మహాభారత సూక్తులు


ఆ.వె. అల్పుఁడయ్యు మనుజుఁ - డతిపరాక్రమమునఁ , బేర్మిఁ దరతరంబ పెఱుగుచున్న
వాఁడు మ్రాని మొదలి - వల్మీక మా మ్రానిఁ , జెఱచునట్లు కడఁగి - చెఱచుఁ బగఱ. (II-2-౧౪౪)

తాత్పర్యము : దుర్యోధనుఁడు ధృతరాష్ట్రునితో పలికినది : ఒకడు స్వతహాగా అల్పప్రతిభావంతుడే అయినా మిక్కిలి చొఱవతో క్రమక్రమంగా ఎదిగాడంటే, అటువంటివాడు చెట్టుమొదట్లో ఉన్న పుట్ట, చివఱకా చెట్టునే నాశనం చేసినట్లుగా శత్రువుల్ని ప్రయత్నపూర్వకంగా నాశనం చేస్తాడు.

తే.గీ. అహితవృద్ధి యుపేక్షితం - బగుడు నల్ప , మగు మహావ్యాధియును బోలె - నది యసాధ్య
మయి యుపేక్షకు నిర్మూలి - తాత్ముఁ జేయుఁ , గానఁ బాండవశ్రీ యుపే - క్ష్యంబు గాదు. (II-2-౧౪౫)

తాత్పర్యము : శత్రువుల అభివృద్ధిని పట్టించుకోకుండా ఉంటే - ఒక చిన్న నలత పెద్ద జబ్బుగా మారినట్లుగా ఆ అభివృద్ధి కూడా అలా పట్టించుకోనివాణ్ణి నిర్మూలిస్తుంది. కనుక పాండవుల సంపదని చూసి మిన్నకుండడం సరికాదు.

కం. తన కార్యమొరు మతంబున, నొనరింపఁగ నేఱనగునె? - యొరుని మతంబున్
దన మతము నొకఁడు గా నో,పునె? చెచ్చెఱ నిశ్చయింపఁ - బోలునె దానిన్? (II-2-౧౪౯)

తాత్పర్యము : తన పనిని వేఱేవాడి అభిప్రాయం ప్రకారం చేయడం సాధ్యమేనా ? తన అభిప్రాయమూ, వేఱేవాడి అభిప్రాయమూ ఎప్పటికైనా ఒకటవుతాయా ? ఒకటవుతాయని ఖచ్చితంగా నిశ్చయించి చెప్పగలమా ?

తే.గీ. క్షత్త్రనీతిక్రమంబులు - గావు సూవె, నికృతియును జూదమును ; - ధర్మనిత్యు
లైన వారికీ రెండు వర్జింప - వలయు నెందుఁ , బాపవృత్తంబు జూదంబు - పార్థివులకు. (II-2-౧౬౬)

తాత్పర్యము : ధర్మరాజు దుర్యోధనునితో పలికినది : మోసం చేయడం, జూదమాడడం ఈ రెండూ క్షత్త్రియులకు విధించబడ్డ ధర్మాలు కావు సుమా ! ధర్మపరాయణులైన రాచవారు ఈ రెంటినీ వదిలిపెట్టాలి.

ఆ.వె. కుటిలమార్గులైన - కుత్సిత కితవుల, తోడఁ గడఁగి జూద మాడఁజనదు
దానఁ జేసి యర్థ - ధర్మవివర్జితు, లగుదురెట్టివారు - జగములోన. (II-2-౧౬౭)

తాత్పర్యము : వంకరదారిలో నడుచుకునే నీచవంచకులతో కోరి కోరి జూదమాడకూడదు. అలా చేస్తే ప్రపంచంలో ఎంతటివారైనా ధర్మదేవత చేత విసర్జించబడతారు.

కం. ద్యూతకళాకుశలుండగు, నాతఁడు లోకజ్ఞుఁడును మ హామతియును వి
ఖ్యాతుఁడునగు సత్ క్షత్త్రియ, నీతివిదుఁడు ; తగునె దాని - నిన్ నిందింపన్. (II-2-౧౬౯)

తాత్పర్యము : శకుని ధర్మరాజుతో పలికినది : జూదమాడడం తెలిసినవాడు లోకం తెలిసినవాడవుతాడు. మేధావి అవుతాడు. కీర్తిని సంపాదిస్తాడు. ఆతనికి రాజనీతి సులభగ్రాహ్యమవుతుంది. అటువంటి జూదాన్ని వ్యసనమంటూ నిందించడం సమంజసం కాదు.

కం. బలహీనులైనవారలు, బలవంతుల నొడుచునపుడు - బహుమాయల న
చ్చలమునఁ జేయుట యెందును, గలదియ ; జయంబ కాదె - కర్తవ్యమిలన్. (II-2-౧౭౦)

తాత్పర్యము : బలవంతులు బలహీనుల్ని జయించడానికి మాయోపాయాలు పన్న నక్కఱలేదు. వారి గెలుపు నిశ్చితపూర్వమే. కానీ బలహీనులు బలవంతుల్ని జయించాలనుకుంటే మాత్రం పలు మాయోపాయాలు పన్నడం సర్వసాధారణం. ఏం చేసినా మొత్తమ్మీద గెలవడమే కదా ప్రధానం.

తే.గీ. ప్రియము వలికెడువారిన పెద్ద మెత్తు, రప్రియంబును బథ్యంబు - నైన పలుకు
వినఁగ నొల్లరు, కావున వేడ్క దాని, బలుకరెవ్వఱు నుత్తమ - ప్రతిభులయ్యు. (II-2-౧౯౧)

తాత్పర్యము : విదురుఁడు దుర్యోధనునితో పలికినది : కీడు చేసేవైనప్పటికీ మనసుకింపుగా ధ్వనించే మాటలు పలికేవారినే జనం ప్రశంసిస్తారు. మేలు చేసేవైనప్పటికీ, కటువుగా ధ్వనించే మాటలు వినేందుకు ఎవఱూ ఇష్టపడరు. కాబట్టి గొప్ప జ్ఞానం కలిగి ఉన్నా సరే, కోరి కోరి ఉత్సాహంతో అలాంటి మాటలెవఱూ పలకరు.

                                                                                                  --ఆదికవి నన్నపాచార్యుఁడు