షట్చక్రవర్తులు
సగర: కార్త వీర్యశ్చ,షడేతే............ చక్రవర్తిన:II
అని మనకి షట్చక్రవర్తులుగా
పేరుపొంది,ఎనలేని కీర్తిని మూట
కట్టుకున్న,చక్రవర్తులు
ఆరుగురున్నారు.వారు
1.హరిశ్చంద్ర చక్రవర్తి.
1.హరిశ్చంద్ర చక్రవర్తి.
2.నల చక్రవర్తి.
3.పురుకుత్స చక్రవర్తి.
4.పురూరవ చక్రవర్తి.
5.సగర చక్రవర్తి.
6.కార్త వీర్య చక్రవర్తి.
వీరిని షట్చక్రవర్తులుగా
పిలుస్తారు.వీరు ఇంతటి ఖ్యాతిని సంపాదించిన విషయాన్ని, పూస గ్రుచ్చిన రీతిని ఒక కవి వర్ణించాడు.జిగి,మంచి కవిత్వపు బిగి, పద రుచి, కలిగిన ఈ పద్య రాజములకు, కర్త ఎవరో! తెలిసింది కాదట! ఇవి నేటికీ, కేవలం చాటు పద్యాలుగా మాత్రమే మిగిలిపోయాయి. వారిని
గూర్చితెలిపే ఆ పద్యాలివి వాటి అంద చందాలను పరిశీలించి, ఆనందించండి.
హరిశ్చంద్ర చక్రవర్తి
హరిహర బ్రహ్మాదు,లద్భుతంబందగ,
నెగడె సత్యవ్రత
నిష్ఠ కలిమి,
నాలుగు యుగముల,నోలిని పదునాల్గు
వరుసల వర్తిల్లి,వసుధ యేలె,
సప్త పాథోథి సంగుప్త,సప్తద్వీప
సంధుల,జయ శిలాస్తంభ వితతి,
నిలిపె,నాఖండలాదులు పంపుసేయంగ,
రాజసూయ,మహాధ్వరంబొనర్చె,
నతల,వితల,రసాతలాద్యఖిల,దనుజ
లోక,గంధర్వలోకాహిలోక,నాక
లోక,గోలోక,కమలజలోక,భరిత
సాంద్ర!యశు జెప్పదగు,హరిశ్చంద్ర విభుని.
నల చక్రవర్తి
చంద్ర కందర్పాది,సౌందర్యవంతులు,
తనుజూచి,సిగ్గున దనర దనర
త్రైలోక్య సుందరి,దమయంతి తనయందు,
బద్ధానురాగగా,బరగ బరగె
అర్ధికి,ప్రాణంబు,నర్ధంబునిచ్చుట,
నెట్టన బిరుదుగా,నెగడ నెగడె!
అమరులు,దన మనో విమలత కిచ్చమై,
మెచ్చి,నెచ్చెలులుగా మెరయ,మెరసె,
మహిత,కర్కోటకాహీంద్ర,మైత్రిపరుడు,
పుణ్య,ఋతుపర్ణ,వర్ణితాగణ్య గణుడు,
వితత కలిదోష సంహార,విమల యశుడు,
నలుని కీర్తింప,నఘములు తొలగు టరుదె!
పురుకుత్స చక్రవర్తి
చంద్ర నందనునకు,సాధ్వి ఇలాకన్య
యందుద్భవించె,బుణ్యములతోడ,
శ్రీమత్సురాంగనా,సీమంతమణియైన,
యూర్వసి పత్నిగా,నుర్వియేలె
వితత భాండాగార,విపుల గోస్ఠాగార
తతి,విప్ర హస్త సంగతిగ నిచ్చె
ఆయుర్దృఢాయుస్సుఖాయుర్ముఖుల,దేవ
పతి చూచి,వెరగంద సుతుల బడసె
సుజన,ముచికుంద భూపాల సోదరత్వ
మేరు మందరధృతి,యశోమేదురత్వ
సకలగుణరత్న,భూషణ సాగరత్వ
ధను,నఘచ్యుతు,పురుకుత్సు చను నుతింప.
పురూరవ చక్రవర్తి
మహియెల్ల యెడనేలు,మాంధాతృనకు బుట్టి,
యాది గర్భేస్వరుండనగ
బరగె!
బ్రాహ్మణ భక్తి సంపన్న,సౌజన్యత,
విప్ర వశుండన,వినుతికెక్కె
ఇరువేల వర్షముల్,గురుతుగా నొకదినం
బాదిగాకల,యధ్వరాళి జేసె
త్రిభువన ప్రీతిగా దివ్య కోదండుడై
బహుకోటి దనుజుల బలమడంచె,
ప్రకట శాత్రవ భంజన భైరవుండు,
పౌత్రతాయత్తకౌరవ పౌరవుండు,
హర్షితానేక జన వినుతారవుండు,
గౌరవోన్నతినొప్పె!పురూరవుండు.
సగర చక్రవర్తి
పటు శక్తి శౌర్యు లర్వది వేవు రాత్మజుల్
పనిసేయ,నిమ్మహీభరము దాల్చె
ఒక్కొక్క సుతుపేర,నొక్కొక్క పట్టణం
బిల యెల్ల,గల్పించె,నలఘు మహిమ!
అన్నిపట్టణముల,నఖిల మహారత్న
చయములు గల్గ,రాజ్యంబు చేసె
పుత్త్రమోహ భ్రాంతి,పొందక మర్యాద
తొలగిన సుతుల,నిల్ తొలగ దోలె
చెప్పనొప్పదె!నిజ పౌత్ర చిత్ర ఘోర
తమ,తపో లబ్ధ,గంగాంబు తరళ సలిల,
వీచికానూన,సోపాన వితతి యాన.
నవని వాసత వైకుంఠ నగరు సగరు.
కార్త వీర్య చక్రవర్తి
హేహయ వంశ,ధాత్రీశాబ్ధి చంద్రుడై
జనియించి,విశ్వ భూచక్ర మేలె
అచ్యుతమూర్తి,దత్తాత్రేయ యోగీంద్రు
చేత,జగజ్జైత్ర సిద్ధి వడసె
ఏతప్పు నెన్నడు,నెవ్వరు నెచ్చోట
దలప రాకుండగ,నిలిపె నాజ్ఞ
ఏడు దీవులయందు,నెన్నూరు హయమేధ
యాగంబు లొనరించె,నలఘు మహిమ!
అతులతర,దీర్ఘ సత్త్వసహస్రబాహు,
డహి గణాధిప ఫణ గణాయత్త భూరి
భూ భరముదాల్చె,నవలీల బొగడ దగదె!
కార్త వీర్యార్జు నాహ్వయక్ష్మాతలేంద్రు?
షట్చక్రవర్తులు
ఒగి చతుర్దశ,మహా యుగములు భువి దాల్చె
సత్య వ్రతము హరిశ్చంద్ర విభుడు!
జంభారి వరుణాది,సంభావితుల లోన
దమయంతి వరియించె దనర నలుడు!
ఆది గర్భేశ్వరుండై, విప్రదాసుడై,
చరియించె బురుకుత్స విభుండు!
బ్రాహ్మణ హస్తంబు,భండారమదియె!కొ
ఠారంబు జేసె,బురూరవుండు!
సాగరము! పేర్మి నిర్మించె! సగర నృపతి!
కార్త వీర్యుండు!మహి జైత్రవర్తనుండు!
వీరలార్గురు,దలపోయ!విష్ణునిభులు!
చక్రవర్తులు!నిత్య నిర్వక్ర యశులు!