పుష్య మాసం




ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రానికి సమీపంలో ఉంటాడు కాబట్టి "పుష్య మాసంగా" వ్యవహరిస్తారు. ఈ మాసంలో "శ్రీ మహావిష్ణువును, శివుని, సూర్య నారాయణ మూర్తిని" ఆరాధిస్తారు. పుష్య శుద్ధ విదియ లగాయతు పంచమి వరకు శ్రీ మహావిష్ణువును తులసిదళాలతో పూజించడం "సౌందర్య" ప్రదాయినిగా
చెప్పబడింది. అలాగే, ఈ మాసంలో "ఆదివారాలు" సూర్య భగవానుని జిల్లేడు పూలతోను, "సోమవారాలు" పరమశివుని మారేడు దళాలతో అర్చించడము, అత్యంత విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది.

ఇంకొక విశేషం ఏమిటంటే, "పుష్యమి" శనేశ్వరుని జన్మ నక్షత్రం కాబట్టి, ఈ మాసం అంతా, ప్రతి రోజు, సూర్యోదయాత్ పూర్వమే తల స్నానం చేసి, శనీశ్చరుని భక్తీ శ్రద్ధలతో పూజించి, పౌర్ణిమ నాడు శనీశ్చరునికి తైల అభిషేకం జరిపించి, నువ్వులు దానం ఇచ్చిన వారికి శని ప్రసన్నుడై సర్వ శుభములు ప్రసాదిస్తాడని పురాణ వాక్కు. ఈ విధంగా ఆచరించేవారుశనీశ్చరునికి ప్రీతి కాబట్టి, నువ్వులు, బెల్లం వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం పరిపాటి. ముఖ్యంగా జాతక రీత్యా "ఏలినాటి శని" మరియు "అష్టమశని" ఉన్నవారు పై విధిని ఆచరించడం ద్వారా చాల ఉపశాంతి పొందుతారు.ఈ మాసంలో "వస్త్ర దానం" విశేష ఫలితాన్ని ఇస్తుంది.

ఈ మాసంలో సుర్యారాధన విశేషంగా చెప్పబడింది కనుక, ఈ మాసం అంతా సర్వ దేవతామయుడు, సర్వ వేద మూర్తి, ప్రత్యక్ష దైవము అయిన శ్రీ సూర్య భగవానుని
నియమంగా ఆరాధిస్తూ, ప్రతి రోజు స్నానానంతరం సూర్యోదయ సమయంలలో (సూర్య భగవానుని ప్రత్యక్షంగా చూస్తూ) ఆదిత్య హృదయ పారాయణ చేయడంవాళ్ళ చక్కని ఆరోగ్యం, ఇస్వర్యం, పొందుతారు అని పెద్దల మాట. ఈ నియమం పాటించేటప్పుడు కత్తితో / కత్తిపీటతో / మిక్సీ తో తరగబడిన కూరగాయలు, నిషిద్ధ ఆహారములు తినకూడదు.

పుష్య బహుళ అమావాస్య (30 January, 2014) నే చొల్లంగి అమావాస్య లేదా మౌన అమావాస్య అని అంటారు. "చొల్లంగి" అనేది తూర్పు గోదావరి జిల్లలో చిన్న గ్రామం. ఇక్కడే గోదావరి ఏడవ పాయ, సముద్రంలో కలుస్తుంది. అందుకే, ఇక్కడ భక్తులు ఆనాడు, పుణ్య స్నానాలు ఆచరిస్తారు. సప్త సాగర యాత్ర చేసే యాత్రీకులు, చొల్లంగి వద్ద నున్న గోదావరి నదిలో స్నానం చేయడం తో వారి యాత్రను ముగిస్తారు. మౌని అమావాస్య- మౌన వ్రతం ఆచరించడం కూడా చెప్పబడి ఉంది.