వినయం - విజ్ఞానం
‘‘విద్యాదదాతి వినయమ్’’
ఇది వేదకాలంనాటి ఋషుల వాక్కు. వినయగుణం విద్యను,
క్రమశిక్షణను, విజయాన్ని ప్రసాదిస్తుంది. వినయంతో ఏదయినా సాధించవచ్చు.
కార్య సాఫల్యానికి వినయమే పునాది.
విద్యావంతుడు గర్వపడకుండా
వినయ విధేయతలు కల్గి ఉంటే ఆ విద్య ఉన్నతమైనదనీ, అది కల్గిన వ్యక్తి ఉత్తముడనీ, సర్వమత గ్రంథాలు ఒక్కమాటగా చెబుతున్నాయి. విద్యవలన వినయగుణం
కలగాలి గానీ అహంకారం కల్గకూడదు. వినయ గుణాన్ని వివరిస్తూ భారత, రామయణాలలో ఎన్నో ఘట్టాలు కనిపిస్తాయి.
విదురుడు నీతి కోవిదుడు.
తనకు తెలిసింది ప్రజలకు తెలియజెప్పుతూ అందరూ నీతి మార్గంలో పయనించాలని కోరేవాడు.
కురుక్షేత్ర సంగ్రామానికి ముందు విదురుడు ధ్రుతరాష్ట్రుని వద్దకు వెళ్ళి వినయం
గురించి వివరిస్తూ ‘‘ప్రభూ! దుష్టులకు ధనము,
విద్య, వంశం అనే ఈ మూడు
మదాన్ని కల్గిస్తాయి. మంచివారికేమో వినయ విధేయతలు చేకూర్చి పెడతాయి. సత్ఫురుషుడు,
వినయగుణ సంపన్నుడు అయిన ధర్మరాజుతో యుద్ధం
చేస్తే కౌరవులకు ఓటమే తప్ప గెలుపు దక్కదు. చివరికి కురువంశ నామరూపాలు లేకుండా
నశించిపోతుంది. కనుక అలా జరుగకుండా దుర్యోధనాదులను పిలచి సంధి చేసుకోవమని తెలియ
చెప్పడం మంచిది’’ అంటూ హితవు మాటలు చెప్పాడు.
అన్నదమ్ముల మధ్య యుద్ధం జరగకూడదని మంచి ఉద్దేశ్యంతో విదురుడు చెప్పిన మాటలు
కౌరవులకు రుచింపలేదు. కయ్యానికి కాలు దువ్వారు. అటుపై జరగవలసిందంతా జరిగిపోయింది.
కచుడు దేవగురువు బృహస్పతి
కుమారుడు. అతడు తన వినయ గుణంతో శుక్రాచార్యుల వద్ద శిష్యునిగా చేరి ‘మృత సంజీవని’ విద్యను
నేర్చుకోగలిగాడు. కచుడు తన విరోధియగు బృహస్పతి కుమారుడని తెలిసి కూడా అతని వినయ
విధేయతలకు ముగ్ధుడై శిష్యునిగా తీసుకున్నాడు. ‘‘అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని
విస్తరి ఎగిరి ఎగిరి పడుతుంది’’ అనే ఓ సామెత వాడుకలో ఉంది.
మంచివాళ్ళు ఎప్పటికీ వినయంగానే ఉంటారు. చెడ్డగుణాలు కల్గిన వారేమో వాటిని కప్పి
పుచ్చేందుకై గొప్పలు చెప్పకుంటారు. అందుకు తగినట్టుగా ప్రవర్తిస్తారు.
వినయగుణానికి ఉదాహరణగా
మనచేతి వేళ్ళను గురించి చెప్పుకోవచ్చు. చేతికి ఉన్న ఐదువేళ్ళను అలా ముడుచుకుంటే
పిడికిలి అవుతుంది. ఆ పిడికిలి బిగిస్తే దేనినైనా ఎదుర్కొనే ధైర్యం; ఆత్మవిశ్వాసం కల్గుతుంది. ఆ విశ్వాసమే గెలుపును
అందిస్తుంది. దీనినిబట్టి వినయంతో మనం ఏదైనా సాధించవచ్చు. అహంకారికి పతనం తప్పదు
అని తెలుస్తుంది. వినయంవల్ల బోల్డు ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఓ
ఐదింటిని చెప్పుకోవాలి.
(1) వినయంవల్ల మనకు కొత్త
విషయాలు తెలుస్తాయి. తద్వారా విజ్ఞానం పెరుగుతుంది.
(2) అనుకున్న లక్ష్యాన్ని
సాధించి, అందరిచేత మెప్పు
పొందగల్గుతారు.
(3) వినయశీలుని కీర్తి అన్ని
దిశలకూ వ్యాపించి ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు.
(4) సంపద కల్గుతుంది.
(5) శత్రువులు నశించడంతోపాటు
మిత్రలాభం కల్గుతుంది.
తల వంచినవాడు ఎప్పటికీ
చెడిపోడు అన్నది అనుభవం ద్వారా తెలిసే నిజం.
ఈ నిజం తెలుసుకొని ప్రతి
ఒక్కరు వినయ, విధేయతలతో మెలిగతే ఓటమి
ఉండదు. గెలుపు మనదవుతుంది.