శ్రీకృష్ణుడు,భీష్ముడు చెప్పిన బ్రాహ్మణ మహిమ
భీష్ముడు ఉపదేశించిన విష్ణుసహస్రనామ
మహిమ విన్న తరువాత ధర్మరాజు మహదానందం పొందాడు. అయినా ధర్మరాజుకు సందేహాలు ఇంకా
మిగిలి ఉన్నాయి.
అందుకే ధర్మరాజు భీష్ముడితో ” పితామహా !
పూజించడానికి, నమస్కరించడానికి అర్హులు
ఎవరు. ఎవరికి ఆనందం కలిగిస్తే మానవులకు శుభములు కలుగుతాయి. ఎవరికి హాని కలిగిస్తే
మానవులకు హాని, అశుభములు కలుగుతాయి ”
అని అడిగాడు. భీష్ముడు ”
ధర్మనందనా ! ఈ లోకములో పూజించడానికి అర్హులు బ్రాహ్మణులే.
బ్రాహ్మణులకు హాని కలిగించినట్లయితే సాక్షాత్తు దేవేంద్రుడికి కూడా తిప్పలు
తప్పవు. బ్రాహ్మణులు సంతోషించిన సకల శుభములు కలుగుట తధ్యము. బ్రాహ్మణులు ఈ లోకముకు
ఆధారము. బ్రాహ్మణులు ధర్మముకు వారధిలాంటి వారు. సకలశాస్త్రములు వేదవేదాంగములు
ప్రవచించడానికి అర్హులు బ్రాహ్మణులు మాత్రమే. విప్రులకు తపస్సు, సత్యవాక్కు ధనముతో సమానము. బ్రాహ్మణులకు ఒక్క పూట భోజనము
పెట్టిన వాడి పాపములు పటాపంచలు ఔతాయి. దేవతలకు కూడా దేవతలు బ్రాహ్మణులు
బ్రాహ్మణులే. బ్రాహ్మణుడు బాలుడైనా పూజనీయుడే. ఇక వృద్ధ బ్రాహ్మణుని విషయము
చెప్పనలవి కాదు ” అని భీష్ముడు చెప్పాడు.
ధర్మరాజు ” పితామహా ! బ్రాహ్మణులను గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా !
బ్రాహ్మణులను పూజించిన వారికి కలుగు శుభములు ఎవి ? వారిని ఇంతగా పూ జించడానికి బ్రాహ్మణులలో ఉన్న విశిష్ట
గుణములు ఏవి ? ”అని అడిగాడు”
ధర్మనందనా ! నీ సందేహానికి సమాధానంగా పవనార్జున సంవాదం
వినిపిస్తాను.
కార్తవీర్యార్జునుడు వేయచేతులు కలిగిన మహావీరుడు. అతడు తనకు కలిగిన
బలగర్వము వలన ” ఈ ముల్లోకములలో నాకు సాటి
బలవంతుడు లేడు ” అని బిగ్గరగా పలికాడు. అది
విన్న ఒక భూతము బదులుగా ” ఓరాజా ! నీ విలా పలుకతగదు.
లోకములకన్నా భూసురులైన బ్రాహ్మణులు అధికులని నీకు తెలియదా ! ” అని పలికింది. అందుకు కార్తవీర్యార్జునుడు బ్రాహ్మణులు
రాజులను ఆశ్రయించుకుని జీవిస్తారు కదా ! అలాంటి బ్రాహ్మణులు రాజులకంటే అధికులు ఎలా
ఔతారు ? నాకు అనుగ్రహం వస్తే
బ్రాహ్మణులను ఆదరిస్తాను. కోపము వస్తే అందరినీ దండిస్తాను ” అని చెప్పాడు. ఈ మాటలకు ఆ భూతము మారుపలుకక వెళ్ళి పోయింది.
ఆ సమయంలో వాయుదేవుడు తనను తాను ఎరిగించుకుని ”
ఓ రాజా ! నీవు బ్రాహ్మణులను రక్షిస్తున్నానని
అనుకుంటున్నావు. కాని ఆ బ్రాహ్మణుల రక్షణలోనే నీవు ప్రజలను రక్షిస్తున్నావని
తెలుసుకో. ముల్లోకాలలో పూజనీయులు బ్రాహ్మణులే. అహల్యను కోరిన ఇంద్రుడు గౌతమ ముని
శాపం పొంద లేదా! అగస్త్యుడు సముద్రమును ఔపోసన పట్ట లేదా! భృమహర్హి అగ్ని దేవుడిని
శపించ లేదా!” అన్నాడు. ఆ మాటలకు
కార్తవీర్యార్జునుడు బదులు పలుక లేదు.
ఉచధ్యుని వృత్తాంతం
వాయుదేవుడు తిరిగి
కార్తవీర్యార్జునితో ” ఒ మహారాజా ! నీకు ఒక
కథచెప్తాను విను.
పూర్వము అంగీరస వంశంలో జన్మించిన ఉచధ్యుడు చంద్రుడి కుమార్తెను
కోరగా చంద్రుడు తన కుమార్తెను ఉచధ్యుడికి ఇచ్చి వివాహము చేసాడు. వారిరువురు
ఆనందంగా జీవిస్తున్న తరుణంలో వరుణుడు చంద్రుని కుమార్తె మీద కోరిక పెంచుకుని
ఉచధ్యుడు స్నానికై నదీతీరానికి వెళ్ళిన తరుణంలో ఉచధ్యుడి భార్యను అపహరించి
తీసుకుని వెళ్ళి తన అంతఃపురంలో ఉంచాడు. ఈ విషయం నారదుడికి తెలిసి ఉచధ్యుడికి విషయం
తెలిపాడు. ఊచధ్యుడు ” దిక్కులకు అధిపతి అయిన
వరుణుడికి పరుల భార్యల మీద మక్కువ పెంచుకొనుట తగదు. నీవు ఉచధ్యుడి వద్దకు వెళ్ళి
నేను ఇలా చెప్పానని చెప్పు ” అని చెప్పాడు. నారదుడు ఈ
విషయం వరుణుడికి చెప్పాడు. కాని కామంతో కళ్ళు మూసుకు పోయిన వరుణుడు ”
నారదా ! నీవు చెప్పినా సరే నేను ఉచధ్యుని భార్యను విడువను ”
అని చెప్పాడు.
నారదుడు ఉచధ్యుని వద్దకు వెళ్ళి ”
ఉచధ్యా ! వరుణుడు నా మాటను కూడా గౌరవించక నీ
భార్యను వదలడానికి నిరాకరించడమే కాక నన్ను తన వారితో బయటకు గెంటించాడు ” ఆ మాటలు విన్న ఉచధ్యుడు ఆగ్రహించి సముద్రజలాలను ఒక్క
గుక్కలో పీల్చి వేసి లోకాలను గడగడలాడించాడు. వరుణుడు కూడా గడగడ లాడుతూ ఉచధ్యుని భార్యను
తీసుకు వచ్చి అతడికి సమర్పించి తనను మన్నించమని వేడుకున్నాడు. కనుక రాజులకంటే
బ్రాహ్మణులు గొప్పవారు ” అని వాయుదేవుడు
కార్తవవీర్యార్జునుడికి చెప్పాడు.
దేవతలను రక్షించిన
బ్రాహ్మణులు
వాయుదేవుడు తిరిగి ”
పూర్వము దేవతలు రాక్షసుల చేతిలో ఓడి పోయి
ఇక్కట్ల పాలైన తరుణంలో అగస్త్యుడు రాక్షసులను జయించి దేవతలను రక్షించాడు. మరొకసారి
రాక్షసులు దేవతలను ఓడించి వారిని హింసల పాలు చేసిన తరుణంలో దేవతలు వశిష్టుడికి
వెళ్ళి మొరపెట్టుకున్నారు.
వశిష్ఠుడు ఆగ్రహించి ఒక్క హూంకారం చేసి రాక్షసులను
భస్మము చేసాడు. కనుక దేవతల కంటే కూడా బ్రాహ్మణులు గొప్పవారు ” అని వాయుదేవుడు చెప్పాడు.
కార్తవీర్యార్జునుడు బదులు పలుక
లేదు.
వాయుదేవుడు తిరిగి ” ఒకసారి రాక్షసులకు దేవతలకు
జరిగిన యుద్ధంలో రాహువు సూర్య చంద్రులను తన అస్త్ర ప్రయోగంతో మూర్చిల్ల జేసాడు.
లోకాలన్ని చీకట్లలో మునిగి పోయాయి. రాక్షసులు దేవతలను తరిమికొట్టారు. వారు
అత్రిమహామునికి మొరపెట్టుకొనగా అత్రి మహాముని తన తపోమహిమతో సూర్య, చంద్రుల మూర్చను పోగొట్టి లోకాలను కాంతివంతం చేసి
రాక్షసులను నాశనం చేసి దేవతలను రక్షించాడు. కనుక బ్రాహ్మణులు ముల్లోకాలకు
గొప్పవారు ” అని చెప్పాడు.
వాయుదేవుడు
ఇంకా ఇలా చెప్పాడు ” కార్తవీర్యార్జునా ! ఒకసారి
ఇంద్రుడు అశ్వినీ దేవతలకు సోమపానముకు అర్హత లేదని శాసించంచాడు. అప్పుడు అశ్వినీ
దేవతలు చ్యవనుడిని ఆశ్రయించారు. చ్యవనుడు అశ్వినీదేవతలకు మేలు చేయడము కొరకు
ఇంద్రుడితో పగ తెచ్చుకున్నాడు. ఇంద్రుడు చ్యవనుడిని చంపాలనినుకున్నాడు. ఇంద్రుడు
చ్యవనుడి మీదకు ఒక కొండను, వజ్రాయుధాన్ని విసిరాడు.
చ్యవనుడు వాటిని తిప్పి కొట్టి చేసి మదుడు అను రాక్షసుడిని సృష్టించి వారి మీదకు
పంపాడు. మదుడు దేవతలను దేవేంద్రుడితో సహామింగి వేసాడు. అప్పుడు వారంతా చ్యవనుడిని
ప్రార్ధించి తమ స్వస్వరూపాలను తిరిగి పొందారు. ఇంద్రుడు దేవతలతో సహా చ్యవనుడికి
ప్రణామం చేసి తమను మన్నించమని కోరాడు. చ్యవనుడు ఇంద్రుడిని అశ్వినీదేవతలకు
సోమపానార్హత కలిగించమని కోరాడు. ఇంద్రుడు దేవతలకు సోమపానార్హత కలిగించాడు.
చ్యవనుడు బ్రాహ్మణుడైనా దేవేంద్రుడికంటే గొప్పవాడని అనిపించుకున్నాడు కదా ! ”
అన్నాడు.
ఇంతచెప్పినా కార్తవవీర్యార్జునుడు
అంగీకరించక మౌనం వహించాడు. అప్పుడు వాయు దేవుడు తిరిగి ” మహారాజా ! అంతెందుకు నీ గురువు బ్రాహ్మణుడు అయిన
దత్తాత్రేయుడి మహిమవలెనే కదా నీవింత గొప్పవాడివి అయి ఇంతటి మహా బలపరాక్రమాలు
సంపాదించి రాజులలో మాణిక్యములా వెలుగుతున్నావు. నీవే కాదు మానవులు, దేవతలు కూడా బ్రాహ్మణుల మహిమవలెనే మనుగడ సాగిస్తున్నారు.
కనుక నీవు కూడా బ్రాహ్మణుల మహిమను గుర్తించి వారిని పూజించి సౌఖ్యములను పొందు ”
అన్నాడు. కార్తవవీర్యార్జునుడి గర్వము అంతటితో
అణిగి పోయి బ్రాహ్మణుల గొప్పతనము అంగీకరించి బ్రాహ్మణులను పూజించి సుఖములను
పొందాడు. కనుక ధర్మరాజా ! నీవు కూడా బ్రాహ్మణులను పూజించి సౌఖ్యములను పొందు ”
అన్నాడు భీష్ముడు.
బ్రాహ్మణ పూజ
ధర్మరాజు ” పితామహా ! ఎంత విన్ననూ నాకు శ్రీకృష్ణతత్వము వినవలెనని
కోరికగా ఉన్నది. నాకు ఇంకా బ్రాహ్మణమహిమలు వివరించండి ” అని అడిగాడు. భీష్ముడు ” ధర్మనందనా ! నాకు ఇంద్రియములు, వాక్కు, మనస్సు దుర్బలము అయ్యాయి.
నేనిక అలసి పోయాను. దక్షిణాయనము అయిపోవస్తుంది. ఉత్తరాణము సమీపిస్తుంది. నేను ఇక
నిష్క్రమించ వలసిన కాలము సమీపిస్తుంది. శ్రీకృష్ణుడికి బ్రాహ్మణతత్వము బాగా
తెలుసు. అతడు సర్వజ్ఞుడు. అతడు నీకు బ్రాహ్మణమహిమలు వివరిస్తాడు. నాకు కృష్ణతత్వము
బాగా తెలుసు. అతడు వరాహరూపము ఎత్తి భూమిని అవలీలగా తన కోరల మీద ఎత్తాడు. ఈ భూమి
మీద జీవజాలము ఆవిర్భావము శ్రీకృష్ణలీల కాక మరేమి ? అతడు తన నాభికమలము నుండి బ్రహ్మను సృష్టించి ఈ
సృష్టికార్యము జరిపంచాడు. బ్రహ్మ కారకుడే కాని మూలము శ్రీకృశష్ణుడే. ఎప్పుడైతే
దనుజులు ధర్మమును నశింపచేస్తారో అప్పుడు శ్రీకృష్ణుడు అవతరించి ధర్మమును కాపాడి
ధర్మాత్ములను రక్షిస్తాడు. దేవతలు, విశ్వపతి, దిక్పాలకులు, పరమేశ్వరుడు అన్నీ
శ్రీకృష్ణుడే. కాలము, జగత్తు, దిక్కులూ అన్నీ తానే అయి ఉన్నాడు. యజ్ఞ స్వరూపుడైన
శ్రీకృష్ణుడిని ఋత్విక్కులు వేద మంత్రములతో స్తుతిస్తారు. ఋగ్వేదములో
శ్రీకృష్ణస్తుతి వింతకాదు. యజ్ఞము, ఋత్విక్కులు, యజ్ఞ సామాగ్రి, మంత్రములు, యజమాని అన్నీ ఆయనస్వరూపమే. సూర్యచంద్రులకు వెలుగును ఇచ్చే
పరంజ్యోతి స్వరూపుడు అతడే. అతడే సత్యము, నిత్యము, అజరామరమైన పరమపదము ” అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
శ్రీకృష్ణుడు చెప్పిన
బ్రాహ్మణ మహిమ
ధర్మరాజు ” శ్రీకృష్ణుడి ముందు ప్రణమిల్లి ” దేవదేవా ! శ్రీకృష్ణా ! నాకు బ్రాహ్మణతత్వము వినవలెనన్న
కోరిక తీరలేదు కనుక నన్ను కరుణించి వివరించవా ! ” అని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ” ధర్మనందనా ! నేను ప్రద్యుమ్నుడికి చెప్పిన విషయాలు నీకు
వివరిస్తాను. మానవులకు ధర్మార్ధకామమోక్ష సాధనకు, దేవతార్ఛనకు, పితృదేవతార్చనకు,
ఇహలోకసౌఖ్యములు పొందుటకు కారణం అందుకు సహకరించే
బ్రాహ్మణులే. దేవతలకు కూడా ఆయుస్షు, సంపద, కీర్తి కలగడానికి కారణం బ్రాహ్మణులే. బ్రాహ్మణులు
అనుగ్రహిస్తే సంపదలు పొందగలరు. బ్రాహ్మణులు ఆగ్రహించిన ఎంతటి వారైనా భస్మము
కాగలరు. ఇహలోక సుఖములకే కాక పరలోక సుఖములు పొందుటకు కూడా కారణం బ్రాహ్మణులే. ఇది
తెలపడానికి నీకు ఒక వృత్తాంతం చెప్తాను విను. దుర్వాసుడనే మహాముని ఉండే వాడు. అతడు
వింతమనస్కుడు. అతడి చేష్టలు ఎవరికి అర్ధము కావు. ఒకసారి మంచముమీద నిద్రిస్తాడు.
ఒకసారి నేలమీద నిద్రిస్తాడు. మన మిచ్చినప్పుడు ఆహారము తినడు. తను అనుకున్న వెంటనే
ఆహారము అందివ్వవలసినదే. ఒక్కోసారి ఏమీతినడూ. ఒక్కోసారి వందమంది భోజనము ఒక్కడే
తింటాడు. ఒక నాడు దుర్వాసుడు మా ఇంట పాయసం కావాలని అడిగాడు. మేము అతడికి పాయసం
ఇచ్చిన వెంటనే దానిని కొంచం తిని తరువాత తన ఒంటికి పూయమని కోరాడు. నేను అలాగే
చేసాను.