదినాన్ని సిక్కు మతస్తులు మరింత ఘనంగా జరుపుకుంటారు.