కాశీ/ వారాణసి

కాశీ లేదా వారాణసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ శివుడు కాశీ విశ్వేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారాణసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం కలదు. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది.

కాశ్యాన్తు మరణాన్ ముక్తి: – “కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది” – అని హిందువులు విశ్వసిస్తారు. 
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు. గంగానది, హిందూమతము, హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. 

హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాస్, మున్షీ ప్రేమ్‌చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారాణసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది ఆవలివైపున రామనగరం ఉంది. వారాణసి సమీపంలో సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది.

విశ్వేశ్వర మందిరం, అన్నపూర్ణ మందిరం, విశాలాక్షి మందిరం, వారాహీమాత మందిరం, తులసీ మానస మందిరం, సంకట మోచన మందిరం, కాల భైరవ నందిరం, దుర్గా మాత మందిరం, భారతమాత మందిరం ఇలా కాశీలో ఎన్నో మందిరాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారాణసిని మందిరాల నగరం”, “ధేశపు ఆధ్యాత్మిక రాజధాని”, “దీపాల నగరం”, “విద్యా నగరం”, “సంస్కృతి రాజధానివంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.

అమెరికన్ రచయిత మార్క్ ట్వేన్ ఇలా వ్రాశాడు – “బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయంకంటే పురాతనమైనది. గాధలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి.

గంగానదితో రెండు చిన్న నదులు వరుణ”, “ఆస్సిఅనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున వారణాసిఅనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం వరుణనదికే పూర్వకాలం వారాణసిఅనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.

వారాణసిఅనే పేరును పాళీ భాషలో బారనాసిఅని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది.వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో అవిముక్తక”, “ఆనందకానన”, “మహాస్మశాన”, “సురధాన”, “బ్రహ్మవర్ధ”, “సుదర్శన”, “రమ్య”, “కాశిఅనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

చరిత్ర
1890 కాలపు బెనారస్ చిత్రం.
1890 కాలపు బెనారస్ చిత్రం.షుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాధల సారాంశం.[3]. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం,మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంధాలలో కాశీనగరం ప్రసక్తి ఉన్నది.

వారాణసి నగరం షుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వాని వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చువాంగ్ (Xuanzang)ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.

1922లో వారణాసి (బెనారస్).
1922లో వారణాసి (బెనారస్).
18 శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో రామ్‌నగర్రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మఅత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివశిస్తున్నాడు.

భౌగోళికం
వారాణసి నగరం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు భాగంలో గంగా మైదానంలో, గంగానది ఒడ్డున ఉంది. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంది. ఇది వారాణసి జిల్లాకు కేంద్రం కూడాను. వారాణసి నగం, దాని పరిసర ప్రాంతాలు (“Varanasi Urban Agglomeration”) కలిపి మొత్తం 112.26 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. ఈ నగరం ప్రాంతం 82° 56’తూ. – 83° 03’తూ. రేఖాంశాల మధ్య మరియు 25° 14’ఉ. – 25° 23.5’ఉ. అక్షాంశాల మధ్య ఉంది. గంగానది వరదలతో (low level floods) ఈ ప్రాంతం నేల సారవంతంగా ఉంటుంది.

వారాణసి నగరం మాత్రం గంగ, వరుణ నదుల మధ్య ఉంది. ఈ నగరం సముద్ర మట్టం నుండి 80.71 మీటర్ల ఎత్తులో ఉంది. పెద్దగా ఉపనదులు, పిల్ల కాలువలు లేనందున ఇక్కడి భూమి అధికంగా పొడిగా ఉంటుంది.
వారాణసి నగరం రెండు సంగమ స్థానాల మధ్య ఉన్నట్లుగా చెప్పబడుతుంది. (1) గంగ, వరుణ నదుల సంగమం (2) గంగ, అస్సి నదుల సంగమం. అస్సి నది చాలా చిన్నది (కాలువ వంటిది) ఈ రెండు సంగమాల మధ్య దూరం షుమారు 2.5 కిలోమీటర్లు. ఈ రెండు సంగమ స్థానాల మధ్య (5 కిలోమీటర్ల) యాత్ర పంచ క్రోశి యాత్రపవిత్రమైనదిగా భావిస్తారు. యాత్రానంతరం సాక్షి వినాయకుని మందిరాన్ని దర్శిస్తారు.

వారాణసి వాతావరణం తేమగా ఉన్న సమోష్ణ వాతావరణం (humid subtropical climate). వేసవి, శీతాకాలం ఉష్ణోగ్రతల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య వేసవి కాలంలో ఋతుపవనాల వల్ల అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. హిమాలయ ప్రాంతంనుండి వచ్చే చలి తెరగలు (Cold waves) కారణంగా డిసెంబరు ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో నగరం ఉష్ణోగ్రతలు 32 – 46 °C మధ్య, చలికాలంలో 5° – 15 °C మధ్య ఉంటాయి.[13] సగటు వర్షపాతం 1110 మిల్లీమీటర్లు చలికాలంలో దట్టమైన పొగ మంచు, వేసవి కాలంలో వడ గాడ్పులు ఉంటాయి.

నగరంలో వాతావరణ (గాలి) కాలుష్యం ఇప్పటికి అంత తీవ్రమైన సమస్య కాదు. కాని నీటి కాలుష్యం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. ఇందువలనా, నది పైభాగంలో కడుతున్న ఆనకట్టల వలనా గంగానదిలో నీటి మట్టం తగ్గుతున్నది. నది మధ్యలో మట్టి మేటలు బయటపడుతున్నాయి.
సంస్కృతి

సంస్కృతి
వారాణసి సమకాలీన జనజీవనం తక్కిన నగరాల వలెనే ఉంటుంది. అయితే వారాణసికి హిందూమతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడి గంగానది, స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు సంస్కృతీ చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావించబడుతాయి. ఇంతే కాకుండా పట్టు చీరల నేత, , హిందూ-ముస్లిమ్ సహ జీవనం (మరియు మత కలహాలు కూడా), హిందూస్తానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు. గంగానది తీరాన, పాత నగరంలో ఇండ్లు, ఆలయాలు, దుకాణాలు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాలలో నివశిస్తున్నారు.

గంగానది
గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి. గంగానదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మత పరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.

స్నాన ఘట్టాలు
వారాణసిలో షుమారు 100 ఘాట్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. కొన్ని ఘాట్‌లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు శివాలా ఘాట్మరియు కాళీ ఘాట్లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్‌లు స్నానానికి మరియు దహనకాండలకు వాడుతారు. కొన్న ఘాట్‌లు పురాణ గాధలతో ముడివడి ఉన్నాయి.

దశాశ్వమేధ ఘాట్
కాశీ విశ్వనాధ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ యాత్రికులతోను, పూజారులతోను, అమ్మకందారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వెనుక ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫొటోలు తీసికొనేవారికి చాలా ప్రియమైన స్థలం. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాధ. ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు.

మణి కర్ణికా ఘాట్
మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాధ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది. మరొక కధ ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దఅచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కధనాల ప్రకారం ఈ మణికర్ణికా ఘాట్ యజమానే హరిశ్చంద్రుడిని కొని, హరిశ్చంద్ర ఘాట్‌లో కాటిపనికి నియమించాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్రఘాట్‌లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి.

సిండియా ఘాట్
150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఘాట్ బరువుకు ఇక్కడి శివాలయం కొంతవరకు నీట మునిగి ఉంటుంది. ఇది అగ్ని దేవుని జన్మ స్థలమని పురాణ కధనం. మగ సంతానం కావాలని కోరేవారు ఇక్కడ వీరేశ్వరుని అర్చిస్తారు. సిండియా ఘాట్‌కు ఉత్తరాన మణికర్ణికా ఘాట్ ఉంది. వెనుక ప్రక్క సిద్ధక్షేత్రంలో అనేక ముఖ్యమైన అలయాలున్నాయి.

మన మందిర్ ఘాట్
1770లో జైపూర్ రాజు మహారాజా జైసింగ్ ఈ మన మందిర్ ఘాట్‌ను, దాని వద్ద యాత్రా మందిరాన్ని నిర్మింపజేశాడు. యాత్రా మందిరం రాజస్థాన్-ఢిల్లీ శైలిలో చక్కని అలంకృత గవాక్షాలతో ఉంటుంది. ఇక్కడ భక్తులు సోమేశ్వరుని అర్చిస్తారు. అంబర్ రాజు మాన్‌సింగ్ మానస-సరోవర్ ఘాట్‌ను, దర్భంగా మహారాజు దర్భంగా ఘాట్‌ను నిర్మింపజేశారు.

లలితా ఘాట్
ఇది నేపాల్ రాజుచే నిర్మింపజేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విష్ణ్వాలయంలో పాశుపతేశ్వరస్వామి విగ్రహం ఉంది.

అస్సీ ఘాట్
ఇది చాలా సుందరమైనది. అన్ని ఘాట్‌లకు చివర ఉంది. ఇది ఫొటోగ్రాఫర్లు, చిత్రకారులు, వాద్య బృందకారులతో కోలాహలంగా ఉంటుంది. ఇంకా ... జైన భక్తులు బచరాజ్ ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ నది వడ్డున మూడు జైనాలయాలున్నాయి. తులసీ ఘాట్ వద్ద గోస్వామి తులసీ దాస్ రామచరిత మానస్ కావ్యాన్ని రచించాడు.

పవిత్ర క్షేత్రం 
వారాణసి హిందువులందరికి పరమ పావన క్షేత్రం. ప్రతి యేటా లక్షమంది పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగాస్నానం, దైవ దర్శనం చేసుకొంటారు. ఇక్కడ విశ్వేశ్వరాలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువైయున్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు.[15] గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.

బౌద్ధులకు కూడా వారాణసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ ఈ ఐదు ముఖ్యమైన యాత్రాస్థలాలలని బుద్ధుడు బోధించాడు. వారాణసి సమీపంలోనే సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధననుపదేశించాడు. అక్కడి ధమేక స్తూపం అశోకునికంటె ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థఅనంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాడట.

జైనుల 23వ తీర్ధంకరుడైన పార్శ్వనాధుని జన్మ స్థలం అయినందున వారాణసి జైనులకు కూడా పవిత్ర స్థలమే.

వారాణసిలో ఇస్లామిక్ సంస్కృతి కూడా గాఢంగా పెనవేసుకొని ఉంది. హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలు, లేదా ఘర్షణ వాతావరణం అప్పుడప్పుడూ సంభవింఛాయి.

ఆలయాలు
వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిద కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి.

విశ్వనాధ మందిరం
కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని బంగారు మందిరంఅని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు విశ్వేశ్వరుడు” , “విశ్వనాధుడుపేర్లతో పూజలందుకొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక నౌబత్ ఖానాకట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు.

1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. ఈ మందిరం అధికారిక వెబ్‌సైటు కాశీ విశ్వనాధ 2007 జూలై 23న ప్రాంభమైంది. ఈ వెబ్‌సైటులో మందిరంలోని సదుపాయాలు, పూజా వివరాలు వంటి సమాచారం లభిస్తుంది.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విభేదాలలో ఒకటి
దుర్గా మందిరం కోతుల గుడిగా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత నగరశైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును దుర్గా కుండ్అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు.

సంకట మోచన్ హనుమాన్ మందిరం
కష్టాలనుండి భక్తులను కడతేర్చే దేవునిగా ఇక్కడ కొలువైయున్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. 2006 మార్చి 7 న ఈ మందిరంలో ఉగ్రవాదులు బాంబులు పేల్చారు.

తులసీ మానస మందిరం
ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది.

బిర్లా మందిరం
కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాధ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది.

ముఖ్య శివ లింగాలు
వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు
విశ్వేశ్వరుడు గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
 మంగళేశ్వరుడు శంక్తా ఘాట్
 ఆత్మ విశ్వేశ్వరుడు శంక్తా ఘాట్
 కుక్కుటేశ్వరుడు దుర్గా కుండ్
 త్రి పరమేశ్వరుడు దుర్గా కుండ్
 కాల మాధవుడు కథ్ కీ హవేలీ
 ప్రయాగేశ్వరుడు దశాశ్వమేధ ఘాట్
 అంగారకేశ్వరుడు గణేష్ ఘాట్
 ఆంగనేశ్వరుడు గణేష్ ఘాట్
 ఉపస్థానేశ్వరుడు గణేష్ ఘాట్
 పరమేశ్వరుడు శంక్తా ఘాట్
 హరిశ్చంద్రేశ్వరుడు శంక్తా జీ
 వశిష్టేశ్వరుడు శంక్తా జీ
 కేదారేశ్వరుడు కేదార్ ఘాట్
 నీల కంఠేశ్వరుడు నీల కంఠా
 ఓంకారేశ్వరుడు చిట్టన్ పురా
 కాశేశ్వరుడు త్రిలోచన్
 శ్రీ మహా మృత్యుంజయుడు మైదాగిన్
 శుక్రేశ్వరుడు కాళికా గలీ


కళ, సాహిత్యం 
అనాదిగా వారాణసి నగరం సాహిత్యానికి, పాండిత్యానికి, కళలకు నిలయంగా ఉంది. కబీర్ , తులసీదాస్ , రవిదాస్ , కుల్లూకభట్టు (15వ శతాబ్దంలో మను వ్యాఖ్య రచయిత)[20] వంటి పురాతన రచయితలు, భారతేందు హరిశ్చంద్ర ప్రసాద్, జయశంకర్ ప్రసాద్, ఆచార్య రామచంద్ర శుక్లా, మున్షీ ప్రేమ్ చంద్, జగన్నాధ ప్రసాద్ రత్నాకర్, దేవకీ నందన్ ఖత్రీ, తేఘ్ ఆలీ, క్షేత్రేశ చంద్ర ఛటోపాధ్యాయ, బలదేవ్ ఉపాధ్యాయ, వాగీశ్ శాస్త్రి, విద్యా నివాస్ మిత్రా, కాశీనాథ్ సింగ్, నమ్వార్ సింగ్, రుద్ర కాశికేయ, నిర్గుణ వంటి ఆధునిక రచయితలు వారాణసికి చెందినవారు. శుశ్రుత సంహితం వ్రాసిన ఆయుర్వేదశస్త్రచికిత్సానిపుణుడు శుశ్రుతుడు వారాణసికి చెందినవాడే.

రాజ కొషోర్ దాస్ (కళా శోధకుడు), ఆనంద కృష్ణ (చరిత్ర కారుడు) మరియు ఓంకార్ ఠాకుర్ పండిట్ రవిశంకర్ , బిస్మిల్లా ఖాన్ , గిరిజాదేవి, సిద్ధేశ్వరీ దేవి, డా. లాల్ మణి మిశ్రా, డా. గోపాల శంకర్ మిశ్రా, డా. ఎన్.రాజన్, డా. రాజభాను సింగ్, పండిట్ సమతా ప్రసాద్, కంథే మహరాజ్, పండిట్ ఎమ్.కల్వంత్, సితారా దేవి, గోపీకృష్ణ, పండిట్ కిషన్ మహరాజ్, రాజన్-సాజన్ మిశ్రా (అన్నదమ్ములు), మహాదేవ మిశ్రా వంటి అనేక సంగీతకారులు వారాణసినుండి ప్రఖ్యాతులయ్యారు. వారాణసిలో ఉత్తర హిందూస్తానంలో జరుపుకొనే పండుగలన్నింటినీ ఘనంగా జరుపుకొంటారు.

ఆర్ధికం
వారాణసిలో ఉన్న ఒక పెద్ద పరిశ్రమ రైల్వే డీసెల్ ఇంజన్ల తయారీ కర్మాగారం (Diesel Locomotive Works – DLW). కాన్పూర్‌కు చెందిన నిహాల్ చంద్ కిషోరీ లాల్ కుటుంబం 1857లో స్థాపించిన ఆక్సిజన్ కర్మాగారం ఇక్కడి మొదటి పెద్ద పరిశ్రమ కావచ్చును. కాని అధికంగా వారాణసిలో చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టు వస్త్రాల నేత ఇక్కడ పెద్ద కుటీర పరిశ్రమ. ఇంకా తివాచీల నేత, చేతి కళల వస్తువుల తయారీ ఉన్నాయి. బనారసీ పాన్, బనారసీ కోవా ప్రసిద్ధాలు. లార్డ్ మెకాలే వారాణసి ఎంతో సంపన్నమైన నగరమని, ఇక్కడ తయారయ్యే నాణ్యమైన సన్నని పట్టు వస్త్రాలు ప్రపంచంలో వివిధ సంపన్న గృహాలను అలంకరిస్తున్నాయని వ్రాశాడు.

మొదటినుండి యాత్రా స్థలం అవ్వడం వలన, వారాణసి దేశం అన్ని ప్రాంతాలనుండి జనులను ఆకర్షించేది. కనుక ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.

జన విస్తరణ
2001లో పరిసర ప్రాంతాలతో కలిపి వారాణసి (Varanasi urban agglomeration) జనాభా 1,371,749. ఆడు, మగ నిష్పత్తి 879 కి 1000 [23] వారాణసి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనాభా 1,100,748[24] మరియు ఆడు, మగ నిష్పత్తి 883కి 1000. అక్షరాస్యత శాతం మొత్తం అర్బన్ ప్రాంతంలో 61.5% మరియు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 61%.. మునిసిపల్ ఏరియాలో షుమారు 138,000 మంది మురికివాడ(slums)లలో నివశిస్తున్నారు.[25]. నగరంలో నేరాలు రేటు 2004 సంవత్సరంలో లో 128.5 (ప్రతి 100,000కు). ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య 73.2 మరియు దేశం మొత్తానికి 168.8.

రవాణా
తరతరాలుగా వారాణసి ప్రధాన ప్రయాణ మార్గంలోని నగరంగా ఉంది. చారిత్రికంగా ఇది తక్షశిల, ఘాజీపూర్, పాటలీపుత్రం (పాట్నా), వైశాలి, అయోధ్య, గోరఖ్‌పూర్, ఆగ్రా వంటి నగరాలకు కూడలిగా ఉంది. మౌర్యుల కాలంళో తక్షశిల నుండి పాటలీపుత్రనగరానికి వెళ్ళే దారిలో వారాణసి ఉంది. దీనిని 16వ శతాబ్దంలో షేర్ షా సూరి తిరిగి వేయించాడు.

ప్రస్తుతం వారాణసి నగరం దేశంలో అన్ని ప్రధాన నగరాలనుండి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కలుపబడింది. ఇది జాతీయ రహదారిపై ఉన్న పట్టణం. బాబత్‌పూర్ విమానాశ్రయంనగరం నడిబొడ్డునుండి 25 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొలకత్తా, నేపాల్ లకు విమాన స్వీసులు ఉన్నాయి. వారాణసి రైల్వేస్టేషను ఢిల్లీ కలకత్తా ప్రధాన రైలు మార్గంలో ఉంది. నగరం లోపల సిటీ బస్సులున్నాయి. కాని అత్యధికంగా ప్రైవేటు వాహనాలు, ఆటోరిక్షాలు, సైకిల్ రిక్షాలు నగరం లోపలి ప్రయాణాలకు వాడుతుంటారు. గంగా నదిని దాటడానికి చిన్న పడవలు, స్టీమర్లు ఉపయోగిస్తారు. వారాణసి ప్రక్కనే గంగానదిపై వంతెన ఉంది. అటువైపు మొఘల్ సరాయి రైల్వే జంక్షన్ పట్టణం ఉంది. నగరం లోపల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మార్గాలు ఇరుకైనవి.

పాలన, సేవా వ్యవస్థ
తక్కిన నగరాలలాగానే వారాణసిలో పాలనా బాధ్యతలు మునిపల్ సంస్థ (వారాణసి నగర్ నిగమ్) అధ్వర్యంలో నడుస్తాయి. ప్రణాళిక, ప్రగతి విషయాలు అధికంగా వారాణసి డెవలప్‌మెంట్ అథారిటీచూస్తుంది. నీటి సరఫరా, మురుగు నీటి తొలగింపు వంటి పనులు జల నిగమ్బాధ్యత. విద్యుత్ సరఫరా ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్బాధ్యత. నగరంలో రోజుకు 350 మిలియన్ లీటర్ల మురుగునీరుమరియు 425 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఈ చెత్తను లాండ్ ఫిల్సైటులలో పారవేస్తారు.చాలా మురుగునీరు గంగానదిలోకి విడిచిపెడుతున్నారు. దీనివల్ల, గంగానది వడ్డున ఉన్న అనేక నగరాల లాగానే, తీవ్రమైన నీటి కాలుష్యం జరుగుతున్నది. గంగా యాక్షన్ ప్లాన్పరిధిలో ఉన్న ఐదు నగరాలలో వారాణసి ఒకటి.

నగరంలో ఎస్.పి. అత్యధిక హోదా కలిగిన పోలీసు అధికారి.. వారాణసి నగరం ఒక లోక్ సభ నియోజక వర్గం. 2004లో ఇక్కడినుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందాడు.



విద్య 
బెనారస్ హిందూ విశ్వ విద్యాలయము వారణాశిలో ప్రముఖ విద్యాలయము వారాణసిలో మూడు సార్వత్రిక విశ్వవిద్యాలయాలున్నాయి. వీటిలో కాశీ హిందూ విశ్వవిద్యాలయం లేదా బెనారస్ హిందూ యూనివర్సిటీ అన్నింటికన్నా పెద్దది. 1916లో పండిట్ మదనమోహన మాలవ్యాచే స్థాపింపబడిన ఈ విశ్వవిద్యాలయంలో 128 ప్రత్యేక విభాగాలున్నాయి. ఇది ముందుగా అన్నీబిసెంట్చే ప్రారంభింపబడిన హిందూ విద్యార్ధుల పాఠశాలగా ఉండేది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం 1350 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. తక్కిన రెండు విశ్వ విద్యాలయాలు మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం. 1791లో లార్డ్ కారన్ వాలిస్ చే ప్రారంభింపబడిన సంస్కృత కాలేజీ క్రమంగా సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంగా రూపొందింది.

సారనాథ్‌లో ఉన్న కేంద్రీయ ఉన్నత టిబెటన్ అధ్యయన సంస్థ” (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హయ్యర్ టిబెటన్ స్టడీస్)కు కూడా విశ్వవిద్యాలయ హోదా ఉన్నది.  క్రీడా రంగంలోను, విజ్ఞాన రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణనిచ్చే ఉదయ్ ప్రతాప్ కళాశాలకూడా విశ్వవిద్యాలయ హోదా కలిగి ఉంది. ఇంతే కాకుండా అనేక ప్రభుత్వ, ప్రైవేటు, సాంప్రదాయిక విద్యా కేంద్రాలున్నాయి. సనాతన కాలంనుండి సంస్కృతం, వేదాంతం, జ్యోతిషం వంటి సంప్రదాయ పాండిత్యానికి వారాణసి ప్రధాన అధ్యయన కేంద్రంగా ఉంటూ వచ్చింది. దీనిని సర్వ విద్యా రాజధానిఅంటుండేవారు. నగరంలో జామియా సలాఫియా అనే సలాఫీ ఇస్లామీయ అధ్యయన సంస్థ కూడా ఉన్నది.

పర్యాటక రంగం
వారణాసి లో విలసిల్లిన అసమానమైన సంస్కృతి మూలంగా విదేశీ యాత్రికులకు చాలా ప్రీతిపాత్రమైన యాత్రా స్థలం.నగరంలో 3,4, 5 స్టార్ హోటళ్ళు కూడా ఉన్నాయి. అన్ని రకాల వంటకాలు లభ్యమౌతాయి.అక్కడి సంస్కృతి ప్రభావం వలన వీటిలో చాలా వరకు వీధుల్లోనే లభిస్తాయి. పట్టు వస్త్రాలకు, ఇత్తడి సామానుకు వారాణసి ప్రసిద్ధి చెందినది. ఎంతో చక్కని పనితనం ఉట్టిపడే పట్టు చీరలు, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు, చెక్క సామాను, తివాచీలు, గోడకు వేలాడదీసే పటాలు(wall hangings), ఆకర్షణీయమైన దీపపు స్థంభాలు (lamp shades) మరియు హిందూ, బౌద్ధ దేవతల బొమ్మలు విరివిగా లభిస్తాయి. చౌక్, గొధౌలియా, విశ్వనాధ్ సందు, లహురాబీర్, థటేరి బజార్ ముఖ్యమైన బజారులు[15]

ఋగ్వేదంలో ఈ నగరాన్ని కాశి”, “జ్యోతి స్థానంఅని ప్రస్తావించారు. స్కాంద పురణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యాన్ని గురించిన వర్ణన ఉంది. ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు.