రామాయణం - రావణుని చరిత్ర
రామాయణాన్ని -
ముఖ్యంగా చివరిదైన ఉత్తరకాండ ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే, రావణుడు శ్రీలంకలో స్థిరపడ్డవాడే తప్ప
ద్రవిడుడు కాదని అర్ధం అవుతుంది. ఈ ప్రకారం చూస్తే మధుర - ప్రస్తుత దక్షిణ డిల్లీ
ల మధ్య విస్తరించిన యదువంశం నుండి రావణుడు వచ్చిన ఆనవాళ్ళు ఉత్తరకాండలో కనపడతాయి.
నిజానికి సీతాపహరణానికి ముందు రావణుని ప్రస్తావన ఎన్నో ఉత్తరాది ప్రాంతాలలో ఉంది.
రామాయణానికి ఎంతో కాలం పూర్వమే శ్రీలంకపై ఈ విధమైన ఉత్తరాది వలస జీవుల
ఆధిపత్యానికి చారిత్రక ఆధారాలున్నాయి. మొట్టమొదటిసారిగా శ్రీలంకపై పట్టు సాధించిన
గుజరాత్ ప్రాంతానికి చెందిన యదు వంశీకులు రామాయాణానికి ఎంతో ముందర కాలంవారు.
గుజరాత్ సముద్ర తీరం నౌకాయానానికి అనుకూలంగా ఉండుటచే వీరు అరేబియా సముద్రతీర
ప్రాంతాలైన దక్షిణాది భారతం మొదలుకుని శ్రీలంక వరకు రాజ్యాధికారాన్ని
స్థాపించగలిగారు. వీరి వ్యాపార, సంఘ నిర్మాణ
విస్తరణలో భాగంగా ఇది సాధ్యమయ్యింది. ఉత్తరకాండం రావణునికీ, గుజరాత్- మహారాష్ట్ర-రాజస్థాన్-మరియు మధురల
మధ్య విస్తరించిన యదు వంశీకులకు గల సంబంధ బాంధవ్యాలను విశదీకరించింది.
మధురను పాలించిన
సురశేనుల రాజు లవణునికి, రావణునికి గల
బంధుత్వ ప్రస్తావన ఇందులో ఉంది(ఈ లవణుడే రాముని తమ్ముడైన శతృఘ్నుని చేతిలో పరాజయం
పాలై రాజ్యాన్ని కోల్పోయాడు). రావణుడు యదు వంశీకులకు పట్టుకొమ్మైన నర్మదానదీ తీరాన
శివలింగధారిని పూజిస్తుండగా మరో యదువంశపాలకుడైన కార్త్యవీర అర్జునునికి (ఈతడు
తదనంతర కాలంలో పరశురాముని చేతిలో హతమయ్యాడు) పట్టుబడినట్లు చెప్పబడింది. రావణుడు
మహారాష్ట్ర ప్రాంతంలోని గోదావరీ నదీ సమీప ప్రాంతాలలో సీతాదేవిని అపహరించినట్లు
వర్ణించి ఉంది. ఈ ప్రాంతాలన్నీ యదువంశీకులకు పట్టున్న ప్రాంతాలగుటచే రావణునికి -
యదు వంశీకులకు ఉన్న సంబంధాలను కొట్టి పారేయలేం.
దాదాపుగా ఇవే
ప్రాంతాలలో(అరణ్యవాసంలో భాగంగా సీతారాములు కాలిడిన ప్రదేశం) రావణుని చెల్లెలు
శూర్ఫణఖ నివసించినట్లుగా రామాయణం పేర్కొంది. రావణుడు మహర్షి పులస్త్యుని వంశానికి
చెందిన బ్రాహ్మణునిగా ఎక్కువ శాతం నమ్ముతారు. నిజమేదైనా (రావణుడు బ్రాహ్మడే
గానీయండి లేదా యదువంశీకుడే కానీయండి) చరిత్రలో ఇన్ని సుధీర్ఘ వివరణలున్న వ్యక్తుల
ఆనవాళ్ళను పుక్కిట పురాణమనటం అవివేకమే అవుతుంది.
రావణుడు
సామవేదాన్ని వల్లించేవాడు. శివుని అనుగ్రహానికై కైలాసంలో అడుగిడినాడు. హిమాలయా
ప్రాంతానికి చెందిన కైలాసం మధురకు దగ్గరగా ఉన్న కారణం చేత కూడా రావణుడు
యదువంశీకుడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సంస్కృత భాషలో
ప్రావీణ్యాన్ని సంపాదించిన రావణుడు శివతాండవ స్తోత్రాన్ని స్వరీకరించాడు. శివతాండవ
స్తోత్రం రామాయణం జరిగిన చాలా ఏళ్ళ తర్వాత ఉద్భవించిందని భావించేవాళ్ళు చెప్పింది
నిజమని అనుకున్నా కూడా రావణునికి సంస్కృతంలో గల పాండిత్యాన్ని కొట్టిపారేయలేకుండా
ఎన్నో వర్ణనలు రామాయణ కావ్యంలో కనిపిస్తాయి. రావణుని మాతృభాష ద్రవిడ భాష కాదని,
జన్మ స్థలం శ్రీలంక కాదని,
రాజ్య విస్తీరణలో భాగంగా
కుబేరుని ఓడించి శ్రీలంకను కైవశం చేసుకున్నాడని ఈ చరిత్ర చెబుతుంది.
రామ రావణుల
చరిత్రకు సుర-అసుర వైరాలకు చాలా సారూప్యతలున్నాయి.
వేద, పురాణ, ఉపనిషత్తుల మొదలుకుని, మహాభారతం వరకు
దేవతల - రాక్షసుల నిరంతర శతృత్వం పై అనేక కధనాలున్నాయి. ఈ దేవ దానవుల చరిత్రకు గల
ఆధారాలను పరిశీలిద్దాం.
సురులుగా పిలవబడే
దేవతల గురువు బృహస్పతి కాగా , అసురులుగా లేదా
దైత్యులగా పిలవబడే రాక్షసుల(దానవుల) గురువు భృగు వంశానికి చెందిన శుక్రుడు. ఓ
విధంగా ఇరు వర్గాలూ సనాతన వేద ధర్మాలను ఆచరించినవారే. ముఖ్యంగా భృగు వంశీకులకు
సురులకు మూలం ఒక్కటే. అయినప్పటికినీ శుక్రుడు వివిధ కారణాల వల్ల అసుర పక్షం
చేరినాడు. మను సంహితం ప్రకారం సుర సంస్కృతి సరస్వతీ నదీ సమీపాల్లో
ఆవిర్భవించింది(ఇది ఇప్పటి ఉత్తర భారత దేశం).
కాగా దైత్యుల
(అసురుల) సంస్కృతి యొక్క ఆనవాళ్ళు భృగువంశీకులకు నిలయమైన దక్షిణాది ప్రాంతాలలో
కనిపిస్తుంది. ఈ ప్రదేశాలు అరేబియా తీర ప్రాంతాల్లోగల భృగు రాజ్యంగా
నిర్ధారింపబడ్డాయి. 'భృగుకక్ష్య'
గా పిలవబడే భృగు రాజ్యం
కాలక్రమేపీ 'బారుచ్చ్'
గా రూపాంతరం చెంది,
నేడు బరోడాగా
ఆధునీకరంపబడింది. భృగువంశీకులు పూజించే వరుణుడు/సముద్రుడు వీరికి ఆద్యులు. తొలి
నాళ్ళల్లోని మను వంశీకుడైన శౌర్యతమ మానవుడు గుజరాత్ చుట్టుప్రక్కల ప్రాంతాలను
ఏలినవాడు. ఇతడే కుశస్థలి నగరాన్ని (ద్వారకగా రూపాంతరం చెందినది) నిర్మించినవాడు.
ఈ శౌర్యతముని
గురువు భృగువంశీకుడైన చ్యవన భార్గవుడు. అయితే తదుపరి కాలంలో అసురులు శౌర్యతముని
నుంచి మను రాజ్యాన్ని చేజిక్కించుకున్నట్లుగా మను సంహితంలో చెప్పబడింది.
దేవ దానవుల మధ్యన
ఈ నిరంతర వైరం వల్ల వర్గాలు ఏర్పడ్డాయి. మను వంశస్థుడైన యయాతికి ఇద్దరు భార్యలు.
ఒకరు శుక్రుని(భృగు వంశం) కుమార్తెయగు దేవయాని కాగా మరొకరు దైత్యరాజైన(అసుర వంశం)
వృషపర్వుని కుమార్తె షర్మిష్ట. ఈ విధంగా మను వంశీకుడైన యయాతి దానవ కన్యనూ, ఆర్యకన్యనూ (భృగువంశం) పెండ్లాడి ఒక కొత్త
వర్గానికి శ్రీకారం చుట్టినాడు. యయాతి ఆఖరి కుమారుడైన 'పురు' డు(షర్మిష్టకు పుట్టినవాడు) అసుర వంశ లక్షణాలను పుణికి పుచ్చుకుని మధ్య
సరస్వతీ రాజ్యాలను స్థాపించాడు. దీని వల్ల దేవతల(ఆర్యుల)తో అసుర వైరం మరింత
ముదిరింది.
యయాతి పెద్ద కుమారుడైన
'యదు' డు(షర్మిష్టకు పుట్టినవాడు) దైత్యుల
పట్టుకొమ్మయైన అరేబియా ప్రాంతాలను పాలించాడు. ఇతని సైనిక తరహా పాలన ఇతనికి గల అసుర
లక్షణాలను తెలియజేస్తుంది.
ఇక యయాతి రెండవ
పుత్రుడు 'తూర్వేషుడు'
(దేవయాని సంతానం) ద్రవిడ
సంస్కృతికి ఆద్యునిగా ఈ మనుసంహిత చెబుతుంది. ఓ విధంగా చూస్తే
రామ రావణుల యుధ్ధం, తరతరాలుగా
సాగుతున్న ఆర్యుల-యదువంశీకుల మధ్యన వైర పరంపరలో భాగంగా భావించవచ్చు. ఇంతకు పూర్వమే
ఇటువంటి వర్గ వైషమ్యాలకు సంబంధించిన సంఘటనలు వేద పురాణాల్లో కనిపిస్తాయి.
పరశురాముడు
కార్త్యవీర అర్జునినిపై (యదు వంశీకుడు) సాధించిన విజయం,
కాశీని పాలించిన
దేవదాసుడు వితిహవ్యునిపై (యదువంశీకుడు) విజయం,
అయోధ్యను
పాలించిన సాగరుడు వైహితునిపై (యదు వంశీకుడు) విజయం ఈ కోవలోనివే.
ఈవిధంగా రాముడు
రావణునిపై సాధించిన విజయాన్ని రావణునికి గల యదు సంబంధాలతో కలిపి చూస్తే యదు వైర
పరంపరలో భాగంగా అనిపిస్తుంది.
యదువంశీకులు
బలపరాక్రమ వంతులు, వేద విద్యా
పారంగతులు కావటంచేత ఎన్నో ఏళ్ళు వీరి ఆధిపత్యం చెల్లింది. రావణుడు కూడా ఇట్టి
సైనిక పాలనకు పాల్పడ్డ యదువంశీకుడయ్యే ఆస్కారం ఉంది. యాదవుడైన మరో నియంత కంసుడు
తదుపరి కాలంలో మధురను పాలించాడు.
యదువంశంనందు
ఇటువంటి కర్కశులే కాక ఎందరో మహానుభావులు కూడా జన్మించారు. కృష్ణుడు, రావణుని తమ్ముడైన విభీషణుడు వంటి వారు ఈ
కోవలోనికి వస్తారు.
అదే విధంగా
ఆర్యుల్లో అందరూ మహనీయులనే అనుకోనఖ్ఖరలేదు. ధుర్యోధనుడు, కౌరవులు ఇటువంటి ఆర్యుల జాబితాలోనికి వస్తారు.
దీనిని బట్టి ద్రవిడులంటే
రాక్షసులని, ఆర్యులంటే
దేవతలని అపోహను తొలగించవచ్చు. ద్రవిడుల ప్రాబల్యంగల కిష్కింధ(నేటి కర్ణాటక)
హనుమంతునికి జన్మనిచ్చింది. రామరావణ యుధ్ధంలో హనుమంతుడు తనకు బలిచక్రవర్తి
వంశీకులతో గల పూర్వ బంధాల సహాయంతో ద్రవిడ సైన్యాన్ని రామునికి అండగా తెచ్చాడు.
1980 దశకం వరకూ కూడా
శ్రీలంకనందు ఆర్య సంస్కృతి క్రీస్తుపూర్వం 600సం,, తరువాతనే బయల్పడినదని భావించేవారు. అయితే 90లలో సఫలీకృతమైన హరప్పా అధ్యయనాలలో క్రీస్తు
పూర్వం 6000 ఏళ్ళనాటికే ఈ
వలసలు ఉండేవని నిర్ధారణ అయ్యింది.
శ్రీలంక
దేశస్థులు బౌధ్ధ మతానికి స్వీకరించటానికి గల కారణాలు కూడా రావణుడు ఉత్తరాదికి
చెందిన యదువంశీకుడయ్యే ఆధారాలను చూపిస్తుంది. యదువంశీకులు పాలించిన మధుర నేపాల్
సరిహద్దుల్లో ఉన్నందువల్లనే కాక ఆశ్చర్య కరంగా ప్రసిధ్ధ బౌధ్ధ సూత్రమైన లంకావతారం
శ్రీలంకను పవిత్ర స్థలంగా పేర్కొంది. ఈ బౌధ్ధసూత్రాలలోనే రావణుని యక్ష రాజుగా
కీర్తిస్తారు. (దీనికి సమాంతరంగా హిందుత్వం రావణునికి పూర్వం అదే లంకను పాలించిన
కుబేరుడని యక్షరాజుగా ప్రస్తుతిస్తుంది.)
ఈ ప్రకారం
దక్షిణాదివారు గర్వపడే విధంగా రావణుడు ద్రవిడుడు కాకపోవచ్చు. ప్రాదేశికంగా రావణుడు
శ్రీలంకలో స్థిరపడినప్పటికినీ అతని ప్రస్తావన, ఆనవాళ్ళు ఉత్తరాదిన ఎన్నో సంఘటనలలో
ఉదహరించబడింది.
ఇక రామభక్తుడు
హనుమంతునిలో ద్రవిడ సంస్కృతి ప్రతిఫలించినప్పటికినీ ఆతని వంశబీజాలు బలి
చక్రవర్తితోనూ, తమను తాము
ఆర్యులుగా ప్రకటించుకున్న వేదపారంగతులైన అగస్త్య, విశ్వామిత్రులలోనూ ఉన్నాయి.
స్థూలంగా చెప్పాలంటే
అందరూ ఊహించే విధంగా వీరు ఆర్యులు, వీరు ద్రవిడులు
అన్న వివరణ అందరికీ స్పష్టంగా చరిత్రలో ఎక్కడా లభించలేదు. అయితే ఈ విధమైన లోతైన
అధ్యయనం చేయక పైపైన గల కధను కట్టె -కొట్టె - తెచ్చె చందాన తెలుసుకుని రామాయణం అభూత
కల్పనంటూ కొట్టిపారేసేవారు ఇప్పటికీ కోకొల్లలు. మరో రూపంలో ఇది ఇప్పటి రాజకీయ
నాయకులకు కూడా ఒక ఆయుధమయ్యింది. (రామ సేతువు, బాబ్రీ మసీదు ల వివాదాల రూపేణా..)
ఈ ప్రకారం
ఉత్తరాది నుంది దక్షిణకు వచ్చినవారిలో రాముడు మొదటివాడేమీ కాదు. యదువంశీకులు,
దైత్యులు అంతకు ఎన్నో
ఏళ్ళపూర్వమే శ్రీలంకలో స్థిరపడ్డారు. రాముడు కేవలం తన వ్యక్తిగత కారణాలవల్లనే కాక
దక్షిణాదిని రావణుని కబంధహస్తాల నుండి విముక్తి చేసేందుకు అక్కడ సుస్థిరమైన,
సౌఖ్యమైన పాలనను
అందించేందుకు దండెత్తినట్లు ఈ విధమైన చారిత్రక ఆనవాళ్ళు లభిస్తాయి.
రాముడు తన
విజయానంతరం, ఉత్తరాది
ప్రాబల్యాన్ని దక్షిణాదిపై రుద్దకుండా విభీషణునికే పట్టం కట్టి వెనక్కి
వెళ్ళిపోయాడు. ఈ కారణం చేతనే రాముడు దైవ స్వరూపునిగా ప్రజలందరిచేత పూజింపబడ్డాడు.
ఈ విధమైన తార్కిక
ఆలోచన, లోతైన అధ్యయనం -
రామాయణం ఎందుకు నిజం కాకూడదు అన్న ప్రశ్నను, విజ్ఞతను బుధ్ధిమంతులలో తప్పక
మొలకెత్తిస్తుంది.