శంతనమహారాజు పెళ్ళి

శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. 'నన్ను పెళ్ళి చేసుకుంటావా?'అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ'నేనెవరో తెలుసా?' అంది. "నువ్వెవరివైనా సరే, నన్ను వివాహమాడు. నా రాజ్యం,నా డబ్బు,నా ప్రాణం,సర్వస్వం నీ కిచ్చేస్తాను " అని మ్రతిమాలాడు. అప్పుడు ఆ అమ్మాయి,"మహారాజా! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను.కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి " అంది.

ఆవేశంలో "అలాగే!" అని మాట యిచ్చాడు శంతనుడు. వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు - గంగాదేవి. పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా, పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో " నువ్వెవరు? ఎక్కడనుండి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? " అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు.

ఏడుగురు కొడుకులు పుట్టారు.ఏడుగురూ ఏటిపాలయ్యారు చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక " నువ్వు తల్లివి కావు...ఎందుకింత పాపం చేస్తున్నావు? " అని అడిగాడు.

వెంటనే ఆమె "మహారాజా! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.

" పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. 'ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు' అని చెప్పాడు భర్త.

ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను 'సరే' అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.

" వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో,'మీరంతా మానవులై పుట్టండి' అని శపించాడు. అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు.

కానీ వశిష్ట మహర్షి , 'నా శాపానికి తిరుగులేదు పొండి!' అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.' నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు!' అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.

" ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, 'గంగాభవానీ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు, అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి, మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ!' అని మొరపెట్టుకున్నారు.అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను, అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది. ఆ పిల్లవాడే దేవవ్రతుడు. వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు. ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ, పాండవ, వంశాలకు పితామహుడు.