ద:ఖం తొలిగే త్రోవ


పరమవస్తువేదో తెలుసుకోవడానికి మనలో ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. జ్ఞానమనగా ఏమి? పరమవస్తువు తప్పించి వేరే ఏదీ ప్రపంచములో లేదు అన్నవిషయమే. ఆ ఒక్క పరతత్త్వమే అనేకమై విలసిల్లుతున్నది. ఈ అనేకమే సత్యమని భ్రమించేంతవరకు, దుఃఖం మనదాపులోనే ఉంటుంది. దుఃఖములూ మనశ్చాంచల్యమూ తొలగాలంటే ఒకేదారి. ఆ పరతత్త్వ చింతనే, తదనుసంధానమే. ఆ పరతత్త్వంలో లగ్నమైన మనస్సు చంచలరహితమై నిత్యసుఖానుభూతినందగలదు. జ్ఞానమంటే ఇదే.
సుఖదుఃఖములే సంసార. అవి బాహ్యానికి చెందినవి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటికి నిలుకడలేదు. గొప్ప ధనికుడు పెద్ద పదవిలో వున్నవాడు సుఖి అని మనం అనుకుంటాం. కానీ వానిని మనం పరామర్శించినామంటే, అతని కష్టములు నూర్లకొలది ఏకరువు పెడతాడు. అప్పుడు మనమున్న స్థితే మేలు అని మనకనిపిస్తుంది. ధనమున్న వాడి కాలమంతా ఈ ధనాన్ని ఏవిధంగా రక్షించడమనే విచారంతోనే నిండివుంటుంది. వాడికి మనశ్శాంతి ఎప్పుడూ కరవే.
దుఃఖం మనతో పుట్టినది. ఇది పూర్వ కర్మకృతం. దీనినుంచి తప్పించుకొనడం అశక్యం. ఐత్యే కర్మానుసారం కలిగే కష్టాలను క్షాంతితో ఓర్చుకొని శాంతంగా ఉండడానికొక మార్గమున్నది. అదే జ్ఞానమార్గము. చిత్తభ్రమ కలిగిన వానికి దుఃఖం స్థిరంగా ఉండదు. వానికి ఆనందమూ లేదు. సషుప్తిలో దుఃఖమూ లేదు. సుషుప్తిలో సుఖముగా ఉన్నామన్న ఎరుక కూడాలేదు. జ్ఞాని ఒక్కడే సతత జాగ్రదావస్థలో శాశ్వత సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అతనికి దేహక్లేశమున్నప్పటికీ, మనః క్లేశముండదు. బాహిరవిషయాటోపం అతన్ని ఏవిధంగానూ బాధించదు.

నీటిలో కడవ మునిగివున్నంతసేపు, మనకు దాని భారం తెలియది. కొంత పైకి లాగగానే కడవ బరువౌతుంది. అదే విధంగా మనకు కలిగే ప్రాపంచిక కష్టముల భారం, జ్ఞానమనే జలములో ముంచితే, దుఃఖం దూరం అవుతుంది. అన్ని క్లేశములకూ మందు జ్ఞానయోగమే.