మనుస్మృతి (భాగం-1)

స్మృతి అంటే మానవుడు. సంఘంలో ఎలా మెలగాలి? పెద్దలపట్ల ఏ విధంగా వుండాలి? గృహస్థుడిగా తన బాధ్యతల్ని ఎలా నిర్వహించాలి? వ్యక్తిగా తన జీవన విధానం ఏ విధంగా వుండాలి? జీవితంలో వివిధ దశల్లో ఎలా వ్యవహరించాలి? ఆయా వర్ణాల ప్రజలు, స్త్రీ పురుషులు ఆయా సందర్భాలలో ఎవరితో ఎలా వ్యవహరించాలి? ఇత్యాది ప్రవర్తనా నియమాలను తెలిపేది.

మనకు లభించిన స్మృతులలో తలమానికమైనది మనుస్మృతి. ఇది కాక ప్రధానమైన స్మృతులు దాదాపు ఇరవై రెండు వున్నాయి. వీటిలో పరాశర స్మృతి, గౌతమ స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పౌలస్త్యస్మృతి, యమస్మృతి ముఖ్యమైనవి.

మనుస్మృతి మనువు రూపొందించాడు. అయితే ఇప్పుడు మనకు లభ్యమవుతున్న  మనుస్మృతిలో పక్షిప్తాంశాల పాలు ఎక్కువ. నిజానికి మనుస్మృతిలో  నిజంగా మనువు చెప్పిన అంశాలు ఎన్నో, కాలానుగుణంగా ఇతరులు చొప్పించిన అంశాలు ఎన్నో ఇప్పుడు విడదీసి చెప్పడం కష్టం.

ప్రాచీన సంప్రదాయం ప్రకారం బ్రహ్మ తొలుత రచించిన స్మృతిని మనువుకు ఉపదేశించాడని, ఆ మనువు భృగుమహర్షికి బోధించాడని, ఆ భృగు మహర్షి సమస్త మునులకు వెల్లడించాడని మనుస్మృతి పుట్టుక గురించిన కథ.

ప్రతీ బ్రాహ్మణుడు ఈ మనుధర్మ శాస్త్రాన్ని అధ్యయనం జేయాలని, శిష్యులకు చెప్పాలని, ఇతర వర్ణస్తులకు చెప్పరాదని, మనుస్మృతి చదివే అధికారం ఇతర వర్ణాల వారికి లేదని మనువు భావన.

వేదాలలోని, స్మృతులలోని విషయాలను గురించి తర్కిన్చాకూడదని, మరో ఆలోచన లేకుండా వీటిని అనుసరించాలే తప్ప, ఇవి సహేతుకమైనవా? కాదా? అని శాస్త్రీయ దృష్టితో తర్కించడం తప్పు అని, అలా తర్కించే వారిని సంఘం నుంచి బహిష్కరించాలని మనువు బోధించాడు.

మనుధర్మ శాస్త్రం ప్రకారం: 
సకల సృష్టికర్త అయిన బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాలనుంచి శూద్రులు జన్మించారట.

వేదాలను, శాస్త్రాలను చదవడం, బోధించడం, యజ్ఞాలు చేయించడం చేయడం మొదలైనవి బ్రాహ్మణులు చేయాలి.

ప్రజా సంరక్షణ, దానాలు చేయడం, యాగాలు చేయడం మొదలైనవి క్షత్రియ ధర్మాలు.

గోసంరక్షణ, వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం మొదలైనవి వైశ్య ధర్మాలు.

శూద్రులకు ఒకటే ధర్మం అది మిగిలిన వర్ణాల వారికి సేవలు చేయడం.

శిరస్సునుంచి పుట్టడంవల్ల, వేదాలు పఠించడంవల్ల మిగిలిన వర్ణాల వారికి బ్రాహ్మణుడు ప్రభువు. పుట్టుకతోనే బ్రాహ్మణుడు మనుషులందరిలోకి గొప్పవాడు. ప్రపంచంలోనిసకల సంపదలకు అతడే యజమాని.

లోకంలోని సర్వస్వం బ్రాహ్మనులదే కాబట్టి అనుభవించే సంపదలు అన్నీ వారివే. బ్రాహ్మణుల దయాగుణం వల్లనే వారి సంపదలను ఇతరులు అనుభవిస్తున్నారు.

ఆర్యావర్త ప్రదేశాన్ని దేవ నిర్మితమైన బ్రహ్మవర్తమంటారు. ఈ ప్రదేశంలో వివిధ వర్ణాలవారు వంశపారంపర్యంగా ఏ ఆచారాలను ఆచరిస్తున్నారో ఆ ఆచారాలే సదాచారాలు.

ఆర్యావర్తమే యజ్ఞాలకు యోగ్యమైన ప్రదేశం. కాబట్టి వివిధ ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణులు ఈ ప్రాంతానికి చేరాలి. శూద్రులు జీవిక నిమిత్తం ఏ ప్రాంతానికైనా వెళ్ళవచ్చును.

బ్రహ్మాణ శిశువుకు పెట్టె పేరు శుభవాచకమై ఉండాలి. క్షత్రియునకు పెట్టె పేరు బలవాచకమై ఉండాలి. వైశ్యునకు పెట్టె పేరు ధనవాచకమై ఉండాలి. శూద్రులకు పెట్టె పేర్లు నిందార్హమైనవిగా వుండాలి. ఉదాహరణకు బ్రాహ్మణుని పేరు శుభశర్మ, క్షత్రియుని పేరును బలవర్మ, వైశ్యుని పేరు వసుభూతి, శూద్రుని పేరు దీనదాసుడు. స్త్రీల పేర్లు పిలవడానికి సులువుగా వుండాలి. మంగళవాచకమై, అందంగా వుంది, దీర్ఘాచ్చు అంతమందుగల పదాలు మంచివి.

బ్రాహ్మణునకు ఏడవయేట, క్షత్రియునకు పదివయేట, వైశ్యునకు పదకొండవయేట ఉపనయనము చేయాలి. బ్రహ్మవర్చస్సును గోరు బ్రాహ్మణునకు ఐదవయేట చతురంగ బలాల్ని గోరు క్షత్రియునకు ఆరవయేట, బహు సంపదలగోరు వైశ్యునకు ఎనిమిదవయేట ఉపనయనము చేయాలి.

బ్రాహ్మణునికి పదహారవ సంవత్సరం వరకు, క్షత్రియునకు ఇరవై రెండవ సంవత్సరం వరకు, వైశ్యునకు ఇరవైనాలుగవ సంవత్సరము వరకు గాయత్రి నశింపదు. ఈ వయసులు కూడా దాటి ఉపనయనము చేయనివారు గాయత్రి నుంచి భ్రష్టులవుతారు. సజ్జనులచేత ద్వేషింపబడతారు. ప్రాయశ్చిత్తము చేసుకొని ఇలాంటి వారితో వివాహ సంబంధాలు కలుపుకోకూడదు. ఆపదలలో కూడా వారితో సఖ్యంగా ఉండకూడదు.

బ్రహ్మచారులలో బ్రాహ్మణులు జింకతోలును, క్షత్రియులు రురుమృగ చర్మాన్ని, వైశ్యులు గొర్రెతోలును ఉత్తరీయంగా ధరించాలి. బ్రాహ్మణుడు నారబట్టను, క్షత్రియుడు పట్టుబట్టను, వైశ్యుడు ఉన్ని బట్టను కట్టుకోవాలి.

బ్రాహ్మణులు పత్తినూలుతోను, క్షత్రియులు జనపనారతోను, వైశ్యులు తెల్ల మేక బొచ్చుతోను పేని కుడివైపుగా చుట్టి తొమ్మిది పోగులు గల యజ్ఞోపవీతాన్ని భుజంపై ధరించాలి. మంచం మొదలైన ఎత్తయిన వాటిమీద పడుకోకూడదు.

బ్రాహ్మణ బ్రహ్మచారీ బిల్వము, మోదుగలలో ఒక దానిని దండముగా ధరించాలి. బ్రాహ్మణుని దండము కురులవరకు వుండాలి. క్షత్రియ బ్రహ్మచారి మర్రికొమ్మనుగాని, చండ్రకొయ్యనుగాని దండంగా ధరించాలి. క్షత్రియ దండము నోసటివరకు మాత్రమే వుండాలి. వైశ్య బ్రహ్మచారి జువ్వి కోయ్యనుగాని, మేడి కోయ్యనుగాని దండంగా ధరించాలి. వైశ్యుల దండము ముక్కు వరకు మాత్రమే వుండాలి. ఆ దండములు వంకరలేనివి, అగ్నిలో కాలనివి, సోగాసైనవిగా వుండాలి. బ్రహ్మచారులు ఆ దండములతో బ్రాహ్మణులను భయపెట్టకూడదు.

ప్రతిదినము ఆ దండము గైకొని సూర్యోపాసనము చేసి, అగ్నికి ప్రదక్షిణ గావించి, భిక్షాటన చేయాలి. బిక్షాటన గావించేటప్పుడు ఉపవీతుడైన బ్రాహ్మణుడు భవతి భిక్షాం దేహిఅంటూ భిక్షాటన చేయాలి. క్షత్రియుడు భిక్షాం భవతి దేహిఅనాలి. వైశ్య బ్రహ్మచారి భిక్షాం దేహి భవతిఅంటూ భిక్షాటన చేయాలి.

తల్లినిగాని, సోదరినిగాని, పినతల్లి, పెదతల్లినిగాని ఎవరు ఈతనిని అవమానించారో ఆమెను యాచించాలి. తెచ్చిన మధుకరమును కావలసినంతవరకు గురువుకు నివేదించి, ఆటను అనుజ్ఞ పొంది తూర్పు ముఖంగా కూర్చుని భుజించాలి.

దీర్ఘాయుస్సు గోరువారు తూర్పు ముఖముగా కూర్చుని, కీర్తికాయులు దక్షిణాభి ముఖులై, సంపద గోరువారు పడమటివైపు దిరిగి, మోక్షకాములు ఉత్తరాభి ముఖులై భుజించాలి. భోజనం చేసేటప్పుడు నిర్మల మనస్కుడై వుండాలి. చింతలను వదలాలి.

ఇలాంటి భోజనమే మనకెప్పుడూ లభించుగాకఅని స్తోత్రము చేయాలి. అలా స్తుతించి చేసిన భోజనము శక్తినిస్తుంది. అలా స్తుతించకుండా భోననం చేస్తే శక్తి నశిస్తుంది.

ఎంగిలి అన్నం ఎవ్వరికి పెట్టకూడదు. మధ్యాహ్నం, రాత్రి తప్ప మధ్య మధ్య భోజనం చేయకూడదు. ఎంగిలి చేతితో అటు, ఇటు తిరగకూడదు. మితిమీరి భోజనము చేయకూడదు. మితిమీరి భోజనం చేయడం అనారోగ్యహేతువు. ఆయుస్సును నశింపజేస్తుంది. స్వర్గాది పుణ్యలోకాలకు, పుణ్యకార్యాలకు విరోధి. బ్రాహ్మణాదులు బ్రహ్మతీర్థంతో, దైవ తీర్థంతో ఆచమనం చేయాలి. పితృతీర్థంతో ఎప్పుడూ ఆచమనం చేయకూడదు.

బొటనవ్రేలి యొక్క మొదటిభాగాన బ్రహ్మతీర్థమున్నదనియు, చిటికనవ్రేలి మొదటియందు కాయతీర్థమున్నదనియు, వ్రేళ్ళ కొనలయందు దైవతీర్థమున్నదనియు, తర్థన్యంగుష్ఠముల మధ్యమున పితృ తీర్థం వున్నదని చెబుతారు.

స్త్రీలకు వివాహమే ఉపనయన కర్మ. భర్తకు సేవలు చేయడమే గురుకుల వాసము, గృహకృత్య నిర్వాహణమే అగ్నిహోత్రము.

గురువు శిష్యునికి ఉపనయనము గావించి మొదట శౌచమును, ఆచారాన్ని అగ్నిహోత్ర, సంధ్యోపాసనలను నేర్పాలి.

ప్రతిరోజూ వేదాధ్యయనం ప్రారంభించేముందు, ముగించేముందు గురువు పాదాలను చేర్చి పట్టుకోవాలి. అధ్యయనం చేసేటప్పుడు చేతులు కట్టుకోవాలి. అలా చేతులు చేర్చడాన్ని బ్రహ్మాంజలి అంటారు.

వేదాధ్యయనం ప్రారంభించేముందు ప్రతిసారీ ఓంకారము నుచ్చరించాలి. అలా చేయకపోతే చదివింది క్రమంగా మర్చిపోతారు. వేదాధ్యయనం ముగించే ప్రతిసారీ ఓంకారము ఉచ్చరించకపోతే చదివినది మనసులో నిలవదు.

బ్రాహ్మణుడు సంధ్యా సమయంలో, తక్కిన వేళల్లో రోజుకు వెయ్యుసార్లు గాయత్రిని జపిస్తే ఒక్క నెల రోజులలో పాము కుబుసం విడిచినట్లు సర్వపాపాల నుంచి విముక్తుడవుతాడు.

రోజూ గాయాత్రిని జపించని, హోమం చేయనివారు సజ్జనులలో నిందా పాత్రులవుతారు.

ఓం అనే ఒక్క అక్షరమే బ్రహ్మము, ప్రాణాయామములే గొప్ప తపస్సు. గాయత్రిని మించిన మంత్రము లేదు. మౌనము కంటే సత్యము చెప్పుట మేలు.

చెవి, ముక్కు, నాలుక, చర్మము ఇవి అయిదు జ్ఞానేంద్రియాలు. వాక్కు, కాళ్ళు, చేతులు, ఆపానము, ఉపస్థము ఇవి ఐదు కర్మేంద్రియాలు. మనసు పదకొండవ ఇంద్రియము. మనసు తన కార్యమును బట్టి జ్ఞానేంద్రియముగాను, కర్మను బట్టి కర్మేంద్రియముగానూ అవుతుంది. మనసును జయించిన వాడు జ్ఞాన, కర్మేంద్రియాలను రెంటినీ జయించినవాడు.

మనస్సు చెప్పినట్లు ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం పాటించాలి. ఇంద్రియలోలురు ఇహలోకమున కష్టమును, పరలోకమున పాపమును పొందుదురు. ఇంద్రియములను అదుపులో పెడితే మోక్షసిద్ధి కలుగుతుంది. కాబట్టి ఇంద్రియాలను జయించాలి.

ఇంద్రియ సుఖాలను అనుభవించడంలో ఎప్పటికీ తనివితీరదు. అగ్నివ్యాపించినట్టు, కోరికలు తీర్చుకునే కొద్దీ హెచ్చావుతుంటాయి. కోరికలను ఉపేక్షించడం, కోరికలను విడవడం ఉత్తమం. చేడుమనసు గలవాడు వేదాలను అధ్యయనం చేసినా, దానాలు చేసినా, యజ్ఞాలు చేసినా, తపస్సులు చేసినా ప్రయోజనం లేదు. ఏ మనిషి సుఖాలకు సంతోషింపడో, కష్టాలకు దుఃఖపడడో అతడే జితేంద్రియుడు.

ఇంద్రియాలన్నింటిలో ఏ ఒక్క ఇంద్రియలోలత్వం వున్నా, అతని జ్ఞానం కుందకున్నచిన్న రంధ్రం ద్వారా నీరంతా కారిపోయినట్లు నశిస్తుంది.

కాబట్టి ఇంద్రియాలను లోబరచుకొని, మనసుని గట్టిపరచుకుని, ఉపాయంతో దేహాన్ని బాధ పెట్టక సకలార్థాలను సాధించాలి. అలా సాధించిన పిదప అతడు క్రమంగా ఆ దేహాన్ని వదలాలి.

ప్రతీ రోజూ ఉదయాన సూర్యోదయమయ్యేవరకు గాయత్రీ మంత్రాన్ని నిలబడి జపించాలి. సాయంత్రం నక్షత్రాలూ కనిపించేంతవరకు కూర్చుని గాయత్రిని జపించాలి. ఉదయం పూట గాయత్రిజపం చేసి రాత్రి చేసిన పాపాలను పోగొట్టుకుని, సాయంత్రం గాయత్రి జపంచేసి పగలు చేసిన పాపాలను పోగొట్టుకోవాలి.

ఎవరు ఉభయ సంధ్యలను ఉపాసింపరో అట్టి వారిని శూద్రుని బహిష్యరించినట్టు అన్ని బ్రాహ్మణ కర్మలనుంచి బహిష్కరించాలి.

గురుపుత్రుడు బంధువు. సేవ చేయువాడు. మరో విద్య నేర్పువాడు, పరిశుద్ధుడు, చెప్పింది గ్రహించి గుర్తుంచుకునే సమర్థుడు, మేలు కోరేవాడు, వీళ్ళకు దక్షిణ తీసుకోకుండా చదువు చెప్పాలి.

తనను అడగకపోతే ఎవరికీ ఏమీ చెప్పకూడదు. భక్తి శ్రద్ధలు లేకుండా అడిగిన వాడికి ఏమీ చెప్పకూడదు. బుద్ధిమంతుడయినవాడు తనకు అన్నీ తెలిసి వున్నా మూగవాడిలా మౌనంగా వుండాలి.

ఎవరు అన్యాయంగా ప్రశ్నలు అడుగుతారో, ఎవరు అన్యాయంగా బదులు చెబుతారో వాళ్ళు చనిపోతారు, లేదా విరోధము పుట్టును.

ఎవరికీ ధర్మము, ధనము రెండూ లేవో, ఎవడు శుశ్రూష చేయడో అలాంటి వానికి విద్య నేర్పకూడదు. అలాంటి వారికి నేర్పిన విద్య చవితి భూమిలో నాటిన విత్తనంలాగా వ్యర్థం అవుతుంది.

యోగ్యుడయిన శిష్యుడు దొరకనప్పుడు ఎవరికీ చదువు చెప్పకపోవడమే మంచిది. అయోగ్యుడికి ఎటువంటి పరిస్థితులలోనూ విద్యాబోధన కూడదు.

ఎవరైనా వేదాలను కంఠస్తం చేస్తున్నపుడుగాని, వేరెవరికైనా బొధిస్తున్నపుడుగాని వాళ్ళ అనుమతి లేకుండా విని వేదాలను అభ్యసిస్తే అట్టి వ్యక్తికి వేదాలను అపహరించిన పాతకము చుట్టుకుని నరకం చేరుతాడు.

శాస్త్రానికి కట్టుబడి వున్న బ్రాహ్మణునకు గాయత్రి మంత్రము ఒక్కటే వచ్చినా చాలు. శాస్త్రానికి కట్టుబడని, ఆచారాలను పాటించని బ్రాహ్మణుడు మూడు వేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడయినా హీనుడే.

తనకన్నా యోగ్యుడు, పెద్దవాడు వచ్చినపుడు తానూ ఆసనం మీదనుంచి లేచి అభివాదం చేయాలి. అలా చేసేవ్యక్తికి ఆయుస్సు, విద్య, యశస్సు, బలము ఈ నాలుగు వృద్ధి చెందుతాయి.

మేనమామ, పినతండ్రి, పిల్ల నిచ్చిన మామ, బ్రాహ్మణుడు, గురువు వచ్చినప్పుడు, ఆ వచ్చిన వ్యక్తికన్నా చిన్నవాడు అయినప్పుడు అతన్ని ఆహ్వానించి తన పేరు మాత్రం చెప్పి పిలుచుకుని రావాలి. అంతేకాని అభివాదం చేయకూడదు.

తల్లి తోబుట్టువు, మేనత్త, అత్త వీరు గురుపత్నితో సమానులు. కావున వీరికి గురుపత్నికి చేసినట్లు అభివాదం చెయ్యాలి.

అన్న సజాతి స్త్రీని వివాహం చేసుకుంటే అన్న భార్యకు ప్రతిదినము పాదాభివందనం చేయాలి. పినతండ్రి, మేనమామలు, వారి భార్యలు దేశాంతరము నుంచి వచ్చినపుడు నమస్కరించాలి. కాని మాటి మాటికి అభివాదము చేయనక్కరలేదు.

తండ్రి తోడబుట్టిన ఆమె యందును, పెద్దతల్లియందు, అక్కపై తల్లిపైవలే గౌరవం వుండాలి. వీరందరిలో తల్లి పూజ్యురాలు.

ఒక ఊరిలో వున్నవారు తనకంటే పదేళ్లు పెద్దవాడైన ఆ ఊరి వాడితో స్నేహం చెయ్యాలి. సంగీతం మొదలైన కళలు నేర్పిన వాడయితే ఆటను ఐదేళ్ల పెద్దవాడయినా అతనితో స్నేహం చేయవచ్చు. అదే వేదాధ్యయనం చేసిన వాడయితే ఆటను మూడేళ్ళ పెద్దవాడయినా అతనితో స్నేహం చేయవచ్చు. దాయాది అయితే కొద్దిగా పెద్దవాడయినా స్నేహం చేయవచ్చు.

పదేళ్ళ బ్రాహ్మణుని, నూరేళ్ళ

క్షత్రియుణ్ణి వరుసగా తండ్రి కొడుకులుగా భావిచాలి. వీళ్ళల్లో పదేళ్ళ బ్రాహ్మణుడినే తండ్రిగా భావించాలి.

ధనం, బంధువులు, వయస్సు, అనుష్టానం, చదువు ఇవి పూజింపదగినవి. ఇందులోనూ ధనంకంటే బంధువులు గలవాణ్ణి, బంధుత్వం కంటే వయసు, వయసు కంటే అనుష్టానం, అనుష్టానం కన్నా చదువు గొప్పవిగా భావించాలి.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలలోని ఎవరిలో పైన చెప్పిన ఐదు గుణాలు ఇక్కువగా వుంటాయో, అతడు మిగిలిన వారికన్నా పూజనీయుడు.

దారిలో వెళ్ళేటప్పుడు బండిలో వెళ్ళేవాళ్ళకు, ముసలివాళ్లకు, రోగికి, బరువులు మోసేవాళ్లకు, స్త్రీలకు, రాజుకి, వరునికి దారి ఇవ్వాలి.

శిష్యునికి ఉపనయనం చేసి, వెడాలను కల్పసూత్రాలతోను, ఉపనిషత్తులతో అధ్యయనం,చేయించిన బ్రాహ్మణుని ఆచార్యుడని అనవచ్చు.

జీవన భృతికోసం వేదంలో కొంత భాగాన్నిగాని, వేదాంగాలను గాని వ్యకరణాన్ని గాని శిష్యులకు భోదించే బ్రాహ్మణుని ఉపాధ్యాయుడు అనాలి.

ఏ బ్రాహ్మణుడు గర్భాదానం మొదలయిన కర్మలను చేయించునో, ఏ బ్రాహ్మణుడు అన్నము పెట్టి పోషించునో వానిని గురువు అనాలి.

నూరుగురు ఉపాధ్యాయులకంటె ఒక ఆచార్యుడు,వందమంది ఆచార్యులకంటే ఒక తండ్రి, నూరుగురు తండ్రులకంటే ఒక తల్లి ఎక్కువ గౌరవనీయులు.

ఉపనయనం చేసుకున్న వానికి వేదాధ్యయనం, వేదార్థజ్ఞానం, అనుష్టానం వీటిచే మోక్షసిద్ధి కలుగుతుంది. కాబట్టి వీటిని బోధించే ఆచార్యుడే శ్రేష్ఠుడు.

తనకు ఎవరు వేదశాస్త్రాలను కొద్దో, గొప్పో భోధిస్తారో వారినే గురువుగా భావించాలి.

ఉపనయనం చేసిన వానిని, వేదార్థమును వివరించిన వానిని వయసులో తన కన్నా చిన్నవాడయినప్పతికి తండ్రిగా భావించాలి.

జ్ఞాన శూన్యుడే బాలుడు మంత్రము. వేదము చెప్పువాడు తండ్రి. వేదము తెలియనివాడు బాలుడు. బోధించేవాడు తండ్రి తల నెరిసినందువల్ల వృద్ధుడుకాదు. చిన్నవాడయినా వేదాధ్యయనం చేసినవాడు వృద్ధుడు.

బ్రాహ్మణునికి జ్ఞానముచేత, క్షత్రియునికి వీరత్వము చేత, వైశ్యునకు ధనధాన్యముల వల్ల, శూద్రునకు వయసుచేత గొప్పతనం లభిస్తుంది.

అధ్యననం చెయ్యని బ్రాహ్మణుడు కొయ్య ఏనుగులాగా, తోలుతో చేసిన మృగం లాగా పేరుకే బ్రాహ్మణుడు. వేదాధ్యయనం చేయని బ్రాహ్మణుడు వ్యర్థుడు.

నీటి ఎరిగిన ఆచార్యుడు శిష్యులను క్రూరంగా దండించక దయతో, ఇంపుగా మంచి విషయాలను బోధించాలి.

ఎవరి మనసు రాగద్వేషాలతో చెడక నిర్మలమై వుంటుందో, ఎవరి వాక్కు అసత్యాలతో మలినం కాకుండా వుంటుందో అతడు వేదాలలో చెప్పినట్లు సర్వజ్ఞత, సర్వేశ్వరత్వ రూపమైన ఫలాన్ని పొందుతాడు.

తానూ నొచ్చుకున్నా యితరులు నొచ్చుకునేట్లు మాట్లాడకూడదు. ఇతరులకు ద్రోహం కలిగించే కార్యాలను మనసులోకి కూడా రానివ్వకూడదు. ప్రజలకు భయము, ఆందోళన కలిగించే మాటలు మాట్లాడకూడదు.

అవమానాలను ఓర్పుతో సహించాలి. ఇతరులు అవమానిచారని విచారపడకూడదు. అలా అవమానాన్ని దిగమ్రింగుకొని విచారపదనివాడు సుఖంగా నిద్రపోతాడు. సమాజంలో సుఖంగా తిరుగుతాడు. అవమాన పరచినవాడు ఆ పాపముతో నశిస్తాడు.

బ్రాహ్మణుడెప్పుడూ వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. ఎవడు వేదాధ్యయనం చేయక యితర శాస్త్రాలను అభ్యసించునో అతడు అతని వంశస్తులు శూద్రత్వం పొందుతారు.

బ్రాహ్మణునకు తల్లి గర్భామునుంచి మొదటి జన్మము, ఉపనయనం రెండవ జన్మము, యజ్ఞము తృతీయ జన్మము.

ఉపనయన మయ్యేదాకా శ్రాద్ధకాలమున చెప్పవలసిన మంత్రాలు తప్ప మరే ఇతర వేదమంత్రాలు చెప్పకూడదు. వేదం వలన మరోజన్మ కలిగేవరకూ (ఉపనయనం అయ్యేవరకు) బ్రాహ్మనుడూ, శూద్రునితో సమానుడే.

బ్రహ్మచారి తేనెను, మాంసమును తినరాదు. కర్పూర చందన కస్తూరాది సువాసన ద్రవ్యాలను వాడరాదు. వీటిని  కలిపినా పదార్థాలను తినకూడదు. పువ్వులు ధరించరాదు. స్త్రీలతో సంభోగించరాదు. ప్రాణి హింస చేయకూడదు. పాదరక్షలు ధరించకూడదు. క్రోధాన్ని, లాభాన్ని విడిచిపెట్టాలి. పాటలు పాడకూడదు. నాట్యం చేయకూడదు. సంగీత వాయిద్యాలు వాయించరాదు. జూదం ఆడకూడదు. ఇతరులతో వృధాగా తగాదా పడకూడదు. ఇతరులను నిందించక కూడదు. అబద్ధాలు చెప్పకూడదు స్త్రీలవైపు కోర్కెతో చూడకూడదు.

బ్రహ్మచారి ఒంటరిగా పడుకోవాలి. కోరికతో రేతస్సును విడవకూడదు. కామంతో రేతస్సును విడిచేవాడు బ్రహ్మచర్య వ్రతాన్నిపోగొట్టుకున్నట్లే. అలా బ్రహ్మచర్య  వ్రతాన్ని కోల్పోయినవాడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వప్నంలో రేతస్థలం చేసినవాడు మరునాడు ఉదయాన స్నానంచేసి సూర్యభగవానుణ్ణి ఉపాసించి ఇంద్రియాన్ని మళ్ళీ పొందుదుగాకఅనే ఋక్కును మూడుసార్లు జపించాలి.

బ్రహ్మచారి ప్రతిరోజూ భిక్షాటనం చేయాలి. గురుకులంలో, బంధువుల ఇళ్ళల్లో భిక్షాటనం చేయకూడదు. ఇతరుల ఇళ్ళు దొరకనప్పుడు బంధువుల ఇళ్ళు, అవి లేనప్పుడు గురుకులంలో భిక్షాటనం చేయాలి.

బ్రహ్మచారి ప్రతిరోజూ చాలామంది ఇళ్లనుంచి తెచ్చిన అన్నాన్ని తినాలి. ఒక్కరి ఇంటి నుంచి తెచ్చిన అన్నాన్ని తినకూడదు. అలా భిక్షాన్నంతో బ్రహ్మచారి జీవించడం ఉపవాసంతో సమానమని మునులు అంటారు. అయితే బ్రాహ్మణ బ్రహ్మచారి మాత్రమే ఒక్క ఇంటి భోజనాన్ని తినకూడదు. క్షత్రియ,వైశ్య బ్రహ్మచారులు తినవచ్చు.

గురువు సన్నిధానంలో గురువు కంటే మంచి ఆహారం తినకూడదు. గురువు మంచి బట్టలు కట్టకూడదు. గురువు పడుకోన్నాక పడుకోవాలి. గురువు నిద్ర లేవకముందే నిద్రలేవాలి.

గురువును పేరుపెట్టి మాట్లాడకూడదు. గురువులా మాట్లాడి, నడిచి, నటించి అతన్ని వెక్కిరించకూడదు. గురువును ఎవరైనా నిందిస్తుంటే చెవులు మూసుకోవాలి. లేదా వేరొక చోటికి పోవాలి.

శిష్యుడు గురువుపై అపవాదు మోపితే గాడిదగా, నిందిస్తే కుక్కగా, గురువు సంపదను అనుభవిస్తే పురుగుగా, గురువును ద్వేషిస్తే కీటకంగా జన్మిస్తారు.

నావ, ఎడ్లబండి, మేడ, చాప, రాయి మొదలైన వాటి మీద మాత్రమే గురువుతో సమానంగా కూర్చోవచ్చు.

గురువునకు గురువు వచ్చినప్పుడు, గురువునకు నమస్కరించినట్లే ఆయనకూ నమస్కరించాలి. గురువు ఇంట్లో ఉండేటప్పుడు తల్లిదండ్రులు వచ్చినా గురువు ఆనతి లేకుండా వారికి నమస్కారం చేయకూడదు.

సజాతీయులైన గురుపత్నులు గురువువలె పూజింపదగినవారు. గురుపత్ని జవరాలై తే యవ్వనంలో వున్న శిష్యుడు ఆమెకు పాదాభివందనం చేయకూడదు. పురుషులను మొహానికి లోనుచేసి వాళ్ళను పతనం చేయడం స్త్రీల స్వభావం కాబట్టి, విద్వాంసులు స్త్రీల విషయంలో ఏమరపాటుగా వుండకూడదు.

పురుషుడు విద్వాంసుడైనా, అవిద్వాంసుడైనా స్త్రీల వలలో పడటం సహజం. స్త్రీలు కామక్రోధ వశుడైన విద్వాంసుడినైనా, మూఢుడినైనా లొంగదీసి చెడు దారికి ఈడ్వ గలిగినవారు.

ఇంద్రియాలు బలం గలవి కాబట్టి వివేకం గలవారినైనా చెడుదారి కీడువి. కాబట్టి తల్లితోగాని, సోదరితోగాని, కూతరుతోనయినా ఒంటరిగా కూర్చోకూడదు.

బ్రహ్మచారి బోడిగుండుతోగాని, జలతోగాని ఉండాలి. సూర్యుడస్తమించక ముందు, సూర్యుడు ఉదయించిన తరువాత బ్రహ్మచారి నిద్రింపకూడదు. అలా పొరపాటున నిద్రిస్తే మరునాడు పగలంతా గాయత్రీ జపం చేస్తూ, ఉపవాసం వుండి రాత్రి భోజనం చేయవచ్చు. ఇలా ప్రాయశ్చిత్తము చేసుకోని వాడిని మహాపాపం చుట్టుకుంటుంది.

ధర్మార్థాలు కామ హేతువులవడంవల్ల శ్రేష్ఠమైనవని కొందరు అంటారు. అర్థ కామములు సుఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి అవి శ్రేష్ఠమయినవని కొందరు అంటారు. ధర్మం, అర్థకామాలకు కారణం కాబట్టి ధర్మం శ్రేష్టమని కొందరు అంటారు. అర్థమే ధర్మకామాలకు హేతువు కాబట్టి అర్థమే శ్రేష్టమని కొందరు చెబుతారు. కాని ధర్మార్థ కామములు మూడూ పురుషార్థములు కాబట్టి అవి శ్రేష్టములని మనువు అభిప్రాయం.

ఆచార్యుడు పరమాత్మ స్వరూపుడు తండ్రి హిరణ్యగర్భ స్వరూపుడు. తల్లి భూదేవి స్వరుపురాలు. అన్న ఆత్మ స్వరూపుడు. వీరు దేవతా స్వరుపూలు కాబట్టి వీళ్ళను తిరస్కరించకూడదు.

గురువు, తల్లిదండ్రులు, అన్న వీరివల్ల బాధపడ్డా వారిని తిరస్కారింపకూడదు. ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ విషయాన్ని తప్పక పాటించాలి. వీరు ముగ్గురికీ శుశ్రూష చేయడమే ఉత్తమ తపస్సు. వాళ్ళ అనుమతి లేకుండా మరియే ఇతర పుణ్యకార్యం చేయకూడదు. వారే ముజ్జగములు. వారే వేదములు. వారే యజ్ఞాదిఫల దాతలు కనుక త్రేతాగ్నులు. ఎవడు తల్లిదండ్రులను, గురువులను ఆదరించునో వాడు అందరిని ఆదరించువాడు. ఎవడీ ముగ్గురినీ తిరస్కరించునో అతని అన్ని క్రియలు నిష్పలము.

శ్రద్ధగలవాడు తనకన్నా తక్కువవాని నుంచైనా విద్యను గ్రహించాలి. తక్కువ కులం వారినుంచైనా స్త్రీని గ్రహించాలి.

స్త్రీలు, రత్నాలు, విద్య, ధర్మము, ఆమోదము, సుభాషితము, నానా విధవృత్తులు శిల్పాలను ఎక్కడనుంచి అయినా గ్రహించవచ్చు.

మోక్షాన్ని పొందగోరు బ్రహ్మచారి శిష్యుడు బ్రాహ్మణేతరుడయిన గురువుకు, వేదాధ్యయనం చేయని బ్రాహ్మణుడికి యావజ్జేవం శుశ్రూష చేయకూడదు.

శరీరం నశించేదాకా ఎవడు గురు శుశ్రూష చేయునో అతడు తప్పక శాశ్వత బ్రహ్మలోకమును పొందుచున్నాడు.

వేదాధ్యయనం చేయడానికి ముందు శిష్యుడు గురువుకు ఏ విధమైన దక్షిణ ఇవ్వకూడదు. వేదాధ్యయనం ముగిసిన పిదప, వివాహం చేసుకోడానికి గురువు అనుమతి పొంది ఆ తరువాత గురువు కోరిన దానిని దక్షిణగా సమర్పించాలి.

భూమి, బంగారము, ఆవులు, గుర్రాలు, గొడుగు, పాదరక్షలు, ఆసనము, ధాన్యము, కూరగాయలు, బట్టలు వీటిని దక్షిణగా ఇస్తే గురువుకు సంతోషం కలుగుతుంది.

మూడు వేదాలను అధ్యయనం చేయడానికి గురుకులంలో ముప్పది ఆరు సంవత్సరాలు వుండాలి. లేదా పదునెనిమిది సంవత్సరాలు లేదా తొమ్మిది సంవత్సరాలు లేదా కనీసం నేర్చుకునేంతవరకైనా బ్రహ్మచర్యాన్ని అవలంభిస్తూ గురుకులంలో వుండాలి.

మూడు వేదాలను గాని, రెండు వేదాలనుగాని, కనీసం తన శాఖా వేదాన్ని గారి గురువువద్ద బ్రహ్మచారిగా అభాసించి ఆ తరువాత గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి.

దీర్ఘ వ్యాదిగల స్త్రీని, రోమములు అసలు లేని, లేక ఎక్కువ రోమములు గల స్త్రీని, కపిలవర్ణపు కేశములుగల స్త్రీని, కఠినంగా మాట్లాడే స్త్రీని, దేహం పెద్ది గల స్త్రీని, పసుపు పచ్చని కన్నులుగల కన్యను వివాహం చేసుకోకూడదు.

పర్వతాలు, నక్షత్రాలూ, వృక్షాలు, నదులు వీటి పేర్లుగల, పక్షి, పాము, దాసులు, హీనజాతి పేర్లుగల, భీకరనామాలు గల స్త్రీని వివాహం చేసుకోకూడదు.

చక్కని అవయవాలు గల హంసలా, ఏనుగులా తిన్నగా నడిచే, పలుచని రోమాలు, మంచి కురులు, దంతాలు గల, మృదు శరీరంగల కన్యను వివాహం చేసుకోవాలి.

ఏ కన్యకు సోదరుడు లేడో, ఏ కన్యకు తండ్రి ఎవడో తెలియదో ఆమెను ప్రాజ్ఞుడు వివాహం చేసుకోకూడదు.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మొదటి వివాహం చేసుకునేందుకు స్వజాతి కన్యయే శ్రేష్ఠురాలు. కామికి ఈ క్రింది అనులోమ వివాహాలు శ్రేష్టము. శూద్రునికి శూద్రకన్యయే శ్రేష్టురాలు. వైశ్యునికి వైశ్య కన్య, శూద్రకన్య శ్రేష్టం. క్షత్రియునికి క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలు శ్రేష్టం. బ్రాహ్మణునికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర కన్యలు శ్రేష్టం.

మొహంచే హీనజాతి స్త్రీని వివాహం చేసుకునే బ్రాహ్మణులు తమ కులాన్ని సంతతిని శూద్రత్వం నొందిస్తున్నారు.

బ్రాహ్మణుడు శూద్రస్త్రీని వివాహం చేసుకుంటే భ్రష్టుడవుతాడని అత్రి మహర్షి, గౌతమ మహర్షి చెప్పారు. బ్రాహ్మణుడు శూద్రస్త్రీతో పుత్రుణ్ణి కంటే ఆ పిల్లవాడి తండ్రి పతితుడవుతాడని శౌనక మహాముని చెప్పాడు. బ్రాహ్మణునికి శూద్రకన్యకు పుట్టినవాడు పతితుడవుతాడని భృగుమహర్షి చెప్పారు.

శూద్ర స్త్రీని శయ్యపైకి ఎక్కించుకున్న బ్రాహ్మణుడు అధోగతి పొందుతాడు. ఆ శూద్రస్త్రీతో పిల్లల్ని కంటే బ్రాహ్మణత్వాన్నే కోల్పోతాడు.

ఏ బ్రాహ్మణుడు తన భార్య అయిన శూద్ర స్త్రీతో హోమములు, శ్రాద్ధ కర్మలు, అతిథి పూజలు జరిపిస్తాడో వాటిని దేవతలు, పితృదేవతలు గైకొనరు. అట్టి బ్రాహ్మణునికి స్వర్గలోక ప్రాప్తి లేదు.

శూద్రస్త్రీ అధరపాణం చేసినవానికి, శూద్రస్త్రీ నిట్టూర్పు సోకిన వానికి శూద్ర స్త్రీకి సంతతి పుట్టించిన వానికి ప్రాయశ్చిత్తము లేదు.


                                                                                            మనుస్మృతి (భాగం-2)
source : http://sampradayam.wordpress.com/