అన్నింటిల్లోనూ పరమాత్మ ఉన్నాడు
దేవుని యందు ప్రేమతో
మెలగడమే, భక్తి అనబడుతుంది. దేవుని
యందు భక్తిని ఆవిష్కృతం చేయడమే, మీరు చెప్పే ఏ ఇతర ఆవిష్కరణలైనా, అది ప్రేమ అనండి అభిమానం అనండి ఇంకేదైనా
అనండి. భగవంతుని యందు మనకున్న ప్రేమాది గుణములను సంతతము ఒక నూనె ధార లేదా
తేనె ధార సంతతం ఎక్కడా తెగకుండా ఎలా పడుతుందో అలా సంతతము నిర్విరామంగా
ఆవిష్కరించడాన్నే భక్తి అంటారు. ఆ భక్తితో కూడిన విహిత కర్మాచరణము శ్రద్దగా
చేసి అది పండితే (అంటే శాస్త్రాదులు, ఆచార్యులు, గురువులు చెప్పినవి ఆచరించటం) జ్ఙాన వైరాగ్యాలు
సిద్ధిస్తాయి అదే మోక్షం. ఈ స్థితిలో
రాయి ఐనా రత్నమైనా రెండూ సమానమే, అప్పుడు అతడు
తత్త్వమసి మహావాక్యంలో
స్థిరపడిపోతాడు. వారిని మనం అనుకరించలేం.
అందుకే గురువుగారు తరచు చెబుతూ
ఉంటారు "జ్ఙానిని అనుకరించరాదు/ అనుకరించలేము, అజ్ఙానిని అనుసరించరాదు
అని".
అలా కాక నాబోటి వారు సాధనలో అ ఆలు నేర్చుకునేవారి స్థాయినుంచి చూసి, శాస్త్రముల, మరియు గురువుల వాక్కు ననుసరించి వెండి మూర్తుల గురించి అలా చెప్పవలసి వచ్చింది. అందుకు
కారణాలూ ఉన్నాయి. ఒక్కో వస్తువులో ఒక్కో విభూతి ఉంటుంది ఆ విభూతి
ద్వారా ఆ వస్తువు యొక్క పవిత్రత కాని గొప్పదనం కాని వ్యక్తమవుతాయి,
ఆ అన్ని విభూతులను కేవలం మనిషి ఒక్కడే
అనుభవించగలడు. అదే మనిషికున్న విభూతి. ఆ
విభూతిని దైవ పరం చేయడమే సాధకుని మొదటి లక్షణం కావాలి.
ఐతే ఆధునిక పోకడలు, అరకొర సమాచార లభ్యంతో కొంత కొంత విషయాన్నే స్వీకరించి అందులోనే భావాలతోనే
స్థిరపడిపోక పూర్తి వివరాన్ని తెలుసుకుని ముందుకు సాగుతూ ఉండాలి, సాధకుని జీవితం ఒక నదిలా సాగాలి, రక రకాల అనుభవాలు, ఎలా వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి, ఎంత సాధన కఠోర
పరిశ్రమ చేయాలి అన్నవి
కూడుకుని సముద్రంలో కలిసి నిశ్చలంగా మారాలి. సముద్రంలో కలిసే నదే కదా
దక్షిణ సముద్రం కన్నా పడమటి సముద్రం దగ్గర అని అటువైపు వెళ్ళదు.
అటువెళ్ళేవి నదములు. అలానే సాధకుని స్థాయిని బట్టి వస్తు భేధం గోచరిస్తుంది.
గోచరించాలు కూడా అదే సాధకుని సహజ తత్త్వం. లేకపోతే కృతకంగా కృతిమంగా
ఉంటుంది.
అన్నింటిల్లోనూ పరమాత్మ
ఉన్నాడు అది నిక్కం అందులో ఏతేడాలేదు. ఐతే అది నోటిమాటగా కాక ఆచరణలోకూడా
సాధించగలిగిననాడు సాలగ్రామమైనా వెండి విగ్రహమైనా, ఆఖరికి ఇనుముదైనా ఏకమే. ఐతే ఈ భావన పుజా గదిలోనే కాక బయటికి వచ్చినప్పుడూ ఉందా అన్నది
ప్రశ్నించుకుంటే తేడాలు మనం పాటించాలా వద్దా, కేవల మనభావనే సరిపోతుందా
అన్న విషయం బయటికొస్తుంది. మనకి ప్రపంచమంతా ఏకం గానే కనిపిస్తే అప్పుడు ఏ
విధమైన విధి నిషేధాలు లేవు అది జ్ఙాని స్థాయి. ఆ స్థాయికి చేరుకునేలోగా ఒక
సాధకునిగా భగవంతుడు మనకిచ్చిన వివిధ అద్భుత వస్తువుల విభూతిని
ఎలావాడుకోవాలో అలానే వాడుకోవాలి. ఎవరు ఏది చేయలో అదే చేయాలి. జ్ఙానిగా పండిన
తరవాత అంటారా, అటువంటి గొప్ప స్థాయికి చేరినవారిని గూర్చి
చెప్పేంత స్థాయి ఉన్నవాడిని కాను.
అన్యధా భావించకండి, ఎవ్వరినీ నేను తప్పెంచటంలేదు, సందర్భోచితంగా అనిపించి చెబుతున్నాను. అలసత్వమంతా
దేవుని పూజ గురించిన విషయాల్లోనే ఎక్కువ. భగవంతునికి ఇది చాలులే,
ఆయనేమన్నాఅడిగాడా? అదైనా ఒకటే ఇదైనా ఒకటే, వంటి భావనలు కేవలం భగవంతుని పూజ
విషయంలోనే. నిజజీవితంలో కూడా దానిని ఆచరించగలిగి అదే దర్శన
సామర్థ్యం కలిగి ఉంటే నిజంగా మహనీయుడే కానీ మిగతా విషయలాలో చూపని ఈ వేదాంత
భావన భగవత్పూజలో ఎందుకు. ఏది ఎలా చేయమన్నారో అలానే చేయాలి. ఒక్కో
వస్తువు యందు ఒక్కో విభూతి ఉంటుంది దాని పవిత్రత ద్వారా మన సాధనని తొందరగా
సిద్ధింపజేస్తాయి అవి. ఐతే అందుకు తగ్గ సామర్థ్యం మనలోనూ ఉండాలి.
అన్ని వస్తువులనీ ఒక్క గాట కట్టలేం. రుద్రాక్ష పూసకి రేగు పూసకీ తేడాలేదూ?.
అదే గండకీ నదిలోని ఇతర శిలలకి సాలగ్రామ శిలకీ తేడాలేదూ? రెంటిలోనూ భగవంతుడున్నాడే మరి తేడా ఎందుకు? ఒకచోట భగవంతుని ప్రకాశకత్వం
ఎక్కువ ఒకచో తక్కువ.
నిజమే భగవంతుడు పత్రం
పుష్పం ఫలం తోయం.. ఇలా ఏదైనా శ్రద్ధతో మనసునిండా భక్తితో ఇస్తే
తీసుకుంటానన్నారని కేవలం ఒక ఆకు ఇచ్చి ఊరుకోంగా, భక్తి ఎక్కువైతే దాని ప్రకటనం
చేయబడుతుంది. ఎంత భక్తి ఎక్కువైతే భగవంతునికి ఈ సేవ చేయాలి ఆ సేవ చేయాలి
అని ఎక్కువ కోరికలు పుడతాయి అంతే గాని జ్ఙాని స్థాయిలో జ్ఙానిని
అనుకరించి భక్తి ఎక్కువ వుంది కాబట్టి మనస్సులో భావం చేస్తాను అని అనలేం. సాధక
స్థాయిలో భక్తి భావం ప్రకటనమై
శిష్టాచారపరుడై ఏది ఎలా చేయమని విధి
నిషేధాలు విధించారో అది చేస్తాడు. అలా చేస్తే ఏమవుతుంది? అలా చేస్తే చిత్తశుద్ధి, కార్యశుద్ధి, కలిగి తాను
చేరుకోవలసిన స్థాయిని త్వరగా
చేరుకుంటాడు.
అంతా నియమ నిష్ఠలు విధి
నిషేధాలతో కూడిన పూజాధికాల ద్వారా భక్తి పరిపుష్టమవుతుంది. ఇది
మనసుకొక వ్యాయామం లాంటిది. ఏది ఎలా చేయమని చెప్పబడిందో దేనికి ఏ
వస్తువుని వాడమని చెప్పబడిందో అదే చేయాలి తప్ప అన్యము కాదు. జ్ఙానులు
గురువులు వారిలీలలో అలా చేసి చూపారు అంటే ఆ లీల వెనక తాత్పర్యం సందర్భం
వేరు అన్నిటా భగవంతుడున్నాడని అన్నీ ఆయన విభూతులేనని చూపడం వారి
ఉద్దేశ్యం అది వారి స్థాయి. చాలా మందికి ఇదో అలవాటు, సాయి చరిత్రలో బాబాగారు మాంసం వండారు, ఆయన మాంసం తిన్నారు అని, లేదా ఇంకేదో చేశారు,
మరి ఆయన గరిటలేకుం వెండి వస్తువులను, పెద్దలకు, గురు తుల్యులకు, భాగవతులకు కానుకలుగా సమర్పించరు, వెండి మూర్తులకు పూజ కూడా శ్రేష్ఠం కాదు. ఏ సాంప్రదాయ సనాతన ధర్మ ఆలయాల్లోనూ వెండి
మూర్తులు ఉండవు. ఉన్నా అర్చనకు వాడరు. ఆ
గుడికి
కానీ, ఆ మూర్తులకు కానీ ప్రత్యేకత ఏమైనా ఉంటే తప్ప. ఐతే కొన్ని
కొన్ని వ్రత కల్పాలలో మాత్రం వెండి
రూపులను పూజ చేయవచ్చు అని చెపుతారు, కారణం లోభత్వం లేకుండా తన
శక్తిమేర భగవంతుని ఆ వ్రతం ద్వారా అర్చించడం. ఏదో వ్యాపారులు వ్యాపారం కోసం
అమ్ముతున్నారు తెలియక అది కొనేస్తున్నారు, అందంగా అనిపిస్తే అందులోని
భగవత్విభూతిని చూసి చక్కగా ఇందాక మీరు చెప్పినట్టు భావనతో
అందులోని విభూతికి పూజ చేయవచ్చేమో, కాని ఆ వెండి మూర్తిని తిన్నగా
సింహాసనంలో పెట్టి అర్చన చేయరు. పక్కన ఎక్కడైనా పెట్టి నిత్యార్చన జరిగే మూర్తుల
తో పాటు పుష్పాదులు సమర్పించి సంతోషపడవచ్చునేమో. ఎవరి మనసు నొప్పించటానికీ
ఇది చెప్పలేదు, పొరపాటున పరుషంగా అనిపిస్తే దానిని వదిలి, ఇందులోని భావాన్నే స్వీకరించండి.